Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీలో ఆగని ఆధిపత్య పోరు

  •  రాజమహేంద్రవరంలో గ్రూపుల గోలతో కార్యకర్తల్లో అయోమయం
  •  నేడు మళ్లీ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి రాక

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీలో నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.  ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను స్వయంగా సీఎం పిలిచి ఇద్దరికీ వార్నింగ్‌ ఇచ్చినా ఎవరూ తగ్గలేదు. ఫిబ్రవరిలో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ పార్టీ నేతలతో మాత్రం సఖ్యత కుదరడం లేదు. కార్పొరేషన్‌ ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థే మేయర్‌గా ఎన్నికవుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ కానీ, తర్వాత వైసీపీ కానీ ఇక్కడ అధికారం చేపట్టలేకపోయాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రయత్నం చేసినప్పటికీ తెలుగుదేశం బలం ముందు వారి ఎత్తుగడలు సాగలేదు. కానీ ఇవాళ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా మేయర్‌ పదవి ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  కొద్దిరోజుల కిందట ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ రోడ్డెక్కారు. ఈ పంచాయతీ సీఎం వద్ద కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. మళ్లీ రాజకీయం మొదలెట్టారు. కొద్దిరోజుల కిందట నగర పార్టీ అధ్యక్షుడు  నందెపు  శ్రీనివాస్‌, పలువురు నగర ఇన్‌చార్జిలు, పార్టీ నేతలు.. వైవీ సుబ్బారెడ్డి వద్దకు వెళ్లి బల ప్రదర్శన చేశారు. వీరి వెనుక ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌, మాజీ వైసీపీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఇటీవల ఎంపీ భరత్‌ వర్గం వైవీ వద్దకు వెళ్లి బల ప్రదర్శన చేసింది. ఈ రెండు వర్గాలు వచ్చే ఎన్నికల్లో సిటీపై పెత్తనం తమకు కావాలంటే తమకు కావాలనే ఆలోచనతో ఉన్నారు.ఎంపీతో విభేదించడంతో శ్రీఘాకోళ్లపు తన కోఆర్డినేటర్‌ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన మౌనంగానే ఉండిపోయారు. ఆయన స్థానంలో కోఆర్డినేటర్‌గా వచ్చి న ఆకుల సత్యనారాయణ కొద్దిరోజులు చురుకుగా పనిచేసినప్పటికీ తర్వాత వ్యక్తిగత కారణాలంటూ అసలు పార్టీ కార్యక్రమాలకే హాజరుకావడం లేదు. ప్రస్తుతం సిటీకి కోఆర్దినేటర్‌ ఎవరూ లేని పరిస్థితి ఏర్పడింది. ఇక సిటీలో నేతలు కూడా ఎక్కువ కావడం వల్ల గ్రూపులు కూడా ఎక్కువ అయ్యాయి. ఎంపీ వర్గం ఒకటి కాగా, రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ ఎంపీతోనే ఉంటారు. కానీ తనకంటూ ఒకవర్గాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉండడం గమనార్హం. ఇక రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇల్లు సిటీలోనే ఉండడంతోపాటు, తన తండ్రి రామ్మోహన్‌రావు దగ్గర నుంచి సిటీతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇక శ్రీఘాకోళ్లపు సుబ్రమ్మణ్యం తనకంటూ ఒక ప్రత్యేక వర్గా న్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. జక్కంపూడి రాజాతో కలిసి ఉంటూనే తన వర్గాన్ని ఆయన నిలబెట్టుకోవడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా మళ్లీ కోఆర్డిర్‌ పదవిని దక్కించుకునే ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం. ఆయన కూడా ఒక వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. కొత్తగా రుడా చైర్‌పర్శన్‌ మేడపాటి షర్మిళారెడ్డి అన్ని వర్గాలతో కలివిడిగానే ఉంటూ పార్టీలో పట్టుపెంచుకుంటున్నారు. తనకు లభించిన పదవి, అధిష్ఠానం వద్ద తనకు ఉన్న పలుకుబడితో ఆమె ప్రజల్లోకి వెళుతూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుత సిటీ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ మొదట అన్నివర్గాలతో కలిసి ఉండేవారు. ఇటీవల రాజాకు, శ్రీఘాకోళ్లపుకు దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఆయ నకు చెక్‌ పెట్టడానికి నగర అధ్యక్ష పదవికి చెల్లుబోయిన సూర్యనారాయణ, అజ్జరపు వాసు పేర్లను తెరమీదకు తెచ్చారు. దీని వెనుక ఎంపీ వర్గం వ్యూహం ఉన్నట్టు ప్రచారం జరు గుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌  వైవీ సుబ్బారెడ్డి శనివారం రాజమహేంద్రవరం రానున్నారు.

Advertisement
Advertisement