Abn logo
Feb 25 2020 @ 09:54AM

LIVE: భారత్‌లో ట్రంప్ రెండో రోజు పర్యటన

@2.50PM

ఆశ్చర్యపరుస్తున్న మెలానియా, డ్రెస్‌పై కమలం చిత్రాలతో..

న్యూఢిల్లీ: ట్రంప్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్మామ్య వివరాలు ఎంతటి ఆసక్తిని రేపుతాయో.. ప్రథమ మహిళ వస్త్రధారణ పట్ల కూడా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. పర్యటన మొదటి రోజున తెల్లటి దుస్తుల్లో రాజ హంసలాగా మెరిసిన మెలానియా రెండో రోజు కూడా వస్త్రధారణలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. రకరకాల కమలం పువ్వులు ఉన్న తెల్లటి దుస్తుల్లో ఆమె రెండో రోజు కూడా చూపరులలో ఆసక్తి కలిగించారు.కమలం అంటే జాతీయ పుష్పం. అది భారతీయ జనతా పార్టీ అధికారిక చిహ్నం కూడా. ఇది కాకతాళీయమే అయినప్పటికీ.. మెలానియా ధరించిన దుస్తులు ప్రస్తుతం ఫ్యాషన్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ డ్రెస్ ఖరీదు దాదాపు 1.15లక్షల రూపాయలు.


ఇక భారత్‌కు ప్రయాణమయ్యే సమయంలో మెలానియా.. భారత్ డిజైనర్ రూపొందించిన చెక్కర్డ్ ప్యాంట్స్ ధరించిన విషయం తెలిసిందే. భారత్‌లో అడుగుపెట్టే సమయంలో భారత్‌ విశేషాలను గుర్తు చేసే ఓ సాష్ కూడా ధరించారు. రెండో రోజు కూడా భారత జాతీయ పుష్పం అయిన కమలాన్ని గుర్తు చేసేలా వస్త్రాలను ఎంచుకున్నారు. దీంతో..ఫ్యాషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడి దౌత్యనీతిని కొనసాగిస్తున్నారంటూ మెలానియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


@2.23PM

చర్చల అనంతరం ఇరు దేశాల అధిపతులు ఏం చెప్పారంటే...

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ- ట్రంప్‌ కీలక చర్చలు జరిపారు. ఆరోగ్యం, ఆయిల్‌ కార్పొరేషన్లపై మూడు ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం... ట్రంప్‌-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మోదీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ సతీసమేతంగా భారత్‌ రావడం ఆనందం కలిగించిందని, గత ఎనిమిది నెలల్లో తానూ, ట్రంప్‌ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు.

అమెరికా-భారత్‌ మధ్య స్నేహ బంధం పెరిగిందని, 21వ శతాబ్దానికి అమెరికా-భారత్‌ స్నేహం ముఖ్యమైందని చెప్పారు. అమెరికా-భారత్‌ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని, డ్రగ్స్‌పైనా నిరంతరం పోరాడుతున్నామని ప్రధాని మోదీ మీడియా సమావేశంలో చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌ పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఫలవంతమైన పర్యటనగా ఇది ఉంటుందని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని ట్రంప్‌ తెలిపారు. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని, సరిహద్దు ఉగ్రవాదంపై చర్చించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు.

రక్షణ ఒప్పందాలపై చర్చించామని, 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు. అపాచీ, ఎం-16 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని వివరించారు. ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, చొరబాట్లు ఎక్కువైపోయాయని, 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. తాను అధ్యక్షుడిని అయ్యాక భారత్‌తో ఆర్థిక బంధం పెరిగిందని.. భారత్‌తో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.


@1.56PM

భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు

న్యూఢిల్లీ: భారత్- అమెరికా మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణాంశాల్లో రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రంప్-మోదీ మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వీసాల గురించి ట్రంప్ వద్ద మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. చర్చల సందర్భంగా ట్రంప్‌కు మోదీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రపంచ నేతకు భారత్‌లో ఈ స్థాయిలో ఘనస్వాగతం ఇంతకుముందు ఎప్పుడూ పలకలేదని మోదీ అన్నారు. ట్రంప్ కూడా భారత్ ఆతిధ్యానికి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. వాణిజ్య, రక్షణ రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకుసాగుతాయని అన్నారు. నిన్న, ఇవాళ అద్భుతంగా గడిచాయని చెప్పారు.

అంతుకుమందు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్, మోదీ ఘనస్వాగతం పలికారు. కోవింద్ సతీమణి ట్రంప్ దంపతులకు రెండు చేతులు జోడించి నమస్కారం అంటూ ఆహ్వానించారు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్  ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌కు వెళ్లారు. హ్యాపీనెస్ క్లాసులను పరిశీలించారు. గంట పాటు మెలానియా ఈ స్కూల్లో గడిపారు. మెలానియా స్కూలు రావడంతో అక్కడ విద్యార్థులు సాదర స్వాగతం పలికారు.


