Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పోషకాల గని మొక్కజొన్న

twitter-iconwatsapp-iconfb-icon
పోషకాల గని మొక్కజొన్న

వర్షం పడుతున్న సమయంలో నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను తినడం, ధియేటర్‌లో సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినడంలో ఉండే మజా అలా చేసినవారికే తెలుస్తుంది. కేవలం చిరుతిండిగా మాత్రమే మొక్కజొన్న  ఉపయోపడుతుంది అనుకుంటే పొరపాటే. మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మొక్కజొన్నతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు కూడా.


వరి, గోధుమ లాగే మొక్కజొన్న కూడా ఆహార పంటల్లో ఒకటి. నూట్రియంట్లు సమృద్ధిగా ఉండే మొక్కజొన్నలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కొలెస్టారాల్‌ స్ఠాయుల్ని తగ్గించడంతో పాటు వ్యాధులపై పోరాడే శక్తిని కూడా మొక్కజొన్న పెంపొందిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా తరచూ మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


రక్తహీనతను తగ్గిస్తుంది

మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. రక్తహీనత (ఎనీమియా) ముప్పు రాకుండా తగిన మోతాదులో న్యూట్రియంట్లను సరఫరా చేయడంలో మొక్కజొన్న దోహదం చేస్తుంది. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రొటీన్లు, 9 గ్రాముల సూక్రోజు,  రెండు గ్రాముల కొవ్వు, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది.


శక్తికారకం

అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది.  మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు శక్తిదాయకంగా ఉంటుంది. ఒక కప్పు గింజల ద్వారా లభించే  కార్బొహైడ్రేట్లు కేవలం శారీరక శక్తిని పెంపొందించడానికే కాదు మెదడు, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది. అందువల్ల తరచూ ఆహారంలో మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. సోడియం (ఉప్పులో ఒక భాగం) తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న ఎంతో ఆరోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. 


బరువు పెరగడానికి

వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేనివారి విషయంలో మొక్కజొన్న దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. బరువు తక్కువ ఉన్నవారు ఆందోళన చెందనవసరం లేదు. జంక్‌ ఫుడ్‌ తింటే వచ్చే బరువు దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొక్కజొన్నతో అటువంటి పరిస్థితి రాదు. తరచూ ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూసుకుంటే ఆరోగ్యకరమైన క్యాలరీలతో పాటు విటమిన్లు, తగిన పరిమాణంలో ఫైబర్‌ కూడా శరీరానికి అందుతాయి.


మధుమేహులకూ మంచిదే

మొక్కజొన్నలో స్వీట్‌ కార్న్‌ రకం ఉంటుంది. స్వీట్‌ కార్న్‌, స్వీట్‌ కార్న్‌ ఆయిల్‌ రెండూ శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు రక్తంలో కొలెస్టారాల్‌ శోషణను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.  అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి మొక్కజొన్న ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది. రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు. విటమిన్‌ బి1, బి5, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తికి  కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.


గర్భిణులకు మేలు

గర్భందాల్చినవారికి మొక్కజొన్న చేసే మేలు ఇంతా అంతా కాదు. గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌, జిక్సాన్‌తిన్‌, పాథోజెనిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండటం వల్ల శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించవచ్చు. మొక్కజొన్నలో పీచు అధికంగా ఉండటం వల్ల సాధారణంగా గర్భిణులకు వచ్చే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది.‍


చర్మం ఆరోగ్యంగా

మొక్కజొన్నలో విటమిన్లు, లైకోపిన్‌ (యాంటి ఆక్సిడెంట్లు) పుష్కలంగా ఉంటాయి. దీంతో కొలిజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా యూవీ కిరణాల జనిత ఫ్రీ రాడికల్స్‌తో చర్మానికి హాని కలుగకుండా నివారిస్తుంది. సౌందర్య కారక ఉత్పత్తుల్లో మొక్కజొన్న గింజల నుంచి తయారు చేసే నూనెను వినియోగిస్తారు. అందువల్ల మొక్కజొన్నను చిరుతిండిగా, ఛాట్‌, సూప్‌ తదితరాల్లో చేర్చుకుని హాయిగా తినొచ్చు.


క్యాన్సర్‌ రాదు

మొక్కజొన్న గింజల్లో సమృద్ధిగా కెరొటినాయిడ్స్‌ ఉంటాయి. దీని వల్ల నేత్ర సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.   దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ ఫోలిక్‌ యాసిడ్‌ అన్నిరకాల క్యాన్సర్లకు నిరోధకంగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక, మొండి వ్యాధుల నివారణ మందుల తయారీలోనూ మొక్కజొన్న వినియోగం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును నివారించేందుకు ఉపయోగపడే ఎమినో యాసిడ్స్‌  తూతెయిన్‌, జీక్జాన్‌డిన్‌ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు లినోలిక్‌ యాసిడ్, రిబోఫ్లావిన్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ మీద ప్రభావం చూపుతాయి. రక్తలేమిని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చిన్న ప్రేగుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం రానీయదు. కొలెస్టారాల్‌ నియంత్రిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.  వయసు పెరుగుదలతో వచ్చే దుష్ప్రభావాలను  నివారిస్తుంది.

