పెంపుడు జంతువులకు ‘ప్రత్యేక దహనవాటిక’

ABN , First Publish Date - 2021-12-12T17:02:45+05:30 IST

కొంతమందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. తమతో పాటు వాటికీ సమానంగా ఆహారపానీయాలు, పడక సదుపాయాలు కల్పిస్తుంటారు కొందరు. వాటికి ఏదైనా అయితే విలవిల్లాడిపోతుంటారు కూడా. మరి, అంత ప్రాణప్రదంగా చూసుకొనే పెంపుడు

పెంపుడు జంతువులకు ‘ప్రత్యేక దహనవాటిక’

                           - తొలిసారిగా వేళచ్చేరిలో ఏర్పాటు


చెన్నై: కొంతమందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. తమతో పాటు వాటికీ సమానంగా ఆహారపానీయాలు, పడక సదుపాయాలు కల్పిస్తుంటారు కొందరు. వాటికి ఏదైనా అయితే విలవిల్లాడిపోతుంటారు కూడా. మరి, అంత ప్రాణప్రదంగా చూసుకొనే పెంపుడు జంతువులు చనిపోతే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. తమ మనుషుల్లాగే వాటికీ అంత్యక్రియలు నిర్వహించాలని చాలామంది భావిస్తుంటారు. జంతుప్రేమికుల కోసం అలాంటి సదుపాయమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ‘సీడబ్ల్యూసీఎఫ్’తో కలిసి ‘బ్లూ క్రాస్‌ ఇండియా’ తమిళనాడులోనే తొలిసారిగా ఈ జంతువుల దహనవాటికను ఏర్పాటు చేసింది. దానిని గురించిన విశేషాల సమాహరమే ఈ సండే స్పెషల్‌...


మనుషుల దహనవాటికల్లాగే రూపొందించాం 

- జూ బ్లూ క్రాస్‌ ఇండియా మేనేజర్‌ వినోద్‌కుమార్‌ 


ఈ దహనవాటిక విషయమై బ్లూ క్రాస్‌ ఇండియా మేనేజర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ... పెంపుడు జంతువుల దహనవాటికలు పూనే, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రమే వుండగా, బెంగుళూరులో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తమ సంస్థ సీడబ్ల్యూసీఎఫ్‌ను సంప్రదించగా రూ.57 లక్షల విరాళం అందజేసిందన్నారు. దీంతో, దహనవాటికలు తయారుచేసే సంస్థను సంప్రదించి ప్రత్యేక దహనవాటిక ఏర్పాటు చేశామన్నారు. ఈ దహనవాటికలో పొగ, దుర్వాసనలు లేకుండా రూపొందించామన్నారు. ఈ కేంద్రంలో రెండు దహనవాటికలు ఏర్పాటుచేశామని, ఒక చోట ఆరు జంతువులు (75 కేజీలకు పైగా), మరో కేంద్రంలో ఒక జంతువును మాత్రమే దహనం చేసే సౌకర్యం వుందని ఆయన తెలిపారు. అదే సమయంలో పెంపుడు జంతువులు కోల్పోయిన వారు తమకు సమాచారం అందించి, ఆ కళేబరాలను తీసుకొచ్చి అంత్యక్రియలకు ముందు వాటికి ప్రత్యేక పూజలు జరిపేందుకు కూడా సదుపాయం కల్పించామని, అందుకు ఫీజుగా రూ.2,500 వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పెంపుడు జంతువులకు అంత్యక్రియలు నిర్వహించాలనుకొనే వారు ముందుగా bit.ly/animalcremation అనే వెబ్‌సైట్‌లో నమోదుచేసుకోవాలని ఆయన సూచించారు.


జంతువులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన వసతి లేకపపోవడంతో తమ ఇంటి ప్రాంగణంలో వాటికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చుట్టుపక్కల వారి అభ్యంతరాలు, తగిన స్థలం లేకపోవడంతో ఏమిచేయాలో పాలుపోక, మనసు చంపుకొని చెత్త కుప్పల్లోనో, ఊరికి దూరంగానో పడవేసి విలవిల్లాడిపోయే యజమానులెంతోమంది వున్నారు. అటువంటివారి బాధల్ని తీర్చేందుకు బ్లూ క్రాస్‌ ఇండియా ‘ది చెన్నై వెల్లింగ్డన్‌ కార్పొరేట్‌ ఫౌండేషన్‌ (సీడబ్ల్యూసీఎఫ్‌) సహకారంతో ముందుకు వచ్చింది. స్థానిక వేళచ్చేరిలో ఈ దహనవాటికను ఏర్పాటు చేసింది. ఇటీవల ఈ దహనవాటికను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ, సీడబ్ల్యూసీఎఫ్‌ ఛైర్మెన్‌ ఎల్‌.గణేష్‌లు ప్రారంభించారు.



Updated Date - 2021-12-12T17:02:45+05:30 IST