@12.38PM

ట్రంప్ బస చేసిన హోటల్‌లో కమెండోలు, షార్ప్ షూటర్లతో పహరా

న్యూఢిల్లీ : అగ్రరాజ్యమైన అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబసభ్యులు బస చేసిన ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్‌లో పలు కీలక విభాగాల కమెండోలు, షార్ప్ షూటర్లతో భారీ భద్రత కల్పించారు. ట్రంప్ బస చేసిన హోటల్ లో ఐదంచెల భద్రత కల్పించారు. మొదటి రెండు అంచెల భద్రతలో అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ అధికారులను నియమించారు. మౌర్యా హోటల్ లాబీలు, పార్కింగ్, లాన్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు సెక్యూరిటీ విభాగం అధికారులు తనిఖీలు చేస్తూ పహరా కాస్తున్నారు.

మౌర్యా హోటల్‌లోని  ప్రతీ అంతస్తులో నేషనల్ సెక్యూరిటీ గార్డులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు నిరంతరం గస్తీగా తిరుగుతున్నారు. భద్రతా కారణాల రీత్యా హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. హోటల్ ఉద్యోగులను కూడా ట్రంప్ బస చేసిన ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోకి అనుమతించడం లేదని ఓ భద్రతాధికారి చెప్పారు.

మొట్టమొదటిసారి మౌర్యా హోటల్ లో ఉన్న 438 గదులను ఖాళీ చేయించి అమెరికన్ల కోసం వీటిని కేటాయించారు. అత్యంత అధునాతన ఆయుధాలతో అమెరికన్ సీక్రెట్ సర్వీసు జవాన్లు వెయ్యిమంది ట్రంప్ కుటుంబ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ హోటల్ చుట్టుపక్కల భవనాలపై కమాండోలు, షార్ప్ షూటర్లను రంగంలోకి దించి నిరంతరం డేగకళ్లతో నిఘా వేశారు. హోటల్ ముందు రోడ్డును మూసివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు.ట్రంప్ కాన్వాయ్ వెళుతున్న ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటిస్తున్న రాజ్ ఘాట్, రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ హౌస్ ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరించారు.


@12.24PM

హారతి పట్టి.. నుదిటిన తిలకం దిద్ది.. మెలానియాకు ఘనస్వాగతం

ఢిల్లీ: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ దేశరాజధానిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీ బాగ్‌లో ఉన్న సర్వోదయ కో-ఎడ్ సీనియర్ సెకండరీ స్కూల్‌ ‘హ్యాపినెస్ క్లాస్‌’కు హాజరైన ఆమెకు అక్కడి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. మంగళహారతులు పట్టి.. నుదిటిన తిలకం దిద్ది ఆమెను స్వాగతించారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు. 15-20 నిమిషాల పాటు ఆమె అక్కడి విద్యార్థులతో గడపనున్నారు. ఆమె రాకతో ఆ స్కూల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో మెరిశారు. 


@12.22PM

హైదరాబాద్ హౌస్‌లో మోదీ-ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ: హైదరాబాద్ హౌస్‌లో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతున్నాయి. పలు ఒప్పందాలపై మోదీ, ట్రంప్ సంతకాలు చేయనున్నారు. చర్చల అనంతరం ఇరువురూ మీడియా ముందుకు రానున్నారు. ప్రస్తుత భేటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చర్చల్లో వాణిజ్యంతోపాటు, రక్షణ ఒప్పందాలు ఉంటాయని సమాచారం. ఈసారి ట్రేడ్ డీల్ కుదురుతుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. అమెరికా ప్రతినిధులు మాత్రం భారత్‌లో మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా డెయిరీ, పౌల్ట్రీ  కంపెనీలు భారత్‌లో దిగుమతులకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పటికే భారత్-అమెరికా మధ్య పన్నుల విషయంలో వివాదం ముదిరింది. అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు అమెరికా ప్రతిపాదనలకు తలొగ్గితే మరిన్ని షరతులు పెడతారనే మాట కూడా వినిపిస్తోంది. భారత్ మాత్రం మన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీల్ కుదుర్చుకోవాలని చూస్తోంది.

మరోవైపు మెలానియా ట్రంప్  ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌కు వెళ్లారు. హ్యాపీనెస్ క్లాసులను పరిశీలిస్తున్నారు. గంట పాటు మెలానియా ఈ స్కూల్లో గడపనున్నారు. మెలానియా స్కూలు రావడంతో అక్కడ విద్యార్థులు సాదర స్వాగతం పలికారు.


@12.05PM

మహాత్ముడికి నివాళుల అనంతరం విజిటర్స్ బుక్‌లో ట్రంప్ ఏం రాశారంటే...

