సచివాలయానికి దోల్పూర్‌ రాయి!

ABN , First Publish Date - 2021-02-25T07:55:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనానికి దోల్పూర్‌ రాయిని ఉపయోగించాలని నిర్ణయించింది.

సచివాలయానికి దోల్పూర్‌ రాయి!

బేస్‌మెంట్‌  నుంచి 15 అడుగుల వరకు వాడకం

వచ్చే నెలలో ఆర్డరు ఇవ్వనున్న సర్కారు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనానికి దోల్పూర్‌ రాయిని ఉపయోగించాలని నిర్ణయించింది. బేస్‌మెంట్‌ నుంచి 15 అడుగుల వరకు ఈ రాయిని ఉపయోగించనుంది. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల ఆగ్రా వెళ్లినప్పుడు అక్కడి క్వారీల వద్దకు వెళ్లి దోల్పూర్‌ రాయి నాణ్యతను పరిశీలించి వచ్చారు. సచివాలయం ప్రధాన భవనానికి బేస్‌మెంట్‌ నుంచి 15 అడుగుల వరకు సుమారు 8 వేల క్యూబిక్‌ ఫీట్లకు పైగా రాయి అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రాయి కోసం ప్రభుత్వం మార్చిలో ఆర్డర్‌ ఇవ్వనుంది. ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి రాయిని రాష్ట్రానికి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. పైభాగంలో వచ్చే డోమ్‌, అశోక్‌చక్రతో కూడా కలిపి సచివాలయం ప్రధాన భవనం మొత్తం ఎత్తు 278 అడుగులుగా నిర్మాణం జరుపుకోనున్న విషయం తెలిసిందే. కాగా, బేస్‌మెంట్‌పై ఏడు ఫ్లోర్లు రానున్నాయి. ఒక్కో ఫ్లోర్‌ ఎత్తు 14 అడుగులు. వీటిపైన నాలుగు అంతస్తుల్లో సెంట్రల్‌ టవర్‌, తూర్పు, పడమర వింగ్స్‌, ఆ పైన 48 అడుగుల ఎత్తులో స్కై లాంజ్‌, దానిపైన 50 అడుగుల ఎత్తులో డోమ్‌, దానిపై 11 అడుగుల ఎత్తులో అశోక్‌చక్ర వస్తుంది. కాగా, నూతన సచివాలయంలో సౌర విద్యుత్తును వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం పూర్తి అవసరాలు తీరే విధంగా కాకపోయినా పరిమితంగానైనా సౌర విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్ణయించింది. పార్కింగ్‌భవనాన్ని 650కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పెట్టే విధంగా నిర్మిస్తున్నారు. ఇతర వసతులకు విడిగా భవనాలు నిర్మిస్తున్నందున వీటిపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయనుంది. 


నిర్దేశిత సమయంలో పూర్తి

సచివాలయం నిర్మాణాన్ని 12 నెలల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయినందున.. ఇక 10 నెలల సమయమే మిగిలి ఉంది. అయినా.. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ప్రధాన భవన నిర్మాణ వైశాల్యం 6లక్షల చదరపు అడుగులు కాగా, ఇతర వసతులకు మరో లక్ష చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను ఏడు భాగాలుగా విభజించామని పేర్కొన్నారు. ప్రతి పనికీ విడివిడిగా పర్యవేక్షణ, నిర్మాణ విభాగాలు ఉన్నాయని, దీంతో ఏక కాలంలో పనులు చేయించడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు.

Updated Date - 2021-02-25T07:55:36+05:30 IST