Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలసితి.. సొలసితి.. వెంకన్న సేవలోనే కన్నుమూసిన డాలర్‌ శేషాద్రి

వేలాది సంకీర్తనలతో గోవిందుడిని కీర్తించిన తాళ్లపాక అన్నమాచార్యులు చివరి శ్వాస ఆ స్వామి హృదయాల పైనే విడిచాడనేది చరిత్ర. అదే తరహాలో నలభైమూడేళ్లు శ్రీనివాసుడి కైంకర్యాల్లో సేవలందించిన డాలర్‌ శేషాద్రి కూడా స్వామి సేవలోనే చివరి శ్వాసను విడిచారు. సన్నిహితులెవరైనా ఆరోగ్యం జాగ్రత్త అంటే ‘నాకేం కాదు. అయినా, పోతే.. స్వామి సేవలోనే పోవాలి’ అంటుండే శేషాద్రి తన కోరికను చివరకు తీర్చుకున్నారు. 1978లో సాధారణ గుమస్తాగా టీటీడీలో చేరినా చివరికి ఆయనుంటే కైంకర్యం సంపూర్ణం అనుకునేంత ఎత్తుకు ఎదిగారు.శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి పూజలో తన పాత్ర ఉండేలా పరితపిస్తూ, వీఐపీల సేవల్లో తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, పారిశ్రామిక, సినీ నటులకు సుపరిచితుడయ్యారు.అర్చకులు, ఏకాంగులు, పరిచారకు లు, ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బందితో పాటు చివరికి మీడియా సిబ్బందితో కూడా సన్నిహితంగా మెలిగి అందరివాడనిపించుకున్నారు. - తిరుమల, ఆంధ్రజ్యోతి


మిరాశీ రద్దు సమయంలో స్వామి కైంకర్యాలు ఆగకుండా...

డాలర్‌ శేషాద్రి తాతది కంచి సమీపంలో వున్న వందవాసిలోని నావాల్‌పాకం. ఆయన తిరుపతికి వలస వచ్చారు. రాజగోపాల్‌ తాతాచార్యులు, బి.భూమాదేవి దంపతులకు 15.7.1948న తిరుపతిలోనే శేషాద్రి పుట్టారు. రాజగోపాల్‌ తాతాచార్యులు గోవిందరాజస్వామి ఆలయంలోని ఉప ఆలయమైన ఆండాల్‌ ఆలయంలో పూజారిగానూ, ప్రసాదాలు తయారీ చేసే మిరాశీల వద్ద గుమస్తాగానూ పని చేసేవారు.గోవిందరాజస్వామి ఉత్తర మాడవీధిలో కాపురం ఉండేవారు. ఆ తరువాత కర్నాలవీధిలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. అయితే శేషాద్రి తిరుపతి ఎస్డీ లే ఔట్‌లోని పెద్దనాన్న కుమార్తె అయిన అక్క వద్దే పెరిగారు. శేషాద్రికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు.

చెల్లెళ్లు చెన్నైలో ఉండగా ఒక తమ్ముడు చెన్నైలో ప్రైవేట్‌ కంపెనీలో పని చేసేవారు. మరో తమ్ముడు చిత్తూరు రెవిన్యూ శాఖలో పని చేస్తూ రిటైరయ్యారు. భార్య పేరు చంద్ర. ఎస్డీ లే ఔట్‌లో ఉన్నారు.శేషాద్రి అక్క, బావల వద్దే ఆమె ఉన్నారు. తిరుచానూరు పంచమికి తిరుమల నుంచి స్వామి వారి సారె తీసుకువచ్చే వారికి ఆహారం ఇచ్చేవారు. తిరుపతి ఎస్వీ హైస్కూల్‌లో 12వ తరగతి వరకు శేషాద్రి చదివారు. తరువాత బీఎస్సీ,ఎమ్మెస్సీ ఎస్వీ యూనివర్శిటీలోనే చదివారు. ఆ తరువాత డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ అకౌంటెన్సీ చేసి ఎల్‌ఐసీలో చేరారు. 


ఎల్‌ఐసీలో ఉద్యోగం చేస్తున్నపుడు అప్పట్లో టీటీడీ ఈవోగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్‌కు శేషాద్రి వ్యక్తిత్వం నచ్చి ఆయన్ను ఉత్తర పారుపత్తేదారుగా ఉత్సవాలు, నిత్యసేవలకు ఇన్‌చార్జిగా టీటీడీలో నియమించారు. అలా 1978లో టీటీడీలో ఆయన సేవలు మొదలయ్యాయి. పీఠాధిపతులకు, టీటీడీ ఈవోలకు మధ్య కీలక వ్యక్తిగా శేషాద్రి వ్యవహరించేవారు. ముఖ్యంగా కంచి మఠానికి చాలా ఆప్తుడిగా ఉన్నారు. తిరుమల ఆలయంలో అంతర్గత రాజకీయాలు రోడ్డున పడకుండా ‘శేషాద్రి మామ’గా కాపాడుకుంటూ వచ్చారు. ఆలయంలో పని చేసే బ్రాహ్మణులు అర్చకులైనా, పరిచారకులైనా తప్పు చేస్తే  ఈయనే తిట్టి దారిలో పెట్టేవారు. అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఆలయంలోని వారికి రాకుండా చూసుకునేవారు. ఆలయంలో శ్రీవారి క్షీర ప్రసాదాన్ని ఇష్టంగా తీసుకునేవారు. 