న్యూఢిల్లీ: రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. బాపూ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ట్రంప్ ఓ సందేశాన్ని రాశారు. మహాత్ముడి ఆకాంక్షల మేరకు నిర్మితమైన సార్వభౌమ, అద్భుతమైన భారత్‌కు అమెరికా ప్రజలు అండగా ఉంటారని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని ట్రంప్ విజిటర్స్ బుక్‌లో రాశారు.


@11.33AM

తెల్లరంగు పూల మిడ్డీలో మెరిసిన మెలానియా ట్రంప్

న్యూఢిల్లీ : భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ రెండోరోజు తెలుపురంగు పూల మిడ్డీతో మెరిశారు. తెల్లరంగుపై ఎరుపు, నీలం, పసుపు, పచ్చని రంగురంగుల పూలతో కూడిన మిడ్డీని మెలానియా ధరించారు. ఎర్రరంగు బెల్టు పెట్టుకొని తన భర్త ట్రంప్‌తో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. రెండువైపులా జుట్టును వదులుగా వదిలిన మెలానియా తెల్లరంగు మిడ్డీలో మెరిశారు. రాజ్ ఘాట్‌ను సందర్శించిన మెలానియా అనంతరం ఢిల్లీలోని పాఠశాలను సందర్శించనున్నారు. 


@11.00AM

రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి ట్రంప్ దంపతుల నివాళులు

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌లు మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమాధిని సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ సమాధి వద్ద ట్రంప్ దంపతులు పుష్పగుచ్ఛాన్ని ఉంచి నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా రాజ్‌ఘాట్ కు వచ్చిన ట్రంప్ దంపతులు గాంధీజీ సమాధిని సందర్శించిన అనంతరం హైదరాబాద్ హౌస్ కు వచ్చారు. రాజ్ ఘాట్ వద్ద విజిటర్స్ బుక్ లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రాజ్ ఘాట్ ఆవరణలో ట్రంప్ ఓ మొక్క నాటారు. ట్రంప్ దంపతుల వెంట కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఉన్నారు


@10.34AM

తెల్లరంగు సూట్‌లో మెరిసిన ఇవాంకా ట్రంప్

ఢిల్లీ : భారత పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ గారాలపట్టి అయిన ఇవాంకా ట్రంప్ తెల్లరంగు సూట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండో రోజు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సీనియర్ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ఆల్ వైట్ సూటుతో మెరిశారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడి రాకకు ముందే ఇవాంకా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అనంతరం ఇవాంకా ట్రంప్ రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. ఇవాంకా ట్రంప్ తన జట్టును వదులుగా వదిలి బటన్‌లతో కూడిన తెల్లరంగు సూట్ ధరించారు. రాష్ట్రపతి భవన్‌లో ధవళ వస్త్రాలతో ఇవాంకా ధగధగలాడారు. 


@10.14AM

ట్రంప్ గౌరవార్థం మోదీ విందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఇచ్చే విందు సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొందరు కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులను ఆహ్వానించారు. విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలకు ప్రధాని ఇచ్చే విందుకు ఆహ్వానించారు.

ట్రంప్ పాల్గొనే విందులో రిలయెన్స్ పరిశ్రమల ఛైర్మన్ ముకేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహింద్రా, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టి సీఈవో సుబ్రమణ్యన్, భారతి ఎంటర్ ప్రెజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, ఎల్ ఎన్ మిట్టల్, ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా, వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్, ఇన్పోసిస్ ఎండీ సలీల్ పరేఖ్, హిందూస్థాన్ యూనీలివర్ సీఈవో సంజీవ్ మెహతాలను ఆహ్వానించారు. ఈ విందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, కేంద్ర కార్యదర్శులు అజయ్ భల్లా, అమితాబ్ కాంత్, పీకే మిశ్రా, బిపిన్ రావత్ లను ఆహ్వానించారు.


@9.59AM

ట్రంప్‌, మెలానియా, ఇవాంకకు కేసీఆర్ స్పెషల్‌ గిఫ్ట్‌

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చేందుకు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్‌ మెమెంటోను కేసీఆర్ అందించనున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోచంపల్లి, గద్వాల్‌ చీరలను.. మెలానియా, ఇవాంకకు బహూకరించేందుకు కేసీఆర్ స్పెషల్‌గా తయారు చేయించారు. గతంలో కూడా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇవాంకకు కేసీఆర్ ప్రత్యేక బహుమతి అందజేసిన విషయం తెలిసిందే.

కాగా.. ట్రంప్ పర్యటన సందర్భంగా నేటి సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ విందుకు కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్, హరియాణా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. 


ఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో  రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. ఉదయం 10.30కి రాజ్ ఘాట్‌లో మహాత్మునికి ప్రధాని మోదీ, ట్రంప్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం కీలక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందుకు హాజరుకానున్నారు.  

Advertisement
Advertisement
Advertisement