ఆర్తులకు ఆదరణ...

ABN , First Publish Date - 2020-04-10T05:31:35+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేకమంది దాతలు

ఆర్తులకు ఆదరణ...

పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు 

విరాళాలు ఇస్తున్న దాతలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఏప్రిల్‌9: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ఆపన్నులను ఆదుకొనేందుకు అనేకమంది దాతలు ముందుకొస్తున్నారు. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా సహాయ నిధి నిమిత్తం తెనాలి డాల్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ తరఫున నంబూరు వెంకట కృష్ణమూర్తి తదితరులు రూ.7.42లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే శివకుమార్‌కు అందించారు.  


గుంటూరు 52వ డివిజన్‌  పిచుకలగుంట రజకకాలనీలో కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నితావ్యసరాలు పంపిణీ చేశారు. గుజ్జనగుండ్ల వాకింగ్‌ ట్రాక్‌ వెనుక ఏరియాలో వైసీపీ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలను అందించారు. ఏటీ అగ్రహారంలో శ్యామల బ్రహ్మారెడ్డి, వెంకటరమణదేవి ఆధ్వర్యంలో మేకతోటి దయాసాగర్‌, పోలూరి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. రౌండ్‌టేబుల్‌ సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రావి బాలకృష్ణ, రమణబోయిన అజయ్‌లు 400 మాస్కులను అందించారు. గుంటూరు విద్యానగర్‌లో  టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కసుకుర్తి హనుమంతరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, డాక్టర్‌ రాయపాటి శైలజ, మాజీ కార్పొరేటర్‌ మద్దిరాల మ్యానీ తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు అమరావతి పౌలీ్ట్ర ట్రేడర్స్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌, వెయ్యి బిస్కెట్‌ ప్యాకెట్లను అందించారు. 


గుంటూరు రైల్వే డివిజన్‌ ఇప్పటివరకు మొత్తం 35 లీటర్ల శానిటజర్‌, 3,200 మాస్కులు తయారు చేసి డ్యూటీలో ఉన్న ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ సిబ్బందికి అందజేసింది. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు నందు గల ఇటుకల తయారీకి వలస కార్మికులకు రెవెన్యూ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానం చేశారు. పెదకూరపాడులో డీసీసీబీ పాలకవర్గ సభ్యుడు బుజ్జి, నిత్యావసర సరుకులను, ప్రభుత్వ ఉద్యోగులకు మాస్కులు, గ్లౌజులు అందజేశారు.


కరోనా విపత్తు సహాయార్ధం కాకతీయ చిల్లీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అందజేసిన రూ.లక్ష చెక్కును గురువారం కలెక్టరేట్‌లో మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, డీసీసీబీ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమే్‌షగాంధీలు అందజేశారు. డి.సాంబశివరావు, వై.పుల్లారావు, మాల్యాద్రి, కృష్ణ, సుధాకర్‌ పాల్గొన్నారు.


స్థానిక సంపత్‌ నగర్‌ శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శారదా పరమేశ్వరి నిత్యన్నదాన పథకంలో భాగంగా సేవాభారతి గుంటూరు వారి సహకారంతో పోలిశెట్టి సోమసుందరం, నాగరత్నమ్మ చారిటీస్‌ ఆధ్వర్యంలో గుంటూరులో సుమారు 1,200 మంది పేదలకు రెండు పూటలా భోజనం ప్యాకెట్లను అందిస్తున్నారు. గోమాతలకు పశుగ్రాసం కూడా అందించడం జరుగుతుందని నిర్హాహకులు తెలిపారు.


నాట్కో ఫార్మా రూ.2.50 కోట్ల విరాళం

జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాట్కో ఫార్మా లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నన్నపనేని వెంకయ్య చౌదరి తన వంతుగా ఈనెల 6వ తేదీన రూ.2.50 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ముఖ్యమంత్రి సహాయక నిధికి పంపారు. రూ.1.50 కోట్ల విలువైన పీపీఇ కిట్లను, హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మందులను ఏపీఎంఎ్‌సఐడీసీ సంస్థకు అందజేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ కేర్‌ యూనిట్‌కు ప్రభుత్వం లీనియర్‌ యాక్సిలేటర్‌ వైద్య పరికరం అందజేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి నాట్కో మూడు లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ టాబ్లెట్లను అందజేశారు. 


Updated Date - 2020-04-10T05:31:35+05:30 IST