బ్రాహ్మిణ్‌, నాన్‌ బ్రాహ్మిణ్‌ అనే బేధం లేని వ్యక్తిత్వం ఆయన్ను అందరికీ దగ్గర చేసింది. మిరాశీ రద్దు సమయంలో శ్రీవారికి కైంకర్యాలు ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఆ కీలక సమయంలో మాడంబాకం శ్రీనివాస భట్టాచార్యులతో కలిసి స్వామికి కైంకర్యాలు ఆగకుండా శేషాద్రి తీసుకున్న చొరవ టీటీడీకి చేసిన మేలు వెల కట్టలేనిది. మిరాశీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినపుడు, ఉన్నపళంగా ఆలయాన్ని వదిలి పెట్టిన మిరాశీలకు  టీటీడీ లొంగుతుందని కొందరు భావించారు. అయితే వారి ఆలోచనకు భిన్నంగా, ఎలాంటి లోటు లేకుండా కైంకర్యాలు జరిగేలా చేయడమే కొందరు పెద్ద మిరాశీ అర్చకులకు శేషాద్రిపైన కోపానికి కారణమైంది. శ్రీవారి మూలవర్లకు, ఉత్సవర్లకు అనేక సెట్ల ఆభరణాలు చేయించడంలో శేషాద్రిది కీలకపాత్ర.

శ్రీవారిసేవే ఊపిరిగా..

నాలుగున్నర దశాబ్దాల పాటు శ్రీవారిసేవలో తరించిన  శేషాద్రి స్వామి మరణం టీటీడీకి తీరని లోటు. ఆలయసేవలు, ఉత్సవాలు, కైంకర్యాలు, టీటీడీ నిర్వహించే ఇతర వైదిక కార్యక్రమాల్లో అఽధికారులకు, జీయర్‌స్వాములకు, అర్చకులకు పెద్ద దిక్కుగా పనిచేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే మానసిక ధైర్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నా. - టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి


టీటీడీకి తీరనిలోటు

డాలర్‌ శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటు.టీటీడీలోని వివిధ ఆలయాల్లో, బయటి ప్రాంతాల్లో టీటీడీ నిర్వహిం చిన కల్యాణోత్స వాలను, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తుల ముంగిటికి తీసుకెళ్లడానికి ఆయన అందించిన సహకారం మరువలేనిది. - టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి


శేషాద్రి మరణం విచారకరం

డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం విచారకరం. కలిసి స్వామిసేవలో పాలుపంచుకున్నాం.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వంశపారంపర్య అర్చకుల తరపున సానుభూతి తెలియజేస్తున్నా. - శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు


శ్రీవారు శేషాద్రి కోరికను తీర్చారు

శేషాద్రి స్వామి ఎంతో అంకిత భావంతో, భక్తితో, క్రమశిక్షణతో, నిజాయితీగా టీటీడీలో సేవలందించారు.శ్రీవారిసేవలో ఉండగానే తుదిశ్వాస విడవాలని కోరుకునేవారు. శ్రీవారే శేషాద్రిస్వామి కోరికను తీర్చారు.పవిత్రమైన కార్తీక సోమవారం రోజున వారికి సద్గతి కలిగించారు. - టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి 


భక్తులందరికీ తీరనిలోటు 

డాలర్‌ శేషాద్రి కాలధర్మం చెందడం శ్రీవారి భక్తులందరికీ తీరని లోటు. సొంతపనులు పక్కనపెట్టి 43సంవత్సరాలు స్వామిసేవలో గడిపిన గొప్పవ్యక్తి ఆయన. - ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి


‘మామ’ అని పిలిచేవాళ్లం

శేషాద్రిని మా కుటుంబ సభ్యుడిగానే భావించి  మామ అని పిలుస్తుంటాం. అన్నిటిలో మాకు ఆయన పెద్ద దిక్కుగా ఉండేవారు. మా తండ్రితో పాటు ఆయన వద్ద నుంచి చిన్నతనంలో కైంకర్యాలు నేర్చుకున్నాం. మామ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. - శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement