ట్రంప్, బైడెన్ మధ్య ఫైనల్ డిబేట్.. అంతుచిక్కని ప్రశ్నలు!

ABN , First Publish Date - 2020-10-23T01:48:35+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు చివరి డిబేట్‌లో పాల్గొనడానికి ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొద్ది గంటల్లో (భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 23న ఉదయం 6.30 గంటలకు) డొనాల్డ్ ట్రంప్,

ట్రంప్, బైడెన్ మధ్య ఫైనల్ డిబేట్.. అంతుచిక్కని ప్రశ్నలు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు చివరి డిబేట్‌లో పాల్గొనడానికి ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొద్ది గంటల్లో (భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 23న ఉదయం 6.30 గంటలకు) డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య వాడివేడి చర్చ మొదలుకానుంది. వీరిద్దరి మధ్య జరిగే సంవాదాన్ని తిలకించేందుకు యావత్ అమెరికా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 12 రోజుల ముందు జరిగే ఈ చర్చపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. 


ట్రంప్ తన పంథాను మార్చుకుంటారా?

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో కంటే డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌నే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నారని ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. మొదటి డిబేట్‌లో ఫలవంతమైన చర్చ జరగలేదు. సెప్టెంబర్ 29న జరిగిన తొలి ముఖాముఖిలో ప్రత్యర్థిని దూషించడానికి, ఆరోపణలు చేయడానికే ట్రంప్ ఎక్కువ సమయం కేటాయించారు. అధ్యక్షుడి మొండి వైఖరి వల్ల అక్టోబర్ 15న జరగాల్సిన డిబేట్‌ క్యాన్సల్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 22న జరిగే రెండవ, చివరి డిబేట్‌లో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గతంలో మాదిరిగా వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకే పరిమితం అవుతారా? లేక సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. ఓటర్లను తన వైపునకు తిప్పుకునే  మార్గంపై దృష్టి పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. 


‘మ్యూట్ బటన్’ రచ్చను ఎంత వరకు అడ్డుకుంటుంది?

అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 29న నిర్వహించిన తొలి డిబేట్‌లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని.. ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ చివరి డిబేట్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒకరు మాట్లాడుతోంటే.. మరొకరు మధ్యలో అడ్డుపడకుండా ఉండేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టుంది. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు అడ్డుపడకుండా మ్యూట్ బటన్‌ను ప్రవేశపెట్టింది. ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరు కలగజేసుకుని చర్చను పక్కదోవ పట్టించకుండా ప్రత్యర్థి మైక్‌ను మ్యూట్‌లో పెట్టాలని నిర్ణయించింది. కమిషన్ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. 90 నిమిషాల చర్చలో కేవలం 24 నిమిషాలు మాత్రమే ఈ మ్యూట్ బటన్‌ను వినియోగించనున్నట్లు ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ ప్రకటించింది. అంతేకాకుండా మిగిలిన 66 నిమిషాల్లో అభ్యర్థులు సంవాదం జరుపుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో కమిషన్ ప్రవేశపెట్టిన మ్యూట్ బటన్ విధానం ఎంత వరకు రచ్చను అడ్డుకుంటుందనేది సందేహంగా మారింది. 


కరోనా కట్టడిలో విఫలమయ్యారనే అపవాదును ట్రంప్ తుడుచేసుకుంటారా?

‘కరోనా కట్టడిలో ట్రంప్ విఫమయ్యారు. మహమ్మారిని అధ్యక్షుడు సీరియస్‌గా తీసుకోలేదు. అందువల్లే అగ్రరాజ్యం శవాలదిబ్బగా మారింది. ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడటానికి డొనాల్డ్ ట్రంపే కారణం’ ఇవీ అమెరికా అధ్యక్షుడిపై డెమొక్రటిక్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. అయితే ట్రంప్ మాత్రం కొవిడ్‌ను ఎదుర్కోవడానికి తాను సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాని, ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే ఎక్కువ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగాయని చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరపడం వల్లే భారీగా కేసులు బయటపడ్డాయని, తద్వారా కొవిడ్ రోగులకు సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించామని ట్రంప్  వాదిస్తున్నారు. కాగా.. మహమ్మారిని కట్టడి చేయడానికి ట్రంప్ తీసుకున్న చర్యలను వివరించడానికి ఈ డిబేట్ ఓ మంచి వేదికగా ట్రంప్‌కు ఉపయోగపడనుంది. ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయడానికి, అమెరికాలో కరోనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రజలకు నేరుగా వివరించడానికి ట్రంప్‌కు ఇదే మంచి అవకాశం. అయితే ట్రంప్ దీన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. 


అవినీతి ఆరోపణలను బైడెన్ ఎలా ఎదుర్కొనబోతున్నారు?

హంటర్ బైడెన్ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు అంటూ గత డిబేట్‌లో ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కలుగజేసుకుని తన కొడుకు (హంటర్ బైడెన్)పై ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. అంతేకాకుండా తన కొడుకును చూస్తే గర్వంగా ఉందని.. లక్షలాది మంది అమెరికన్ల మాదిరిగానే ఆ అలవాటును నుంచి బయటపడ్డాడని జో బైడెన్ స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ బృందానికి హంటర్ బైడెన్‌కు సంబంధించిన ఓ అంశం ఆయుధంగా మారింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ పని చేసినప్పుడు.. హంటర్ బైడెన్ అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికాలో ఓ ప్రముఖ పత్రిక కథనాలు వెలువరించింది. ఈ నేపథ్యంలో పత్రిక కథనాలను ఆసరాగా చేసుకుని ట్రంప్ ప్రచార బృందం జో బైడెన్‌పై విమర్శలను ఎక్కుపెట్టింది. హంటర్ బైడెన్ అవినీతికి పాల్పడ్డాడు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తోపాటు అతని కుమారుడిపై వెంటనే దర్యాప్తు జరపాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. కాగా.. హంటర్ బైడెన్ అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రిపబ్లిక్ నేతలు చెబుతున్నారు. గురువారం రోజు జరగబోయే డిబేట్‌లో హంటర్‌ అవినీతికి సంబంధించిన ఆధారాలను ట్రంప్ బయటపెడతారా? అమెరికా అధ్యక్షుడు తన కొడుకుపై చేసే ఆరోపణలకు జో బైడెన్ ఏ రకంగా స్పందిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


ఇదిలా ఉంటే.. పై నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే గురువారం రోజు టెన్నెసీలోని నాష్‌విల్‌లో జరిగే మూడో డిబేట్ పూర్తయ్యేదాకా వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-10-23T01:48:35+05:30 IST