Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆకాశం నుంచి చిమ్మితే విషం అమృతమవుతుందా?

twitter-iconwatsapp-iconfb-icon
ఆకాశం నుంచి చిమ్మితే విషం అమృతమవుతుందా?

తెలంగాణలో పరిపాలన శాస్త్రీయ దృక్పథంతోనో, దూరదృష్టితోనో కాకుండా, ఫ్యాన్సీ ఆలోచనలతో సాగుతుందని చెప్పటానికి పదుల కొద్దీ ఉదాహరణలు ఇవ్వొచ్చు. ఈ ఫ్యాన్సీ ఆలోచనలతో వచ్చిన ప్రమాదం ఏమంటే, అవి సుస్థిరంగా ఉండవు, దీర్ఘకాలం మన్నవు. దూరం నుంచి చూసేవారికి ఆకర్షణీయంగా మాత్రం కనిపిస్తాయి. వీటిని అమలు చేసిన పాలకుల ఎన్నికల ప్రయోజనాలను నెరవేరుస్తాయి. అవినీతిపరుల జేబులు నింపుతాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపి, భవిష్యత్ తరాలకు మోయలేని భారంగా మిగులుతాయి.


అత్యంత ఖరీదైన సాగు నీరు అవసరమయ్యే కోటి ఎకరాల మాగాణం, రాష్ట్రంలో లోతైన భూములు లేని ప్రాంతాలు ఎక్కువని తెలిసినా కోటి ఎకరాల పత్తి సాగు, రాష్ట్ర వాతావరణానికి అనువు గాని లక్షల ఎకరాల ఆయిల్ పామ్ విస్తరణ, సరైన డిజైన్లు లేకుండానే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే లక్షకోట్లతో భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముంపుకు గురి చేయడం, విద్యుత్ బిల్లులూ భూగర్భ జలాల పట్టింపు లేకుండా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, వందల కోట్లు వృథా చేసి నిర్మించిన పాలీ హౌజులు, సాగు చేయని భూములకూ చెల్లిస్తున్న రైతు బంధు, చదువుకునే బడులు కూలిపోతున్నా సరే పట్టించుకోకుండా వందల కోట్లతో అట్టహాసంగా గుడుల నిర్మాణాలు – ఇవన్నీ అందులో కొన్ని మాత్రమే.


ఇప్పుడు తాజాగా వీటికి మరో అంశం తోడైంది. అత్యంత ప్రమాదకరమైన పురుగు విషాలను డ్రోన్లతో రైతుల పంట పొలాలపై పిచికారీ చేయటం. రాష్ట్రంలో సరైన చర్చ జరగకుండానే, భవిష్యత్ ప్రమాదాలను పట్టించుకోకుండానే, ఆచరణలోకి వెళ్ళిపోయిన ఈ కార్యక్రమం, రైతులకు, రాష్ట్రానికి ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ, బహుళ జాతి విష రసాయనాలను తయారు చేసే కంపెనీలకు, డ్రోన్‌లను తయారు చేసే కంపెనీలకు మాత్రం లాభాల పంట పండించనున్నది.


నిజానికి గత ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించడంపై ప్రభుత్వం కనీస చర్చ కూడా చేయలేదు. అడ్డగోలుగా పంటల ప్రణాళికలు ముందుకు తెస్తూ, రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. రాష్ట్ర పర్యావరణం విషపూరితమయ్యేలా రసాయనిక ఎరువుల, పురుగు, కలుపు విషాల వినియోగం పెరిగిపోతున్నా, ఈ విష వలయం నుంచీ బయట పడేయడానికి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధాన రూపకల్పన గురించిన చర్చ చేయలేదు. కనీసం కేంద్రం ప్రకటించిన పరం పరాగత్ కృషి వికాస్ యోజన (పి‌కే‌వి‌వై) లాంటి పథకాలను కూడా రాష్ట్రంలో సరిగా అమలు చేయలేదు.


