ఆ ఊరికి రైతుబంధు లేదు?

ABN , First Publish Date - 2021-06-24T05:21:18+05:30 IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులెవరూ రైతుబంధు డబ్బు చూడనేలేదు.

ఆ ఊరికి రైతుబంధు లేదు?
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నాగిరెడ్డి గూడెంలో రైతులు సాగు చేసుకుంటున్న భూమి0

 రైతు బీమా కూడా.. 

 పాసుబుక్కులు లేక నాగిరెడ్డిగూడెం రైతులకు దక్కని ప్రభుత్వ పథకాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 23 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులెవరూ రైతుబంధు డబ్బు చూడనేలేదు. రైతు బీమా గురించి వారికి తెలియదు. రైతులందరూ పట్టాభూములను కలిగి ఉండి పాత పాస్‌బుక్కులున్నా, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వలేదు. దాంతో ఆ గ్రామంలోని రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.


200 మంది రైతులు.. 338 ఎకరాలు

నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 200 మంది రైతులున్నారు. వీరందరూ 272/1 నుంచి 272/10 సర్వే నంబర్లలో 338 ఎకరాల పట్టా భూములను కలిగి ఉన్నారు. ఇందులో 331 ఎకరాలు ఖుష్కి భూమి కాగా, ఏడెకరాలు మాత్రం తరి భూమి ఉన్నది. దశాబ్దాల కాలంగా ఈ భూములను గ్రామ రైతులే సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పాస్‌బుక్కులను సైతం ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఐదేళ్ల కిందట భూప్రక్షాళణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో నాగిరెడ్డిగూడెం రైతులకు ప్రయోజనం కలగలేదు. భూప్రక్షాళణలో అధికారులు గ్రామాల వారీగా రైతుల భూములు సరిగా ఉన్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించారు. ఆ సమయంలోనే గ్రామంలో రైతుల పట్టాభూములు రెవెన్యూ రికార్డుల ప్రకారం లేవని, కొందరి భూములు ఎక్కువ, మరికొందరి భూములు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు వాటిని పార్ట్‌-బిలో చేర్చారు. అప్పటి నుంచే ఆ గ్రామ రైతులకు కష్టాలు మొదలయ్యాయి.


పాస్‌బుక్కులు లేవు-రైతుబంధు లేదు

అధికారులు ఆ గ్రామ రైతుల భూములను పార్ట్‌-బీలో చేర్చి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఆ భూములు తమవేనంటూ రైతులు నిరూపించుకోవాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పాస్‌బుక్కులను తీసుకుని కొత్త పాస్‌ బుక్కులను ఇవ్వాలని రైతుల నాలుగేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. 2018లో రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పాస్‌బుక్కులు ఇచ్చిన ప్రభుత్వం నాగిరెడ్డిగూడెం గ్రామ రైతులకు మాత్రం ఇవ్వలేదు. పార్ట్‌-బీ నుంచి ఈ భూముల సర్వే నంబర్లను తొలగిస్తే తప్ప కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేమని నాలుగేళ్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొత్త పాస్‌బుక్కులు లేని కారణంగా 2018 ఖరీఫ్‌ సీజన్‌లో మొదలైన రైతుబంధును నాలుగేళ్లవుతున్నా ఈ గ్రామ రైతులకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. 


బ్యాంకుల రుణాలు లేవు

కొత్త పాస్‌బుక్కులు లేని కారణంగా నాగిరెడ్డిగూడెం గ్రామ రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా నాలుగేళ్లుగా వీరికి రైతు బీమా వర్తింపజేయడం లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణంగా రైతులు ప్రైవేట్‌ అప్పులు తీసుకుని పంటలు పండించుకుంటున్నారు. అలాగే వీరు పండించిన వివిధ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో సైతం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలన్నా రైతుల వద్ద కొత్త పాస్‌ బుక్కులు ఉండాలి. కొత్త పాస్‌ బుక్కులు లేకపోవడంతో ప్రతి ఏటా ఈ గ్రామ రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను బతిమాలి తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయించుకుంటున్నారు. ఏమైనా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగిరెడ్డి గూడెం రైతులెవరిని ప్రభుత్వం గుర్తించకపోవడం విచిత్రంగా ఉన్నది.


కొత్త పాస్‌బుక్కులు అందించాలి

-శ్రీనివా్‌సరెడ్డి, రైతు

గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలోని రైతులందరికీ వెంటనే కొత్తపాస్‌బుక్కులు అందించి ఆదుకోవాలి. వ్యవసాయ భూములు మా ఆధీనంలోనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పాస్‌బుక్కులు కూడా ఉన్నాయి. అయితే వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కొత్త పాస్‌బుక్కులు ఇచ్చి రైతులందరినీ ఆదుకోవాలి. 


రుణాలు ఇవ్వడం లేదు

- కృష్ణాగౌడ్‌, రైతు 

గ్రామంలోని మా భూములను మేము సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. అయినా ప్రభుత్వం కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేదు. దాంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రుణాలు, పాస్‌బుక్కుల కోసం అధికారుల చుట్టు ఎన్ని సార్లు తిరిగినా లాభం లేకుండాపోతున్నది. ఉన్నతాధికారులు స్పందించి మాకు కొత్త పాస్‌బుక్కులు ఇప్పించి రుణాలు, రైతుబంధు వచ్చేలా చూడాలి.

భూముల లెక్క తేలలేదు

- సుజాత, తహసీల్దార్‌, గుమ్మడిదల 

నాగిరెడ్డిగూడెం గ్రామరైతులకు ఇప్పటి వరకు కొత్త పాస్‌బుక్కులు ఇవ్వని విషయం వాస్తవమే. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ గ్రామంలో భూముల విస్తీర్ణంలో ఎక్కువ తక్కువ ఉండడం వల్ల అప్పట్లో అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పార్ట్‌-బీలో చేర్చారు. అందువల్ల కొత్త పాస్‌బుక్కులు మంజూరు కాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు చేపట్టి రైతులకు కొత్త పాస్‌బుక్కులు ఇచ్చేలా కృషి చేస్తా.

Updated Date - 2021-06-24T05:21:18+05:30 IST