ప్రదక్షిణలు చేస్తున్నా పరిష్కారం కాని సమస్యలు

ABN , First Publish Date - 2021-12-07T05:34:44+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం మొక్కుబడిగా మారింది. దీంతో గతంలో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద బారులు తీరే ప్రజలు ఇప్పుడు పెద్దగా రావడం లేదు. సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయం బయటపడింది. కొందరు ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడం స్పందన అర్జీలపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఉప్పుమాగులూరు రెవెన్యూ పరిధిలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన బొనుబోయిన అంజయ్య అనే రైతు మూడేళ్ల నుంచి భూమిని ఆన్‌లైన్‌ చేయాలని తహీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

ప్రదక్షిణలు చేస్తున్నా  పరిష్కారం కాని సమస్యలు
పంగులూరు తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్ణీత సమయానికి సిబ్బంది చేరుకోక ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు

భూమి ఆన్‌లైన్‌ కోసం

మూడేళ్లుగా తిరుగుతున్న రైతు

బల్లికురవ, డిసెంబరు 6 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం మొక్కుబడిగా మారింది. దీంతో గతంలో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద బారులు తీరే ప్రజలు ఇప్పుడు పెద్దగా రావడం లేదు. సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయం బయటపడింది. కొందరు ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడం స్పందన అర్జీలపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. ఉప్పుమాగులూరు రెవెన్యూ పరిధిలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన బొనుబోయిన అంజయ్య అనే రైతు మూడేళ్ల నుంచి భూమిని ఆన్‌లైన్‌ చేయాలని తహీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.  ఆంధ్రజ్యోతి విలేకరి వద్ద ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం అప్పట్లో పనిచేసిన మండల సర్వేయర్‌ కొలతలు వేసి తనకు సర్వే నెంబరు 661లో 2.26 ఎకరాల భూమి ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారని అంజయ్య చెప్పారు. అందులో 1.90 సెంట్లు మాత్రమే అధికారులు ఆన్‌లైన్‌ చేశారన్నారు. మిగిలిన 36 సెంట్ల భూమి ఆన్‌లైన్‌ చేయకుండా ఏవేవో సాకులు చెప్తున్నారన్నారు. సర్వే నెంబరు 710లో తన పూర్వీకుల నుంచి వచ్చిన 1.92 ఎకరాల భూమిని కూడా ఆన్‌లైన్‌ చేయకుండా తిప్పుకుంటున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన సర్వే తప్పు అని మరలా  చేయించుకోవాలని అధికారులు చెప్తున్నారని, తన వద్ద రికార్డు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో సర్వేకు రూ.20 వేల వరకూ ఖర్చులు అయ్యాయని, మరలా సర్వే అంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని అంజయ్య వాపోయాడు. 

 సమయపాలన పాటించని సిబ్బంది 

పంగులూరు : మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కొందరు      ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయపాలన పాటించడం లేదు. సోమవారం కొందరు నిర్ణీత సమయానికి  కార్యాలయానికి రాలేదు. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌లు కోర్టు పనిపై అద్దంకి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. ఎంఆర్‌ఐతోపాటు, కంప్యూటర్‌ ఆపరేటర్లు నిర్ణీత సమయానికి విధులకు హాజరయ్యారు. సీనియర్‌ అసిస్టెంట్‌తోపాటు కార్యాలయ అటెండర్‌ సమయానికి రాలేదు. కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. ఆదాయం, కులం, పుట్టిన తేదీల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు కార్యాలయానికి వచ్చే అర్జీదారుల నుంచి అటెండర్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. 

మ్యూటేషన్‌లో జాప్యం

మద్దిపాడు, డిసెంబరు 6 : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో పాసుపుస్తకాల కోసం మ్యూటేషన్‌ ఆలస్యం కావడంతో రైతులు నెలలు తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. సోమవారం మద్దిపాడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆంధ్రజ్యోతి విజిట్‌ చేసింది.  ఉదయం 10గంటలకు తహసీల్దార్‌ కార్యాలయానికి రాగా కింది స్థాయి అధికారులు మాత్రం 11గంటలకు కూడా రాకపోవడంతో పనులకోసం వచ్చిన ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపించింది.


Updated Date - 2021-12-07T05:34:44+05:30 IST