తయారీనే తారకమంత్రం

ABN , First Publish Date - 2020-06-20T07:48:34+05:30 IST

‘‘కరోనా నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ వేరే దేశాలకు తరలిపోవడానికి సిద్ధమయ్యాయి’’ .. ఈ వార్తతో భారతీయులు చాలామంది మదిలో మెదిలిన మాట ‘సంక్షోభంలో అవకాశమిది. ఆ కంపెనీలను భారత్‌కు రప్పించుకుందాం’ అని! కానీ, చైనా నుంచి తరలిపోవడానికి సిద్ధమైనవాటిలో చాలావరకూ ఉత్పత్తి విభాగాలే...

తయారీనే తారకమంత్రం

మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యాల కల్పన విధానాలతో దూసుకుపోతున్న చైనా


‘‘కరోనా నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ వేరే దేశాలకు తరలిపోవడానికి సిద్ధమయ్యాయి’’ .. ఈ వార్తతో భారతీయులు చాలామంది మదిలో మెదిలిన మాట ‘సంక్షోభంలో అవకాశమిది. ఆ కంపెనీలను భారత్‌కు రప్పించుకుందాం’ అని! కానీ, చైనా నుంచి తరలిపోవడానికి సిద్ధమైనవాటిలో చాలావరకూ ఉత్పత్తి విభాగాలే. అవి సేవల రంగానికి సంబంధించినవి కావు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు.. ఇలా సర్వీస్‌ సెక్టర్‌లోనే భారత్‌ బలంగా ఉంది తప్ప ఉత్పత్తి రంగంలో చైనాతో పోలిస్తే భారత్‌ మైళ్ల దూరం వెనకబడి ఉంది. భారత్‌ కూడా ముడిపదార్థాలకు చైనాపైనే ఆధారపడి ఉంది. ఇదీ మన ప్రస్తుత పరిస్థితి!!


భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ‘మేకిన్‌ ఇండియా’ నినాదం ఇచ్చేనాటికి మన స్థూల జాతీయోత్పత్తిలో ఉత్పత్తి రంగం వాటా 15 శాతం! ఐదేళ్లు గడిచాక.. అంటే 2019లో చూస్తే అది 14 శాతానికి తగ్గింది. ఉత్పత్తి రంగం విషయంలో భారత్‌ వెనకబాటుతనానికి అద్దం పట్టే గణాంకాలివి. ఉత్పత్తికి సంబంధించి మన దేశంలో ఏ రంగంపై దృష్టిపెడితే మంచి ఫలితాలు వస్తాయి, ఏ రంగానికి మన దగ్గర పెద్దగా అవకాశాలు లేవు అనే విషయాన్ని విశ్లేషించకుండా విధానాలను రూపొందించడమే ఈ సమస్యకు కారణమని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మనదేశంలో తయారీ విధానంతో అత్యధిక లబ్ధి పొందింది సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ. 2014లో మనదేశంలో కేవలం రెండు సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్లు ఉండేవి. 2019నాటికి ఆ సంఖ్య 260కి చేరింది. సెల్‌ఫోన్ల తయారీలో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా (మొదటి స్థానంలో చైనా ఉంది) నిలిచింది. అదీ కేవలం ఐదేళ్ల వ్యవధిలో. అంటే.. ‘మేకిన్‌ ఇండియా’ ఫలించే విధానమే. దేనికి ప్రాధాన్యమివ్వాలన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితికి కారణం. అలా నిర్ణీత రంగాల మీద ప్రధానంగా దృష్టిసారించడాన్ని ‘టార్గెట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌’ అంటారు. ప్రాథమికస్థాయిలో ఆ రంగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి, ఆ తర్వాత మిగతా రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎక్కువగా ఉపయోగాలుంటాయన్నది నిపుణుల మాట.


