అసత్యం అభయం ఇస్తుందా?

ABN , First Publish Date - 2021-05-25T06:38:32+05:30 IST

మాచెవులు ఎప్పుడు మంచి విషయాలనే వినాలి, మంచినే చూడాలి, దేవుళ్లారా, మేం చాలా కాలం బతకాలి, మాకు మంచి బలమైన శరీరం ఉండాలి, సౌష్టవం ఉండాలి...

అసత్యం అభయం ఇస్తుందా?

మాచెవులు ఎప్పుడు మంచి విషయాలనే వినాలి, మంచినే చూడాలి, దేవుళ్లారా, మేం చాలా కాలం బతకాలి, మాకు మంచి బలమైన శరీరం ఉండాలి, సౌష్టవం ఉండాలి... ఇట్లా సాగుతుంది ఉపనిషత్తులలోని శాంతిమంత్రం. దుఃఖాన్ని కలిగించేవాటిని వినాలని, చూడాలని ఎవరనుకుంటారు? కానీ, మంచి మాత్రమే వర్థిల్లే కాలం ఎప్పుడున్నది? ఎప్పుడు వస్తుంది? సత్యమే చెప్పాలి, ఇంపుగా ఉండేదే చెప్పాలి, సత్యమే అయినా సరే, కష్టం కలిగించేది చెప్పకూడదు, ఇష్టంగా ఉంటుంది కదా అని అబద్ధమూ చెప్పకూడదు- అంటాడు మనుస్మృతికారుడు. దీన్ని పాటించడం క్లిష్టమైన విన్యాసం. నొప్పి కలగకుండా నిజం చెప్పాలట. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధాన్ని ప్రత్యక్ష కథనం చేసిన సంజయుడు చాలా కష్టపడి ఉంటాడు. నిజం చెప్పేటప్పుడు దాని వల్ల ఎవరికీ హాని కలగకుండా చూడాలని, ధర్మానికి మంచి జరుగుతుందంటే అసత్యం ఆడవచ్చు తప్పేమీ లేదని మహాభారతంలో రాశారు. గాంధీజీ కూడా తన సత్యనిష్ఠకు, అహింసకు పోటీ పెట్టి, హాని కలిగించే సత్యానికి తక్కువ మార్కులు వేశారు. అనాది నుంచి ఈ చర్చ ఎందుకు జరుగుతున్నదంటే, వాస్తవం అన్నివేళలా ఆహ్లాదంగా ఉండదు కాబట్టి, మనుషులు అనేక సందర్భాలలో అప్రియమైనవీ, క్లేశం కలిగించేవీ అయిన మాటలు మాట్లాడవలసి వస్తుంది కాబట్టి. 


కొవిడ్ కాలంలో, సమాచార సాధనాలు వాస్తవాలను రాయాలా, కప్పిపుచ్చాలా, ఉన్నదున్నట్టు రాసి భయపెట్టాలా, పరిస్థితిని తేలికపరిచి ధైర్యం ఇవ్వాలా.. అన్న విచికిత్స తరచు ఎదురవుతున్నది. విషాదాన్ని, భయాన్ని కలిగించే సమాచారాన్ని చదవలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, కాసింత ఆశ కలిగించే విషయాలు కూడా రాయండి, చూపండి, అని అడిగే పాఠకులు, ప్రేక్షకులూ కూడా నిజంగా ఉన్నారు. వ్యవస్థాగత లోపాలను, ప్రభుత్వాల తప్పులను వేలెత్తి చూపుతూ పత్రికలు చేసే కథనాలు ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్నాయని, అటువంటి పత్రికారచన నిరాశావాద ధోరణికి, రంధ్రాన్వేషణ తత్వానికి చెందినదని విమర్శలు గుప్పించేవారు పాలకులలోను, వారి సమర్థకులలోను అనేకులు కనిపిస్తారు. మరికొందరు నాలుగడుగులు ముందుకువెళ్లి, నిజాలు రాశారో, వాస్తవాలు తెలుసుకునే పరిశోధనలకు ప్రయత్నించారో ఖబడ్దార్ అంటూ విపత్తు చట్టాన్ని ఝళిపిస్తారు. మీడియాలో అపసవ్య ధోరణలు లేవని, సంచలనాలకు మొగ్గే తత్వం లేదని ఎవరూ అనరు. తనను తాను సరిదిద్దుకోవడానికి పాత్రికేయం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ దిద్దుబాటు లేకపోతే, ప్రేక్షకులు లేదా పాఠకులు మీడియా మీద విశ్వాసం కోల్పోతారు. 


