ట్రంప్ ఇకపై నివసించేది ఈ ఇంద్రభవనంలోనే..!

ABN , First Publish Date - 2021-01-20T22:01:22+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ ఇకపై ఎక్కడ నివసించనున్నారన్న

ట్రంప్ ఇకపై నివసించేది ఈ ఇంద్రభవనంలోనే..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ ఇకపై ఎక్కడ నివసించనున్నారన్న దానిపై చర్చ సాగుతోంది. అయితే అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు షిఫ్ట్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ సమీపంలో ట్రంప్‌కు చెందిన భారీ మారాలాగో ఎస్టేట్‌లో ఇకపై ట్రంప్ నివసించబోతున్నట్టు మీడియా చెబుతోంది. ఈ ఎస్టేట్‌ లోపలకు, బయటకు ఇప్పటికే అనేక ట్రక్‌లు తిరుగుతున్నాయి. దీంతో ట్రంప్ ఉండబోయేది ఇక్కడే అని అర్థమవుతోంది. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే కొద్ది గంటల ముందే ట్రంప్ ఈ ఎస్టేట్‌కు చేరుకోనున్నారు. 


నిజానికి ట్రంప్ న్యూయార్క్‌లోనే మొదటి నుంచి జీవిస్తూ వచ్చారు. 2019లో ఆయన తన ఇంటి అడ్రస్‌ను న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు మార్చుకున్నారు. శీతాకాలం వచ్చిందంటే ట్రంప్ ఫ్లోరిడాలోని మారాలాగో ఎస్టేట్‌లోనే ఉంటూ వచ్చారు. చాలా మంది ఈ ఎస్టేట్‌ను వింటర్ వైట్‌హౌస్ అని కూడా పిలుస్తుంటారు. మారాలాగో ఎస్టేట్‌ను ట్రంప్ 1985లో పది మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 73 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. అనంతరం దాన్ని ప్రైవేటు క్లబ్‌గా మార్చుకున్న ఆయన.. అధ్యక్షుడయ్యాక తన శీతాకాల నివాసంగా మార్చుకున్నారు. 


క్లబ్ మెంబర్‌షిప్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ ఎస్టేట్‌లోకి ప్రవేశం ఉంటుంది. 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎస్టేట్‌‌ను 1927లో నిర్మించారు. ఇందులో మొత్తం 128 గదులు ఉంటాయి. అంతేకాకుండా 20 వేల స్క్వేర్ ఫీట్ బాల్‌రూమ్, ఐదు టెన్నిస్ కోర్ట్‌లు, భారీ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఫ్లోరిడాలో రెండో అతిపెద్ద మేన్షన్‌గా మారాలోగోకు పేరు. ఈ ఎస్టేట్ నుంచి అట్లాంటిక్ సముద్ర అందాలను వీక్షించవచ్చు.

Updated Date - 2021-01-20T22:01:22+05:30 IST