ఆసుపత్రిలో యజమాని.. మనసులు పిండేసిన శునకం!

ABN , First Publish Date - 2021-01-24T00:30:34+05:30 IST

‘హచికో- ఎ డాగ్ స్టోరీ’.. ఈ సినిమాను ఎంతమంది చూసి ఉంటారో తెలియదు కానీ, చూసిన వారి మనసులను మాత్రం

ఆసుపత్రిలో యజమాని.. మనసులు పిండేసిన శునకం!

టర్కీ: ‘హచికో- ఎ డాగ్ స్టోరీ’.. ఈ సినిమాను ఎంతమంది చూసి ఉంటారో తెలియదు కానీ, చూసిన వారి మనసులను మాత్రం పిండేసింది. గుండె నొప్పితో అకస్మాత్తుగా చనిపోయిన తన యజమాని తిరిగి వస్తాడన్న ఆశతో హాచి అనే శునకం చూసి ఎదురుచూపులు హృదయాలను తడిమేశాయి. చూసిన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించాయి. 18వ శతాబ్దంలో జపాన్‌లో జరిగిన ఓ యథార్థ గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పుడిలాంటి స్టోరీనే టర్కీలో జరిగింది. 


మొదడు సమస్యలతో ఆసుపత్రిలో చేరిన తన యజమాని కోసం ఓ శునకం ఆసుపత్రి బయట వారం రోజులపాటు ఎదురుచూసింది. జపాన్ కథలా ఇక్కడ విషాదాంతం కాలేదు. ఇద్దరూ కలుసుకున్నారు. ఈ శునకం పేరు బోన్‌కుక్. 68 ఏళ్ల తన యజమాని కేమల్ సెంటుర్క్ ట్రాబ్‌జాన్‌లోని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక ఆయనను చూసి పట్టలేని సంతోషంతో వచ్చి పెనవేసుకుంది. 


ఈ నెల 14న సెంటుర్క్ ప్రమాదకర బ్రెయిన్ ఎంబాలిజంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను అంబులెన్స్‌లో తరలిస్తున్నప్పుడు తన యజమానికి ఏం జరిగిందో అర్థం కాక శునకం బోన్‌కుక్ ఆ వాహనాన్ని అనుసరించింది. అంబులెన్స్ ఆసుపత్రిలోకి వెళ్లడం చూసింది. ఇక ఆ రోజు నుంచి రోజూ ఆసుపత్రికి రావడం గేటు వద్ద యజమాని కోసం వేచి చూడడం. ఇదే పనిగా పెట్టుకుంది. 


రోజూ వచ్చి గేటు వద్ద ఎదురు చూస్తున్న శునకాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అది ఎవరికీ హాని తలపెట్టలేదని, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు శునకానికి, దాని యజమానికి మధ్య ఉన్న బంధాన్ని చూసి చాలా సంతోషించేవారని ఆసుపత్రి కమ్యూనికేషన్ డైరెక్టర్ ఫాట్ యుగుర్ తెలిపారు. 


శునకాన్ని తనతోపాటు తీసుకెళ్లాలని యజమాని కుమార్తె ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైంది. బలవంతంగా తీసుకెళ్లినా తిరిగి ఆసుపత్రికి వచ్చేసేదని పేర్కొన్నారు. తాజాగా సెంటుర్క్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వీల్‌చైర్‌పై రావడాన్ని చూసి శునకం ఒక్కసారిగా జంప్ చేసి ఆయనను అల్లుకుపోయింది. శునకం కురిపించిన ప్రేమకు ఆయన కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు.   



Updated Date - 2021-01-24T00:30:34+05:30 IST