వెటర్నరీ ఆస్పత్రిలో పెంపుడు శునకాలతో క్యూకట్టిన యజమానులు
- పార్వోవైరల్, వైరల్ ఫీవర్‌తో పశువుల ఆస్పత్రికి క్యూ
- కిటకిటలాడుతున్న రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ ఆస్పత్రి
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి):
మనిషులు కరోనాతో పోరాడుతుంటే శునకాలు పార్వోవైరల్, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాయి. రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ ఆస్పత్రి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగకారక కుక్కలతో నిండిపోయింది. జబ్బుపడిన కుక్కలను తీసుకుని వచ్చి ప్రజలు క్యూ కడుతున్నారు. ఎక్కువగా వాటికి పార్వో వైరల్(రక్త విరేచనాలు) వస్తున్నాయి. వైరల్ ఫీవరు, కిడ్నీ, గుండెపోటు కూడా రావడం గమనార్హం. కిడ్నీ వంటి వ్యాధులకు గురవుతున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ ఏరియాలో 12వేల శునకాలు ఉండవచ్చని ఇక్కడి వైద్యులు చెప్తున్నారు. ఇందులో వీధి కుక్కలు కూడా ఉన్నాయి. శునకాలను పెంచడం ఇటీవల ఫ్యాషన్‌గా మారింది. వాటి వైద్యంపై ప్రజలకు అవగాహన పెరగడంతో చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల క్లినిక్‌లతోపాటు మందుల విక్రయ దుకాణాలూ పెరిగాయి. రాజమహేంద్రవరంలోనే కుక్కల కోసం ప్రత్యేకంగా ఐదు క్లినిక్‌లు ఉండడం గమనార్హం.
రికవరీ రేటు పెరిగింది: ఏడీ రమేష్‌చంద్ర
కుక్కలకు వ్యాధులు పెరగడంతోపాటు రికవరీ రేటు బాగా పెరిగిందని ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్‌చంద్ర తెలిపారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పార్వోవైరల్‌కు వ్యాక్సిన్ ఉండడంతో బాగా రికవరీ అవుతున్నాయన్నారు. మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. ఇటీవల వైద్య పరిజ్ఞానం పెరగడంతో కుక్కలకు కూడా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో 2,500 వరకు గేదెలు, ఆవులు ఉన్నాయని.. వాటికి ఏదైనా సమస్య వస్తే ఇళ్లకే వెళ్లి వైద్యం చేస్తున్నామన్నారు. ఇక్కడ పిల్లులు, తాబేళ్లు, మేకలు, గొర్రెలు, ఇతర జంతువులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు.