అమెరికా అధ్యక్షుల భారత్ టూర్.. కొత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్

ABN , First Publish Date - 2020-02-24T01:32:25+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్నారు.

అమెరికా అధ్యక్షుల భారత్ టూర్.. కొత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24 అంటే.. సోమవారం ఉదయం 11.40 గంటలకు ఆయన భారత్ చేరుకోనున్నారు. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమానికి ఆయన వెళ్లనున్నారు. మధ్యాహ్నం మొతెరా స్టేడియాంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొననున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఇక రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమానికి ట్రంప్ హాజరుకానున్నారు. ఆ తరువాత రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ట్రంప్, మోదీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. తదుపరి ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇక చివరగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు తిరిగి ఆయన అమెరికాకు తిరుగు పయనమవుతారు.


ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్.. ఆమె భర్త జారెడ్ కుష్‌నర్ కూడా భారత్ పర్యటనకు రానున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది అమెరికా అధ్యక్షులు భారత పర్యటనకు వచ్చినప్పటికి.. వారిలో ఏ ఒక్కరూ కుటుంబసమేతంగా రాలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూతురు, అల్లుడు కూడా భారత పర్యటనలో భాగం కానున్నారు. దీంతో కుటుంబసమేతంగా భారత్‌ను సందర్శించనున్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు సృష్టించనున్నారు.


గతంలో చూస్తే.. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు వచ్చారు. అయితే ఆ పర్యటనలో ఆయన తన భార్య హిల్లరీ క్లింటన్‌ను తీసుకురాలేదు. ఆ పర్యటనలో బిల్ క్లింటన్ తన కుమార్తెతో కలిసి భారత పర్యటనకు వచ్చారు. బరాక్ ఒబామా సైతం తన భార్యను తప్ప పిల్లలను తీసుకురాలేదు. జిమ్మీ కార్టర్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ బుష్ కూడా భారత పర్యటనకు భార్యతోనే వచ్చారు తప్ప.. పిల్లలను వెంటబెట్టుకు రాలేదు. కాగా.. అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ భారత్‌కు వస్తుండటంతో.. భారతీయులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడుతారా అన్నది ఆసక్తికంగా ఉంది.   

Updated Date - 2020-02-24T01:32:25+05:30 IST