2019-20 ఆర్థిక సర్వే కూడా ప్రభుత్వానికి ఇదే సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందికి అవసరమయ్యే వస్తువుల(నెట్‌వర్క్‌ ప్రోడక్ట్స్‌)పై ప్రధానంగా దృష్టిసారించడమే చైనా విజయాలకు కారణం. అయితే, చైనాకు ఆ స్థానం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. దాని వెనుక 30 ఏళ్ల కృషి, వ్యూహం ఉన్నాయి. ముఖ్యంగా.. నైపుణ్యాల పెంపు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన (రవాణా సౌకర్యాలు, నిరంతర విద్యుత్‌ వంటివి), సరైన విధానాల రూపకల్పన అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా మూడు దశాబ్దాల్లో ఉత్పత్తి హబ్‌గా మారింది. అంతకుముందు చైనా కూడా భారతదేశం లాగా వ్యవసాయ ఆధారిత దేశమే. అయితే, గ్లోబలైజేషన్‌ పుణ్యమాని చాలా  వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు చాలావరకూ సేవల ఆధారిత, ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా మార్పు చెందాయి. వాటిలో భారత్‌ సేవల రంగానికే పరిమితం కాగా.. చైనా ఉత్పత్తి రంగాన్ని ఏలుతోంది. రెండింటికీ తేడా ఏంటంటే.. సేవా రంగంలో ఉద్యోగాలు పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితమవుతాయి. నిపుణులు, అత్యున్నతస్థాయి నైపుణ్యాలు ఉన్నవారికి  మాత్రమే సేవారంగంలో ఉద్యోగాలుంటాయి. కాల్‌సెంటర్ల వంటివాటి ద్వారా తగుమాత్ర నైపుణ్యాలున్నవారికి (సెమీ స్కిల్డ్‌) కూడా ఉద్యోగాలు లభించినా.. వాటి సంఖ్య చాలా తక్కువ. అదే ఉత్పత్తి రంగంపై దృష్టిసారిస్తే.. సెమీ స్కిల్డ్‌ వారికి కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. 


చైనానే ఎందుకు?

చైనాలోలాగానే మనదేశంలో కూడా మానవ వనరులు అధికం. ఉత్పత్తి రంగాల్లో పనిచేసే చైనీయులకు సగటున రోజుకు 3.5 డాలర్ల దాకా చెల్లించాలి. మనదేశంలో 1 డాలరులోపే సరిపోతుంది. అయినా కూడా ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఉత్పత్తి విభాగాలను చైనాలోనే ఎందుకు పెడుతున్నాయి? భారత్‌కు ఎందుకు రావట్లేదు? అంటే.. అందుకు చాలా కారణాలున్నాయి.


ఉత్పత్తికి కావాల్సిన ముడిపదార్థాల లభ్యత, ఉ ద్యోగుల్లో క్రమశిక్షణ, తయారుచేసిన ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి అవసరమైన అత్యాధునిక ఓడరేవులు, రవాణా సౌకర్యాలు.. ఇలా చాలా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు.. 2014తో పోలిస్తే మనదేశంలో 2019 నాటికి 250కిపైగా సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమలు అధికంగా వచ్చాయి. కానీ.. ఆ ఫోన్ల తయారీకి కావాల్సిన కాంపొనెంట్లలో(పీసీబీలు, కెమెరా మాడ్యూళ్లు, సెమీకండక్టర్ల వంటివి) 75ు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఫార్మా రంగం, సెల్‌ఫోన్లు, ఎలకా్ట్రనిక్స్‌, గృహోపకరణాలకు సంబంధించి మనం చైనా నుంచి తెప్పించుకునే 1,050 కీలక వస్తువుల దిగుమతి.. కరోనా వల్ల ఆగిపోయింది. దేశీయంగా వాటిని సమకూర్చుకోగలమా అనే విషయాన్ని తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం పరిశీలించగా.. పరిస్థితి చాలా నిరాశాజనకంగా కనిపించింది. ఇదీ మన పరిస్థితి. ఇక ఉత్పత్తి విభాగాల్లో పనిచేసేవారి విషయానికి వస్తే.. రోజుకు మూడున్నర డాలర్ల దాకా ఇవ్వాల్సి వచ్చినా విదేశీ కంపెనీలు చైనీయులను, చైనా కంపెనీలనే ఎందుకు విశ్వసిస్తున్నాయంటే భారతీయుల్లో క్రమశిక్షణ, నైపుణ్యాలు తక్కువనే అభిప్రాయం ఉండడమే.


యాపిల్‌ కంపెనీ తన ఐఫోన్‌ 11 ఉత్పత్తిని భారత్‌కు తరలించాలనే ఆలోచనను విరమించుకుంది ఈ కారణం వల్లేనని వాణిజ్య రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నైపుణ్యాలను నేర్పించేలా చైనా విద్యావ్యవస్థను రూపొందించడం వల్ల అక్కడ వేలాది మంది స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికులు లభిస్తారు. విదేశీ కంపెనీలు అక్కడికి వెళ్లడానికి ఇదీ ఒక కారణం. అలాగే.. ఉత్పత్తి విభాగాలు నడవడానికి అవసరమైన చౌక, నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా కావాలి. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. రవాణా విషయంలో కూడా మనదేశం చాలా వెనుకబడి ఉంది. చాలా ఉత్పత్తులను ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలించడానికి అయ్యే వ్యయం కన్నా చైనా నుంచి తెప్పించుకోవడం చౌక అనే స్థాయిలో మన రవాణా పరిస్థితులున్నాయని పరిశ్రమల యజమానులు వాపోయే పరిస్థితి. ఉత్పత్తి రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి పాలకులు రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధి కోసం మూడు దశాబ్దాలుగా ఎంతో కృషి చేశారు. రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం చైనా తన జీడీపీలో 18 శాతాన్ని ఖర్చు పెడుతోంది. అదే అగ్రరాజ్యం అమెరికా 8.5ు మాత్రమే ఖర్చు పెడుతోంది. ఈ తేడా చాలు.. చైనా దూరదృష్టి గురించి చెప్పడానికి. నిజానికి డ్రాగన్‌ దేశం దీన్ని ఖర్చుగా కాకుండా.. పెట్టుబడిగా భావిస్తుంది. దీన్ని గమనించిన మోదీ సర్కారు.. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి అయ్యే ఖర్చును 20ు పెంచడానికి నిర్ణయించింది. మన దేశంలో అవినీతి కూడా విదేశీ కంపెనీలు రాకపోవడానికి ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు.