మానవ నాగరికతలో భాగంగా కొన్ని సున్నితత్వాలు అలవడ్డాయి. రంగస్థలం మీద హత్యను, యుద్ధాన్ని చూపించకూడదని రూపకశాస్త్రం కొన్ని వేల ఏళ్ల కిందట సూచించింది. సెప్టెంబర్ 11, 2011 నాటి సంఘటనలను పాఠకులకు అందించిన వేలాది అమెరికన్ పత్రికలు ఏవీ ఒక్క మృతదేహం ఫోటోను కూడా ప్రచురించలేదు. భారతీయ పత్రికలలో కూడా రోడ్డు ప్రమాద దృశ్యాలు లేదా హత్యాకాండ దృశ్యాలు ప్రచురించేటప్పుడు, భీకరంగా ఉన్నవాటిని, కలవరం, జుగుప్స కలిగించేవాటిని పరిహరించడం లేదా మసకబార్చడం చేస్తారు. అది మాత్రమే సరిపోదు, మరింతగా సున్నితత్వాన్ని అలవరచుకోవలసిన అవసరం ఉన్నదన్న స్పృహ కూడా పెరుగుతోంది. అయితే, పైన చెప్పిన ఉదాహరణలేవీ వాస్తవికతను మరుగుపరచలేదు. మృతుల సంఖ్యను దాచవు. జంట శిఖరాలలో నుంచి విమానం దూసుకుపోతున్న దృశ్యమే బీభత్సాన్ని మొత్తంగా వ్యక్తం చేయగలుగుతుంది. భోపాల్ విషవాయు బాధితులకు ఒక బాలకళేబరం, సిరియన్ శరణార్థి సంక్షోభానికి ఒడ్డుకు కొట్టుకువచ్చిన చిన్నారి శరీరం- కలచివేస్తాయి నిజమే కానీ, ఆ దృశ్యాల వెనుక జరిగిన దుర్మార్గం అంతకంటె ఎక్కువగా మనలను కలచివేయాలి.


కొవిడ్ విషాద సన్నివేశానికి సంబంధించి పాఠకులను భయపెట్టవద్దని అభ్యర్థిస్తున్న పాలకులు, వారి మిత్రుల ఉద్దేశ్యం ఏమిటి? భయం కలిగించే వార్తారచన మనుషుల సున్నితత్వాలను దెబ్బతీస్తుందనా? లేక, వాస్తవం తెలిసినందువల్ల కలిగే ఆందోళనలో ప్రజల స్వస్థత మరింతగా ప్రభావితమవుతుందనా? పెద్దసంఖ్యలో అంత్యక్రియలు జరుగుతున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో చిత్రించి, ప్రచురించిన జాతీయ, అంతర్జాతీయ పత్రికలు నిజంగా మనలను భయపెట్టాయా? దేశం పరువు తీస్తున్నారని విదేశీపత్రికల స్వదేశీ విలేఖరులను సామాజిక మాధ్యమాలలో నిందిస్తున్నవారు, గుట్టుచప్పుడు కాకుండా మన చావు మనం చద్దామని చెబుతున్నారా? కొవిడ్‌ను ఎదుర్కొనడంలో వ్యవస్థ, ప్రభుత్వాలు ఎదుర్కొన్న దారుణమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ప్రభుత్వాలు ఆశావహ కథనాలు, నిరాశావహ కథనాలు అని వర్గీకరణలు చేస్తున్నాయి. మీడియాలో వాస్తవాలు వస్తున్నాయి కాబట్టే, ప్రభుత్వాలు ఏ మాత్రమో జవాబుదారీగా ఉండవలసి వస్తున్నది. విధినిర్వహణలో బాధ్యతగా ఉన్న అధికారి గురించి, సేవలు చేస్తున్న వైద్యసిబ్బంది గురించి, ప్రభుత్వాలు విఫలమైన చోట్ల రంగంలోకి దిగి పనిచేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల గురించి పత్రికలు రాయడం లేదా? విధాన నిర్ణేతలనే కదా, వారి దోషాలనే కదా తప్పుపడుతున్నది? ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించకుండా తప్పించుకునేందుకు, లేక తాను అల్లరిపాలు కాకుండా కాపాడుకునేందుకు లెక్కలు తారుమారు చేస్తే, మీడియా దానికి తనిఖీలు నిర్వహించకూడదా? 


చెడు అనవద్దు, కనవద్దు, వినవద్దు- అని గాంధీగారి కోతులు చెబుతున్నాయంటే, చెడు జరుగుతున్నా కళ్లు, చెవులు మూసుకొమ్మని కాదు. మనం కూడా ఆ చెడులో భాగస్వామి కావద్దని మాత్రమే ఆయన సందేశం. సత్యం కఠినమైనదైనా, అప్రియమైనదైనా పాలకులు సహనంతో ఆలకించాలి, తెలుసుకోవాలి. వర్తమాన సన్నివేశంలో మంచిచెడ్డలను వివరిస్తూ, ప్రజల మనసులోని మాటను ప్రకటిస్తూ, రేపటి ప్రమాదాలను ముందే హెచ్చరిస్తూ తన బాధ్యత నిర్వహిస్తున్న పత్రికా, ప్రసార రంగాలను తప్పుపట్టడం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే. కొన్ని వాస్తవాలు తాత్కాలికంగా అలజడి కలిగించినా, పరిస్థితిని ఎదుర్కొనడానికి, పోరాడే పట్టుదల పెంచుకోవడానికి పనికివస్తాయి. సరైన వ్యూహరచనకు తోడ్పడతాయి.

Updated Date - 2021-05-25T06:38:32+05:30 IST