నిరుద్యోగ దీక్ష కాదు.. దొంగ దీక్ష

ABN , First Publish Date - 2021-12-27T07:53:10+05:30 IST

అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణలో యువతను రెచ్చగొట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దొంగ దీక్షకు ..

నిరుద్యోగ దీక్ష కాదు.. దొంగ దీక్ష

‘రాజకీయ ఉద్యోగం’ లేక చేస్తున్న దీక్ష

మీరు చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలో

15 లక్షల ఖాళీలపై మోదీని నిలదీయాలి

రాష్ట్ర యువత పక్షాన నేను ప్రశ్నిస్తున్నా

ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పే దమ్ముందా?

హామీలను సాధించలేని సంజయ్‌ ముక్కు

నేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేటీఆర్‌ ధ్వజం

8 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం


హైదరాబాద్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణలో యువతను రెచ్చగొట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దొంగ దీక్షకు సిద్ధమవుతున్నారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సంజయ్‌ చేపట్టింది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్షని దుయ్యబట్టారు. రాష్ట్ర యువత తరఫున ప్రశ్నిస్తున్నానని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో లెక్క చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పేదరికం, నిరుద్యోగం పెరగడంతో పాటు ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ మంత్రి కేటీఆర్‌ ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు ‘రాజకీయ ఉద్యోగం’ లేక చేస్తున్నదే ‘మీ నిరుద్యోగ దీక్ష.’ రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీ, యువకులు డిగ్రీలతో బయటకు వస్తున్నారు. వీరందరికీ ప్రపంచంలో ఏ దేశం, ఏ ప్రభుత్వమూ ఉద్యోగాలు కల్పించలేదు. ‘అచ్చే దిన్‌’ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం చేశారు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ఇచ్చిన మీ హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.


యువత జీవితాలను  నాశనం చేసేందుకే..

వాస్తవాలను జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేందుకు, చదువు, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిమళ్లించి వారి జీవితాలను నాశనం చేసేందుకే దొంగ దీక్షలకు దిగుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ‘ఈ ప్రాంతానికి అద్భుత అవకాశమైన ఐటీఐఅర్‌ ప్రాజెక్టును రద్దు చేసి లక్షలాది యువత ఐటీ ఉద్యోగాలకు గండికొట్టిన బీజేపీ సిగ్గు లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతోంది. తెలంగాణ యువత మీద మాకున్నది పేగు బంధం ప్రేమ. మీలాగా ఓట్ల డ్రామా కాదు. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జోనల్‌ విధానాన్ని తెస్తే దాన్ని ఆమోదించకుండా కేంద్రం నెలల తరబడి ముప్పుతిప్పలు పెట్టింది.  బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీలో. నిలదీయాల్సింది మా ప్రభుత్వాన్ని కాదు. కేంద్రం  పరిధిలోని 9 లక్షలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలను ఎం దుకు భర్తీ చేయలేదో ప్రధానిని నిలదీయాలి. మీ రిపోర్ట్‌ కార్డును ప్రజల ముందుంచాలి’అని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు. 


యువత విజ్ఞతతో ఆలోచించాలి

తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తున్న సందర్భంలో పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని కోరితే కేంద్ర కొర్రీలు వేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. భారీగా ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, వైద్య ఉపకరణాల పార్కు, మెగా పవర్‌ లూమ్‌ పార్క్‌ వంటివెన్నో పార్కులను చేపట్టినా, బీజేపీ ఎంపీలు ఒక్కదానికీ అదనపు సాయం తీసుకురాలేని, హామీ ఇచ్చిన ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకాని స్థితిలో ఉన్నారన్నారు. దీనిపై బండి సంజయ్‌ ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కపట ప్రేమను యువత నమ్మొద్దని, వారి అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో ఆలోచించాలని కేటీఆర్‌ అన్నారు.


మీ రాష్ట్రాల్లో కల్పించిన 

ఉద్యోగాలెన్నో చెప్పండి

మోదీ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయింది, కొత్తగా ఎన్ని వచ్చాయో చెప్పాలని బీజేపీని కేటీఆర్‌ ప్రశ్నించారు.  కరోనా సంక్షోభ సమయంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా..? అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల రిజర్వేషన్‌ ఉద్యోగాలను ఎగరగొట్టిన పాపం బీజేపీకి తగులుతుందన్నారు. తెలంగాణకంటే ఎక్కువగా ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగాలిచ్చారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా.. ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాల్లో.. ఉపాధి లేక లక్షల మంది తెలంగాణకు వలస వస్తున్నది నిజం కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - 2021-12-27T07:53:10+05:30 IST