ఉత్పత్తులూ లెక్కే!

చైనా ఉత్పత్తిరంగ హబ్‌గా మారడానికి.. మనదేశం మారకపోవడానికి కారణం రెండు దేశాలూ ఎంచుకున్న ఉత్పత్తులే. టెక్స్‌టైల్స్‌, డేటా ప్రాసెసింగ్‌ మెషీన్స్‌, యూనిట్లు, ఉక్కు ఉత్పత్తులు, ఎలకా్ట్రనిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, టీవీలు, ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు, పాదరక్షలు, ఫర్నిచర్‌.. ఇలా ప్రపంచమంతా వాడే ఉత్పత్తుల తయారీ చైనాలో ఎక్కువగా ఉంది. అదే మనదేశం నుంచి ఇతరదేశాలకు ఎక్కువగా మెటల్‌ కాస్టింగ్స్‌, పంపులు, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, ఆభరణాలు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తుల వంటివి ఎగుమతి అవుతాయి. రెంటినీ బేరీజు వేసి చూస్తే.. ఎక్కువ మంది వాడే ఉత్పత్తులపై చైనా దృష్టి సారించడమే వారి విజయానికి కారణమని అర్థమవుతుంది.


43.9శాతం

చైనా స్థూలజాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా. వ్యవసాయ రంగం వాటా కేవలం 9.7 శాతం ఉండగా.. సేవా రంగం వాటా 46.4 శాతం ఉంది.


29.73శాతం

భారతదేశ స్థూలజాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా. వ్యవసాయ రంగం వాటా 15.87శాతం ఉండగా.. సేవా రంగం వాటా ఏకంగా 54.40 శాతం ఉంది.


3.56

జపాన్‌కు చెందిన నోమురా గ్రూప్‌ అధ్యయనం ప్రకారం.. 2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు నడుమ చైనా నుంచి 56 కంపెనీలు విదేశాలకు తరలిపోతే అందులో భారతదేశానికి వచ్చినవి కేవలం 3 కంపెనీలు. అత్యధికంగా 26 కంపెనీలు వియత్నాంకు వెళ్లగా.. 11 కంపెనీలు తైవాన్‌కు, 8 కంపెనీలు థాయ్‌లాండ్‌కు వెళ్లాయి. 


3 లక్షల కోట్ల డాలర్లు

చైనా ఉత్పత్తి రంగం విలువ ఇది. అంటే దాదాపుగా రూ.2.28 కోట్ల కోట్లు. మనదేశ ఉత్పత్తి రంగం విలువ కన్నా పది రెట్లు ఎక్కువ ఇది.


మన ఔషధ ముడిపదార్థాల్లో 80శాతం చైనావే!

ఔషధాల తయారీలో భారతదేశం అగ్రగామే కావచ్చుగానీ.. వాటి తయారీకి అయ్యే ముడిపదార్థాల విషయంలో మాత్రం చైనాపైనే ఆధారపడి ఉంది. మనదేశం ఏటా దిగుమతి చేసుకునే ఔషధ ముడిపదార్థాల్లో 80 శాతం చైనా నుంచే వస్తాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. యాంటీబయాటిక్స్‌ (అజిత్రోమైసిన్‌, పెన్సిలిన్‌, సెఫాలోస్పోరిన్స్‌ వంటివి) విషయంలో అయితే 90 శాతం చైనాపైనే ఆధారపడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అక్షరాలా రూ.1,74,000 కోట్ల రూపాయల విలువైన ఔషధ ముడిపదార్థాలను దిగుమతి చేసుకుంది. నిజానికి రెండు దశాబ్దాల క్రితం భారతదేశం చాలా ఔషధ ముడిపదార్థాల విషయంలో ఎవరిపైనా ఆధారపడేది కాదు. 1991 నాటికి మనదేశ ఔషధ ముడిపదార్థాల దిగుమతులు 1 శాతం ఉండేవి. 2019 నాటికి 70శాతం దాటేశాయి. అందులో 80శాతం చైనావే.


- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-06-20T07:48:34+05:30 IST