 

అదనపు రుచి కోసం

మొక్కజొన్నను వివిధ రకాలుగా వినియోగిస్తారు. మొక్కజొన్న కండెలను కాల్చుకుని తినొచ్చు. కాల్చిన కండెకు ఉప్పుకారం లేద నిమ్మకాయ రసం రాసుకుని కూడా తినొచ్చు. ఇటీవలి కాలంలో కండెలను నీళ్ళలో ఉడకబెట్టి తినడం ఫ్యాషన్‌గా మారింది. పాప్‌కార్న్‌ పేరుతో మొక్కజొన్న గింజల పేలాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటి గింజల నుంచి కార్న్‌ ఫ్లేక్స్‌ తయారు చేస్తారు. చిన్న పిల్లలకు కార్న్‌ ఫ్లేక్స్‌ను పాలలో వేసి పెడితే బలవర్ధకం. మొక్కజొన్న పిండితో చేసే రొట్టెలు, గోధుమ జొన్న పిండితో చేసే రొట్టెలకన్నా రుచిగా ఉంటాయి. ఉడకపెట్టిన బంగాళదుంపల్లో ఉప్పు, కారం ఇతర మషాలాలను జోడించి మొక్కజొన్న పిండి అద్ది చేసే కట్‌లెట్లకు అన్ని వర్గాల ప్రజలూ ఇష్టంగా తింటారు. సూప్‌లు, సలాడ్లలో కూడా మొక్కజొన్న వినియోగం ఎక్కువగానే ఉంటోంది. మొక్కజొన్న పిందెగా ఉన్నప్పుడే కోసి బేబి కార్న్‌ అంటూ విక్రయిస్తారు. వీటిని కూరగా వండుకుని తింటారు. బేబీ కార్న్‌ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉండడట వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వంద గ్రాముల బేబీ కార్న్‌లో 26 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం ఏర్పడదు. డయాబెటిస్‌ ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరం. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. బేబీ కార్న్‌లో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

 

ఇతర పరిశ్రమల్లో

కాస్మొటిక్స్‌ తయారీలో మొక్కజొన్న గింజల నుంచి తీసిన నూనెను విరివిగా వినియోగిస్తారు. వీటి గింజలను కోళ్ళకు మేతగా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. పశువుల దాణా తయారీలో మొక్కజొన్న ప్రాధాన్యం ఎనలేనిది. బేకింగ్‌ పౌడర్ల తయారీలో మొక్కజొన్న పిండి వినియోగిస్తారు. అనేక మందుల తయారీలో కూడా మొక్కజొన్నను వాడుతున్నారు. మానవుడికి ఆరోగ్యపరంగా మొక్కజొన్న ఉపయోగాలు ఎన్నో ఉండటంవల్ల ఆయుర్వేదం ఔషధాల తయారీ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి. మొక్కజొన్న గింజలతో తయారు చేసే కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మొక్కజొన్న గింజలనే కాదు మొక్కజొన్న కండె చుట్టూ ఉండే మృదువైన దారాలను (పీచును) కూడా కషాయాల తయారీ వినియోగిస్తున్నారు. ఈ కషాయం మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇలా మొక్క జొన్న వుపయోగం కొన్ని వేల ఉత్పత్తులలో కనబడుతున్నది.  మొక్కజొన్న వాడుతున్నారు. మొకజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. మొక్కజొన్నను బయోగ్యాస్‌ ప్లాంట్లలో వినియోగిస్తున్నారు. మోటారు వాహనాలకు ఇంధన తయారీలో ఎథనాల్‌గా దీనిని వినియోగిస్తారు. ఇంకా అనేక పారిశ్రమిక ఉత్పత్తులో కూడా మొక్కజొన్న వినియోగం గణనీయంగా ఉంటోంది. 


ఆహార ధాన్యంగానే

ప్రపంచంలో గోధుమ, వరి కన్నా ఎక్కువగా సాగుచేస్తున్నది మొక్కజొన్నే. దాదాపు పది వేల సంవత్సరాల క్రితమే మొక్కజొన్నను సాగుచేశారు. తొలుత మెక్సికో, సెంట్రల్‌ అమెరికాల్లో సాగుచేసిన ఈ పంట క్రమంగా ప్రపంచమంతా విస్తరించింది. సాధారణంగా కూరగాయ రకంగా భావిస్తున్నా వాస్తవానికి మొక్కజొన్నను ధాన్యంగానే పరిగణించాలి. పసుపు రంగు మొక్కజొన్నను దాదాపు అన్ని దేశాల్లోనూ పండిస్తారు. అయితే ఎరుపు, ఆరెంజ్, వంగపండు రంగు, నీలం, తెలుపు, నలుపు రంగుల్లో కూడా మొక్కజొన్న ఉంటుంది. పసుపు రంగులో లభించే మొక్కజొన్నలో తీపి రకం కూడా ఉంటుంది. దీనిని స్వీట్‌ కార్న్‌ అని పిలుస్తారు. ఏటా ఇతర పంటలకన్నా ఎక్కువగానే మొక్కజొన్నను సాగుచేస్తున్నా మానవ వినియోగం తక్కువే.    అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పినట్లు.. మొక్కజొన్నతో ఎన్నో లాభాలు ఉన్నాయి కదా అని అతిగా తింటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంట్లో ఉండే స్టార్చ్‌ వల్ల మొక్కజొన్న తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాదు. ముఖ్యంగా కాల్చిన మొక్కజొన్న కండెలు, స్వీట్‌ కార్న్‌ను తినేటప్పుడు పూర్తిగా నమిలి తినడం సాధ్యం కాదు. అందువల్ల కొంత భాగం పూర్తిగా జీర్ణం కాదు. శరీరం దానిని శోషించుకోలేదు. ఫలితంగా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి ఉడకపెట్టిన స్వీట్‌ కార్న్‌ను అధికంగా తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

– ఎన్‌. లీలా మాధవ హరీష్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.