Dolo-650: 1000 కోట్లు ఉచితంగా పంచిపెట్టిన డోలో: మెడికల్ బాడీ

ABN , First Publish Date - 2022-08-19T01:36:18+05:30 IST

డోలో-650 (Dolo-650). ఇది చాలా సర్వసాధారణమైన ఔషధం. జ్వరం, నొప్పులు వంటి వాటికి వైద్యుల సిఫార్సు లేకుండా

Dolo-650: 1000 కోట్లు ఉచితంగా పంచిపెట్టిన డోలో: మెడికల్ బాడీ

న్యూఢిల్లీ: డోలో-650 (Dolo-650). ఇది చాలా సర్వసాధారణమైన ఔషధం. జ్వరం, నొప్పులు వంటి వాటికి వైద్యుల సిఫార్సు లేకుండా ఠక్కున కొనుక్కొచ్చి వేసుకునే మాత్ర. ఇది ఇంతగా అందరి నోళ్లలో నానేందుకు దీని తయారీదారులు ఏకంగా 1000 కోట్ల రూపాలయను కేవలం గిఫ్ట్‌లుగా పంచిపెట్టారట. ఈ ట్యాబ్లెట్‌ను రోగులకు సిఫార్సు చేసేందుకు వైద్యులకు పెద్ద ఎత్తున ముడుపులు అందించినట్టు వార్తలు వచ్చాయి.


ఈ కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు వాదనలు ప్రారంభించింది. రోగులకు తమ కంపెనీ మందులను సిఫార్సు చేసే విషయంలో వైద్యులకు ఫార్మా కంపెనీలు ఎలాంటి ‘గిఫ్ట్’లు ఇవ్వకుండా నిరోధించాలంటూ  ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉచితాలు తీసుకుని ప్రజలకు మందులు రాసిచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరమన్న మెడికల్ అసోసియేషన్.. వైద్యులకు ఉచితాలు అందించకుండా నిరోధించే చట్టమేదీ ప్రస్తుతానికి లేదని కోర్టుకు తెలిపింది.


500 ఎంజీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ధరను డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయిస్తుంది. అయితే, దానిని 650 ఎంజీకి పెంచినప్పుడు నియంత్రిత ధరను మించిపోతోంది. అందుకనే అంతగా ప్రచారం చేస్తున్నారని, ఉచితాలకు ఇంతకుమించిన ఉదాహరణ అక్కర్లేదని అసోసియేషన్ తరపు సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ (Sanjay Parikh) పేర్కొన్నారు. అలాగే, యాంటీబయాటిక్‌ల అవసరం లేకపోయినా వివిధ కాంబినేషన్లతో ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాబట్టి డ్రగ్ ఫార్ములేషన్‌లను నియంత్రించేందుకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ అవసరమని కోర్టుకు తెలిపారు. డోలో-650 ఎంజీ ఫార్ములేషన్ కోసం ఆ కంపెనీ రూ. 1000 కోట్లకు పైనా ఉచితాలను వైద్యులకు అందించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నుంచి వచ్చిన నివేదికే ఈ ఆరోపణలకు మూలమని పేర్కొన్నారు.


జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న(AS Bopanna)లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. తనకు కరోనా సోకినప్పుడు ఈ ట్యాబ్లెట్ మాత్రమే తీసుకోవాలని వైద్యులు తనకు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్( DY Chandrachud) గుర్తు చేసుకున్నారు. వాదనల అనంతరం ఈ విషయమై పది రోజుల్లోగా స్పందన తెలియజేయాని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.


డోలో-650 ట్యాబ్లెట్లను మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ తయారు చేస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో ఈ సంస్థ ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్లను విక్రయించింది. ఒకే ఏడాది ఏకంగా రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గతంలో మైక్రోల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లో, మైక్రోల్యాబ్స్  కార్యాలయంలోజరిగిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. 

Updated Date - 2022-08-19T01:36:18+05:30 IST