వ్యాక్సినేషన్‌కు.. రూ.80వేల కోట్లు ఉన్నాయా?

ABN , First Publish Date - 2020-09-27T08:31:49+05:30 IST

130 కోట్ల మంది భారతీయులకు కరోనా వ్యాక్సినేషన్‌ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ ప్రశ్నకు పుణెలోని విఖ్యాత వ్యాక్సిన్‌ కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా ఇచ్చిన సమాధానం రూ.80వేల కోట్లు...

వ్యాక్సినేషన్‌కు.. రూ.80వేల కోట్లు ఉన్నాయా?

  • కేంద్రానికి ‘సీరం’ సీఈఓ సూటిప్రశ్న


పుణె, సెప్టెంబరు 26: 130 కోట్ల మంది భారతీయులకు కరోనా వ్యాక్సినేషన్‌ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ ప్రశ్నకు పుణెలోని విఖ్యాత వ్యాక్సిన్‌ కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా ఇచ్చిన సమాధానం రూ.80వేల కోట్లు. ‘‘వచ్చే సంవత్సర కాలంలో దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేయడానికి అవసరమైన ఎనభై వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయా?’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా సూటి ప్రశ్నను సంధించారు. ‘‘ఈ భారీ బడ్జెట్‌తో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు, పంపిణీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. దీనిపై దేశ, విదేశీ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రచించాలి. మనం తదుపరిగా ఎదుర్కోబోతున్న ఆందోళనకర సవాల్‌ ఇదే’’ అని పూనావాలా వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌లో ‘పీఎంఓ ఇండియా’, ‘కేంద్ర ఆరోగ్యశాఖ’ల ట్విటర్‌ హ్యాండిల్‌లను ట్యాగ్‌ చేశారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నోవావ్యాక్స్‌ సహా ఐదు అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో ఎస్‌ఐఐ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-09-27T08:31:49+05:30 IST