ఫలితంగా పంటల సస్య రక్షణలో, కలుపు నివారణలో విష రసాయనాల వినియోగం ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నది. అంటే రాష్ట్ర పర్యావరణం కలుషితమైపోతున్నది. గాలి, నీరు, నేల, అందులో పండే ఆహారం మొత్తం విషపూరితమే. తేనెటీగలు తగ్గిపోవడానికి, తద్వారా సగటు దిగుబడులు పడిపోవడానికి ఈ విష రసాయనాలే కారణం. భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోవడానికి, రాష్ట్రంలో భూసారం తగ్గిపోవడానికి, భూగర్భ జలాల్లో నైట్రైట్ పరిమాణం పెరిగిపోవడానికి, ఫలితంగా రాష్ట్రంలో క్యాన్సర్ లాంటి జబ్బులు విజృంభించడానికి, ఈ విష రసాయనాలే కారణం. క్యాన్సరుకు నేరుగా కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నిషేధిత గ్లైఫోసేట్ కలుపు విషం ఇంకా రాష్ట్ర మార్కెట్టులో రైతులకు అందుబాటులో ఉందంటే, మన నియంత్రణ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


ఈ దశలోనే, రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుడ్డిగా కళ్ళు మూసుకుని గుజరాత్‌కు చెందిన ధనుకా అనే విషాలు అమ్మే కంపెనీతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్నది. చైనా, అమెరికా లాంటి ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో ఈ విషాల వినియోగం తక్కువగా ఉందనీ, వీటి వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందనీ నమ్ముతున్న వ్యాపార సంస్థ ఇది. డ్రోన్ లాంటి మానవ రహిత వైమానిక పరికరాలతో పురుగు విషాలు చిమ్మాలని ఉవ్విళ్లూరుతూ ప్రోత్సహిస్తున్న యుపిఎల్ లాంటి పెస్టిసైడ్స్ అమ్మే సంస్థలు కూడా ఇవాళ తెలంగాణ వ్యవసాయంలో లాభాలు చేసుకోవడానికి పరుగులెత్తుతున్నాయి.


కేంద్ర వ్యవసాయ శాఖ క్రిమిసంహారక చట్టం, 1968 పరిధిలో క్రిమిసంహారకాలను నియంత్రించేందుకు నియమించబడిన సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డు (CIBRC) డ్రోన్‌ల ద్వారా పురుగు విషాలు చిమ్మడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (SOP) పేరుతో ఒక డాక్యుమెంట్ కూడా విడుదల చేసింది. ఆ శాఖ వెబ్‍సైట్‍లో ఇంగ్లిషులో ఉన్న ఈ పత్రంలో అంశాలు ఇప్పటికీ స్థానిక భాషల్లో అందుబాటులో లేవు. అందులో ఉన్న అంశాలు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు, స్థానిక గ్రామ పంచాయితీలకు తెలియవు.


ఇప్పటివరకు, పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ (DGCA) డ్రోన్‌ల ద్వారా ఏరియల్‌గా పురుగు విషాలను పిచికారీ చేయడానికి షరతులతో కూడిన మినహాయింపులు ఇస్తోంది. అటువంటి మినహాయింపులను ఇచ్చే అధికారం నిజానికి DGCAకి లేదు. క్రిమి సంహారకాల చట్టం, 1968 ప్రకారం, డ్రోన్‌ల ద్వారా వైమానిక స్ప్రేయింగ్‌ను అనుమతించే ఏకైక అధికారం CIBRCకి ఉంది. కానీ వాళ్ళు మౌనంగా ఉంటున్నారు.


ఈ నియమాలలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, నీటి వనరు, డ్రోన్‌లతో పిచికారీ చేసే ప్రాంతం మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని చెప్పారు. పెస్టిసైడ్ పిచికారీ చేయడానికి ఉద్దేశించిన పంటకు, దాని పక్కనే ఉన్న ఇతర పంటలకూ మధ్య కూడా బఫర్ జోన్ ఉండాలని చెప్పారు. డ్రోన్‌ను నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాస పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటి నుండి 100 మీటర్ల దూరంలో నడపాలి.


డ్రోన్‌ల ద్వారా పిచికారీ చేయాలనుకుంటే ఆ విషయాన్ని స్థానిక గ్రామ పంచాయితీకి 24 గంటల ముందుగా తెలియ చేయాలని నియమం ఉంది. అలాగే ఆ ప్రాంతంలోని వ్యవసాయ అధికారికి కూడా సమాచారం ఇవ్వాలి. అయితే, ఈ సమాచారంతో ఏమి చేయాలనే దానిపై గ్రామ పంచాయతీకి నిర్దిష్ట మార్గదర్శనం లేదు. ప్రభుత్వం సంబంధిత పనిని గెజిట్ చేయలేదు. పంచాయితీ చట్టాలలో అటువంటి నిబంధన కూడా లేదు. డ్రోన్‌లతో పిచికారీ చేసినప్పుడు పిచికారీ కార్యకలాపాలతో సంబంధం లేని జంతువులు, వ్యక్తులు నిర్దిష్ట కాలానికి అటువంటి ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధించాలనేది మరో నిబంధన.


