కిడ్నీ ఇచ్చి తమ్ముడికి కొత్త ఊపిరి!

ABN , First Publish Date - 2022-08-11T09:07:19+05:30 IST

కిడ్నీ ఇచ్చి తమ్ముడికి కొత్త ఊపిరి!

కిడ్నీ ఇచ్చి తమ్ముడికి కొత్త ఊపిరి!

రాఖీ వేళ అనురాగం చాటుకున్న అక్క 

సూదిమందు పేరెత్తితేనే వణికిపోయేంత సున్నితం

న్యూజిలాండ్‌ నుంచి రాక.. 2నెలల క్రితం సర్జరీ సక్సెస్‌ 

న్యూఢిల్లీ, ఆగస్టు 10: అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగానికి ప్రతీక అయిన రాఖీ పండగ.. ఈసారి ఆ సోదరుడికి మాత్రం ఎంతో ప్రత్యేకం! ఎందుకంటే తొమ్మిదేళ్లుగా డయాలసి్‌సతో నెట్టుకొస్తున్న ఆయనకు సోదరి తన కిడ్నీని ఇచ్చింది. ఇన్‌జెక్షన్‌ పేరెత్తితేనే వణికిపోయే ఆమె, తన తమ్ముడికి ఊపిరి పోసేందుకు శస్త్రచికిత్స చేయించుకుంది.. ఈ రాఖీ పండగకు ఆయనకు కొత్త జీవితాన్ని బహుమతిగా ఇచ్చింది!! సినిమాలకు కథలు రాసే 29 ఏళ్ల అమన్‌ బాత్రాకు కిడ్నీలు చెడిపోవడంతో 2013 నుంచి డయాలసి్‌సతో నెట్టుకొస్తున్నారు. ఆయన అక్క, 38 ఏళ్ల చందా గ్రోవర్‌ భర్తతో కలిసి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్నారు. ఆమె అక్కడ బ్యూటీ సెలూన్‌ ఉంది. ఇంపోర్ట్‌ బిజినెస్‌ కూడా నిర్వహిస్తున్నారామె. అమన్‌-చందాలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. తన సోదరి పేరును అమన్‌ మణికట్టు మీద పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. తమ్ముడికి కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయని తెలిసి చందా తల్లడిల్లిపోయారు. తన కిడ్నీని ఇస్తానంటూ తొమ్మిదేళ్లుగా తమ్ముడికి ఆమె చెబుతూ వస్తున్నారు. వాస్తవానికి ఆమెకు శస్త్రచికిత్స అంటే చాలా భయం. జబ్బకు చిన్న సూది మందు ఇస్తేనే వారంపాటు ఆ బాధతో చేయి ముడుచుకొని ఉండేంత సున్నితం ఆమె. అలాంటిది.. కత్తిగాట్లతో ఒంటికి గాయం చేసుకొని ఆమె తన కిడ్నీని దానం చేస్తే? ఆ ఊహనే అమన్‌ భరించలేకపోయారు. అందుకే ఆమె ప్రతిపాదనకు అమన్‌ ఇన్నాళ్లూ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా చందా అదేపనిగా ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరిలో అమన్‌ ఓకే చెప్పారు. తమ్ముడికి కిడ్నీ ఇచ్చేందుకు చందా భారత్‌కొచ్చారు. అమన్‌ బర్త్‌డే పది రోజుల తర్వాత గత జూన్‌ 11న కిడ్నీ మార్పిడి ప్రక్రియ విజయవంతమైంది. 22న అమన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అదేనెల చివర్లో చందా న్యూజిలాండ్‌ వెళ్లిపోయారు. అన్నట్టు.. అమన్‌ తన ఫోన్‌లో తన అక్క నంబరును ‘ప్రిన్సిపల్‌ మేడమ్‌’ అని సేవ్‌ చేసుకున్నారు!! ఎందుకు? తన ఆరోగ్యం గురించి తన కన్నా ఎక్కువగా కేర్‌ తీసుకుంటుందనే! ఈసారి ఈ తోబుట్టువులు రాఖీ పండగని వర్చువల్‌గానే సెలిబ్రేట్‌ చేసుకుంటారట!!  

Updated Date - 2022-08-11T09:07:19+05:30 IST