సీఎం సహాయ నిధికి విరాళాలు

ABN , First Publish Date - 2020-03-31T09:05:43+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. రాజధాని గ్రామం ఐనవోలు పరిధిలోని వెల్లూరు

సీఎం సహాయ నిధికి విరాళాలు

తుళ్లూరు, గుంటూరు(మెడికల్‌), వినుకొండ/గుంటూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.  రాజధాని గ్రామం ఐనవోలు పరిధిలోని వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) ఏపీ అమరావతి విశ్వవిద్యాలయం సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలను అందజేసింది. యాజమాన్యం, సిబ్బంది కలసి ఈ మొత్తాన్ని డిమాండు డ్రాప్ట్‌ తీసినట్టు వర్సిటీ చాన్సలర్‌ విశ్వనాథన్‌ తెలిపారు.   200 పడకల కలిగిన వర్సిటీలోని భవనాన్ని క్వారంటైన్‌ కోసం  ఉపయోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి వీఐటీ యాజమాన్యం తెలిపింది. 


కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. బోధన సిబ్బంది ఒక రోజు వేతనం రూ.30 లక్షలు, బోధనేతర సిబ్బంది ఒక రోజు వేతనం రూ.12 లక్షలు మొత్తం రూ.42 లక్షలను చెక్‌ రూపంలో సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


లలితా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేత, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పీ విజయ రూ.5 లక్షలు విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి సోమవారం చెక్‌ను కలెక్టర్‌కు అందజేశారు. మరో లక్షను ప్రధానమంత్రి సహాయ నిధికి పంపారు. గుంటూరు నగర పాలక సిబ్బంది కోసం 5 వేల మాస్కులు, 3 వేల గ్లోవ్‌లు, 100 లీటర్ల శానిటైజర్‌ లిక్విడ్‌ను కార్పొరేషన్‌ అధికారులకు అందజేశారు. 


కరోనా వైరస్‌ సహాయక చర్యలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.5 లక్షలను సీఎం సహాయనిధికి సోమవారం ప్రకటించారు. ఆకలితో అలమటిస్తున్న పేదలు, రోజువారి కూలీలు, కార్మికులకు శివశక్తి లీలా అంజన్‌ ఫౌండేషన్‌ ద్వారా భోజన ప్యాకెట్లు అందజేస్తున్నామని తెలిపారు. 


 గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తన ఎంపీ నిధుల నుంచి రూ.2,5 కోట్లు కేటాయించారు. కలెక్టర్‌ ఆనంద్‌ శ్యాముల్‌కు ఎంపీ ప్రతినిధులుగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర(నానీ), ఎంపీ కార్యాలయ సిబ్బంది దామోదర్‌చౌదరులు సోమవారం ఈ మేరకు లేఖను అందజేశారు. అలానే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 50 లీటర్ల శానిటైజర్‌ లిక్విడ్‌, ఎన్‌ 95 మాస్కులను అందజేశారు. 


బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ నిర్వాహకులు శ్రీకృష్ణమూర్తి రూ.5 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆయన ఈ తరపున పెండ్యాల ప్రసాద్‌, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జీ విజయసారథి కలెక్టర్‌కు చెక్కుని అందజేశారు.  


సీఎం సహాయ నిధికి జిల్లా సహకార, మార్కెటింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిష్టిన రూ.2.50 లక్షలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌కు అందించారు. 


జిల్లాకు చెందిన ఎన్‌ అన్నపూర్ణదేవి కలెక్టర్‌కు రూ.10,025 ఆర్థికసాయాన్ని అందించారు. 

Updated Date - 2020-03-31T09:05:43+05:30 IST