Abn logo
Sep 23 2021 @ 08:50AM

దాతల కష్టం.. రోడ్ల పాలు

నిరుపయోగంగా విశ్రాంత స్టాప్‌లు

ప్రజలకు అందని ప్రయోజనాలు

లక్షల ధనం వృథా


తెనాలిటౌన్‌: దాతల ఔదార్యం ఆవిరవుతోంది. లక్షల ఖర్చు పెట్టి ప్రజాప్రయోజనం కోసం నిర్మించిన బస్టాప్‌లు, విశ్రాంత స్టాప్‌లు నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. ఎంతో మందికి ఆసరాగా నిలవాల్సినవి ఎవ్వరికీ ఉపయోగపడకుండా పాడైపోతున్నాయి. పట్టించుకునే నాధుడు కరువైపోవడంతో వాటి గురించి ఎవ్వరికీ పట్టడం లేదు. పట్టణంలోని శివాజీ చౌక్‌, పాత గవర్నమెంటు ఆస్పత్రి, టెలిఫోన్‌ ఎక్సేంజి వంటి పలు ప్రాంతాల్లో పురపాలక సంఘం వారి అనుమతితో ప్రైవేటు సంస్థలకు చెందిన యాజమాన్యాలు ఒప్పందం చేసుకుని పన్నులు చెల్లిం చి పట్టణంలో బస్టాప్‌ల మాదిరి లక్షలు వెచ్చించి విశ్రాంత మండపాలు నిర్మించారు. అయితే అవి నిర్మించి మూడేళ్లు కావస్తున్నా వాటిని ప్రజలు మాత్రం వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు.


చెత్తా చెదారంతో నిండిపోయి..

శివాజీచౌక్‌లో ఎంతో మంది గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆటోల కోసం, బస్సుల కోసం అక్కడ వేచి ఉంటారు. ప్రకటన సంస్థ వారు అక్కడ బస్టాప్‌ నిర్మించారు. అయితే అసలు దాని లోపలకు వెళ్లేందుకే దారి లేకుండా అక్కడ తోపుడు బండ్లు, ఇతర వీధి వ్యాపారులు దానిని మూసివేశారు. దీనితో అసలు అక్కడ బస్టాప్‌ ఉందన్న సంగతినే ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ప్రయాణికులు బస్టాప్‌ లోపలకు వెళ్లకుండా దానిని మూసివేశారు.


కొబ్బరి బొండాలకు నిలయం

పాత గవర్నమెంటు ఆస్పత్రి వద్దనున్న బస్టాప్‌ దోమలు వృద్ధి చెందేం దుకు అనువైన ఖాళీ కొబ్బరి బొండాలతో నిండిపోయి కనిపిస్తుంది. నిత్యం ఈ మార్గం ద్వారా ఎంతో మంది వెళుతుంటారు. బస్టాప్‌ పక్కన, ముందు కొబ్బరి బొండాలు, తొక్కులు, చెక్కలు నిండి ఉండటంతో అక్కడ దానివైపు చూడాలనే ఆలోచనే ప్రజలకు రాదు. వర్షం వస్తున్నా దాంట్లోకి వెళదామనుకునే జనమే కనపడటం లేదంటే అవి ఎంత ఆధ్వానంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. పరిసరాలు మురికిగా ఉండటం, దుర్వాసన వస్తుండటంతో బస్టాప్‌లో కూర్చునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.


కళ్లు తెరవాలి..

మున్సిపల్‌ అధికారులు కళ్లు తెరచి చూడాలని ప్రజలు చెపుతున్నారు. దాతలు నిర్మించిన వీటిని పరిశుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రోడ్డుకు, బస్టాప్‌లకు అడ్డుగా మూసివేసి న అడ్డంకులను తొలగించి దాతల కష్టానికి ప్రతిఫలం చూపించాలని కోరుకుంటున్నారు.