అగ్రి డ్రోన్‌లను ఎగరేయడానికి DGCA సర్టిఫైడ్ పైలట్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది అని మరో నిబంధన పెట్టారు. సాధారణంగా, DGCA సర్టిఫికేషన్ డ్రోన్ ఎగిరే సామర్థ్యం గురించి ఉంటుంది తప్ప పురుగు విషాలను చల్లడం గురించి కాదు. ప్రమాదకర పురుగు విషాలను పే లోడ్‌ లుగా నిర్వహించడంలో పైలట్‌లకు ప్రత్యేక శిక్షణ అవసరం. కానీ ఇప్పుడు డ్రోన్‌లు వాడుతున్న వాళ్ళు ఈ శిక్షణ తీసుకున్నారో లేదో రైతులు చూసుకోవాలి. పైన చెప్పిన నియమాలన్నీ పాటిస్తున్నారో లేదో వ్యవసాధికారులు పర్యవేక్షించాలి.


నిజానికి, పంటల సస్య రక్షణలో సమర్థవంతమైన పాత్ర పోషించేవి– బహుళ పంటల సాగు, అంతర పంటలు, సరిహద్దు పంటలు. ఇవేగాక ఫిరమోన్ ట్రాప్స్, వేప ఉత్పత్తులు, మన చుట్టూ ఉండే అనేక మొక్కల భాగాలతో చేస్తున్న కషాయాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ఋజువైన విషయం ఇది. 


కానీ ఇప్పుడు గాలి వాటం నియంత్రణలో లేని పరిస్థితిలో, డ్రోన్‌లతో విషాల పిచికారీ చేస్తున్నప్పుడు, టార్గెట్ చేసిన పంట కాకుండా, దానికి దగ్గరలోనే ఉన్న ఇతర పంటలపై ఆ విషం ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఆ పంటల మధ్యలోనే ఎవరైనా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటే, వాటి పరిస్థితి ఏమిటి?


డ్రోన్‌లు పెరిగిన కొద్దీ, అందరూ ఒకే పంట, ఒకేసారి వేస్తేనే డ్రోన్‌లను ఉపయోగించుకోవచ్చు అనే అభిప్రాయం రైతులలో బలపడే అవకాశం ఉంది. ఇలాంటి మోనో క్రాపింగ్ సృస్టించే విధ్వంసాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. పైగా కొన్ని బహుళజాతి కంపెనీలకు విత్తనాలు, రసాయనాల అమ్మకాలపై గుత్తాధిపత్యానికి ఇది దారితీయవచ్చు.


డ్రోన్‌ల కొనుగోలుకు సబ్సిడీలు ఇచ్చేలా, కంపెనీలు ప్రభుత్వాల దగ్గర లాబీ చేస్తున్నాయి. రైతు సహకార సంఘాలను కూడా డ్రోన్‍లు కొనుక్కోమని ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో డ్రోన్ విలువ 10లక్షలు ఉండొచ్చనీ, అందులో 75శాతం సబ్సిడీ ఇవ్వాలనీ చర్చలు సాగుతున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో 5వేల డ్రోన్‍లు వస్తాయి అనుకున్నా, 375 కోట్ల సబ్సిడీ మొత్తం అన్నమాట. ఇంత ఖర్చుపెట్టి పథకాన్ని అమలు చేసినా, డ్రోన్‌లతో పురుగు విషాలు పిచికారీ చేసినా రైతుల కేమీ ఖర్చు తగ్గదు. పురుగు విషం అమృతంగా మారదు.


కేంద్రంలో అధికారం చెలాయిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్న గుజరాతీ రాజకీయ నాయకత్వంతో పోరాడుతూ, మరో వైపు గుజరాతీ పురుగు మందుల కంపెనీలను నెత్తిన పెట్టుకోవడం వల్ల రైతులకు గానీ, మన రాష్ట్రానికి గానీ ఏమీ ఉపయోగం లేదు. దేశానికే మార్గం చూపించిన మన ములకనూరు, ఎనబావి లాంటి గ్రామాలను ప్రోత్సహిస్తే అందరికీ క్షేమం.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.