ధాన్యం డబ్బులకు అన్నదాత నిరీక్షణ

ABN , First Publish Date - 2022-05-17T06:44:44+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలకు జమ కావడంలేదు. ఆర్‌బీకేలు, వెలుగు అధికారులను అడిగితే, ధాన్యం డబ్బులను ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందని చెబుతున్నారు.

ధాన్యం డబ్బులకు అన్నదాత నిరీక్షణ
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలోకి లోడిండ్‌ చేస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

 అమలుకాని ‘మూడు వారాల్లో చెల్లింపు’ ప్రకటన

మార్చితో ముగిసిన  ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు

ఇప్పటికీ పలువురు రైతుల బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు

ఆర్‌బీకేలు, వెలుగు కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణ

తమకేమీ తెలియదంటున్న సిబ్బంది

దేవరాపల్లి, మే 16: రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలకు జమ కావడంలేదు. ఆర్‌బీకేలు, వెలుగు అధికారులను అడిగితే, ధాన్యం డబ్బులను ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందని చెబుతున్నారు. ధాన్యం విక్రయించిన మూడు వారాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్న ప్రభుత్వం తన హామీని నిలుపుకోవడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు అయితే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో  రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన తమ పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారైందని దేవరాపల్లి మండలానికి చెందిన పలువురు వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించి రెండు మూడు నెలలు దాటినా బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమకాలేదని వాపోతున్నారు. 

ప్రభుత్వానికి ధాన్యం విక్రయించే రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు (ఈ-క్రాప్‌) నమోదు చేసుకోవాలని, ధాన్యం అమ్మిన తరువాత 21 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని పాలకులు, అధికారులు గతంలో పలుమార్లు ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు మూడో వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం ఏ గ్రేడ్‌ రకానికి క్వింటా రూ.1,960, సాధారణ రకం రూ.1,940 చొప్పున రైతులకు అందుతాయని అధికారులు చెప్పారు. దీంతో పలువురు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లి విక్రయించారు. మరికొన్నిచోట్ల రైస్‌ మిల్లర్లు, ఆర్‌బీకేల సిబ్బంది నేరుగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. కాగా ధాన్యం విక్రయించి రెండు మూడు నెలలు అవుతున్నా డబ్బులు పడలేదని మండలంలోని పలు గ్రామాల రైతులు చెబుతున్నారు.  

దేవరాపల్లి మండలంలో నాగయ్యపేట, కాశీపురం, రైవాడ, మారేపల్లి, తదితర గ్రామాలకు చెందిన సుమారు 430 మంది రైతులకు ధాన్యం డబ్బులు అందలేదు. వీరిలో 17 మంది ఒక్క నాగయ్యపేటలోనే వున్నారు. వీరిలో కొంతమంది ఫిబ్రవరిలో, మరికొందరు మార్చిలో ధాన్యం విక్రయించారు. నాగయ్యపేటలో 17 మంది రైతులకు 757 బస్తాలకు ( బస్తా 40 కిలోలు) ప్రభుత్వం నుంచి రూ.5,87,432 రావల్సి ఉంది. బత్తి సన్నిబాబు 200 బస్తాల ధాన్యాన్ని ఫిబ్రవరి 25న విక్రయించారు. ఇంతవరకు డబ్బులు పడలేదు. 

జామి శ్రీరామమ్మూర్తి 31 బస్తాలు మార్చి 12న విక్రయించారు. ఇతని బ్యాంకు ఖాతాలో కూడా డబ్బులు జమకాలేదు. మార్చి నెలాఖరుతో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇదే సమయంలో ధాన్యం సేకరణ వెబ్‌సైట్‌ని కూడా మూసేసింది. దీంతో ఏయే రైతులకు ధాన్యం డబ్బులు అందలేదో అధికారులకు తెలియని పరిస్థితి ఏర్పడింది.


మూడు నెలలు దాటింది..డబ్బులు రాలేదు

-కర్రి అప్పలనాయుడు, నాగయ్యపేట, దేవరాపల్లి మండలం 

నేను గత ఖరీఫ్‌లో ఎకరా ఐదు సెంట్లలో వరి పంట సాగు చేశాను. 33 బస్తాల (40 కిలోల చొప్పున) ధాన్యాన్ని ఆర్‌బీకే ద్వారా వెలుగు సిబ్బంది సేకరించారు. ఒక రోజు రైస్‌ మిల్లు నుంచి లారీ వచ్చింది. రైతులంగా ధాన్యం తీసుకెళ్లి అప్పగించారు. నాకు రూ.24 వేల వరకు డబ్బులు వస్తామని అధికారులు చెప్పారు. ఇది జరిగి సుమారు మూడు నెలలు అవుతున్నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడలేదు.


Updated Date - 2022-05-17T06:44:44+05:30 IST