న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మత మార్పిడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదని, భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడానికి సమన్వయంతో ముందుకు సాగాలని మోహన్ భగవత్ ఉద్బోధించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు.‘‘మనం ఎవరినీ మతం మార్చాల్సిన అవసరం లేదు, జీవించడం ఎలాగో నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠాలు చెప్పడానికే మనం భారత దేశంలో పుట్టాం. ఎవరి ఆరాధనా విధానాన్ని మార్చకుండా మా ఆర్ఎస్ఎస్ మంచి మనుషులను తయారు చేస్తుంది’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.
ప్రపంచం మొత్తం ఒక కుటుంబమని తాము నమ్ముతామని భగవత్ అన్నారు.శుక్రవారం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) స్వాగతించింది. అనవసరమైన వివాదాలు నివారించడం సరైనదనిపిస్తోందని బీకేఎస్ పేర్కొంది.