పట్టణాల్లో గుంపులు గుంపులుగా కుక్కలు

ABN , First Publish Date - 2022-09-07T04:50:27+05:30 IST

పట్టణ వీధుల్లో కుక్కల గుంపుల తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పట్టణాల్లో గుంపులు గుంపులుగా కుక్కలు
నరసాపురం పట్టణం మెయిన్‌ రోడ్డులో కుక్కల సంచారం

నరసాపురం, ఆకివీడుల్లో పలువురికి కుక్క కాటు


ఆకివీడు/నరసాపురం, సెప్టెంబరు 6: పట్టణ వీధుల్లో కుక్కల గుంపుల తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రి వేళ వీధుల్లో ఒంటరిగా వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కుక్కల నిర్మూలనలో భాగంగా వాటిని సంహరించరాదని, వాటి సంతతి పెరగకుండా ఆపరేషన్లు చేయాలని కోర్టు ఆదేశాలతో గతంలో బ్లూక్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ప్రయోగం అంతగా ఫలించకపోవడంతో కుక్కల సంతతి ఇప్పుడు అధికమైంది. ఆకివీడు పట్టణంలో సుమారు 5 వేలు కుక్కలుంటాయని అంచనా. వాటన్నింటికి ఆపరేషన్లు చేయాలంటే నగర పంచాయతీ భారం భరించాలి. దీనితో నగర పంచాయతీ కుక్కల నిర్మూలనపై చేతులు ఎత్తేసింది. ప్రస్తుతం కుక్కలు అధికంగా పెరిగిపోయి ఆహారం దొరకక ప్రజలను వెంటాడుతున్నాయి. రాత్రి వేళ, తెల్లవారుజాము సమయంలో వీధిలోకి వెళితే కుక్క కాటు తప్పదు. మైదానాల్లో సంచరిస్తున్న వాకర్స్‌ను కూడా భయపెడుతున్నాయి. 


నరసాపురం పట్టణంలో పగలు, రాత్రి తేడా లేదు. ఏ వీధిలో, రోడ్డుపై ఎటు చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. చీకటి పడితే రోడ్డుపై తిరగలేని పరిస్థితి. ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు కుక్కలకు భయపడి బయటకు రావడం లేదు. ప్రధాన మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి. కుక్కకాటుతో అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు ప్రస్తావించినా అధికారుల నుంచి స్పందన లేదు. మునిసిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.


గ్రామాల్లో కుక్కలను ఇక్కడ వదిలేస్తున్నారు

పట్టణ సరిహద్దు గ్రామాల నుంచి కుక్కలను తీసుకొచ్చి ఆకివీడులో వదిలేస్తున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. రాత్రివేళ వీధుల్లో ఒంటరిగా వెళ్లలేకపోతున్నాం. పట్టించుకొనే నాథుడు లేడు. పంచాయతీ సమయంలో కార్యదర్శి కుక్కలను చంపించాడని బదిలీ చేశారు.

మోరా రామిరెడ్డి, ఆకివీడు


త్వరలో కుక్కలకు వ్యాక్సిన్‌ వేయిస్తాం

కుక్కల చంపకూడదు. త్వరలో కుక్కలను గుర్తిం చి వాటికి ట్యాగింగ్‌ కూడా వేయించి వ్యాక్సిన్‌ చేయి స్తాం. పట్టణంలో కుక్కలు అధికంగా ఉన్నట్లుగాని, కుక్కకాటుకు గురవుతున్నామని, కరుస్తున్నాయన్నట్లు తమకు ఫిర్యాదు రాలేదు. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నట్లు కనబడుతున్నాయి.

చోడగం వెంకటేశ్వరరావు, కమిషనర్‌, ఆకివీడు


వెంటనే ఇంజక్షన్‌ చేయించుకోవాలి

కుక్కకాటుకు గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఇంజక్షన్‌ చేయించుకోవాలి. సాధారన కుక్కయితే మూడవ, ఏడో రోజు, పిచ్చికుక్కయితే కరిచిన రోజు తరువాత ఐదు డోస్‌ల ఇంజక్షన్లు చేయించాలి. పట్టణ పరిధిలో కుక్కకాటు కేసులు అధికంగా ఉంటున్నాయి.

కె.వెంకటపతిరాజు, వైద్యుడు, ఆకివీడు



Updated Date - 2022-09-07T04:50:27+05:30 IST