Neeraj Chopra కూడా నజరానాలకు TAX కట్టాల్సిందే.. ఈ రూల్స్ మీకు తెలుసా..?

ABN , First Publish Date - 2021-08-12T01:19:34+05:30 IST

ఒలింపక్స్‌లో అథ్లెటిక్స్ స్వర్ణం కోసం వందేళ్లుగా భారత్ చేస్తున్న నిరీక్షణకు తెరదించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.

Neeraj Chopra కూడా నజరానాలకు TAX కట్టాల్సిందే.. ఈ రూల్స్ మీకు తెలుసా..?

ఇంటర్నెట్ డెస్క్: ఒలింపక్స్‌లో అథ్లెటిక్స్ స్వర్ణం కోసం వందేళ్లుగా భారత్ చేస్తున్న నిరీక్షణకు తెరదించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. ఈ ఘనత సాధించిన నీరజ్‌కు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలురాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నజరానాలు ప్రకటించాయి. వీరితోపాటు ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు, క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కూడా నీరజ్‌కు నీరాజనాలు పడుతూ నగదు బహుమతులు ప్రకటించింది.


మరి ఇలా నీరజ్‌ అందుకున్న నజరానాలపై పన్నుల మాటేమిటి? ఇవన్నీ బహుమతులు కదా, అసలు వీటిపై ట్యాక్స్ పడుతుందా? అనే డౌట్ చాలా తక్కువ మందికే వచ్చి ఉంటుంది. ఈ అనుమానానికి ఆనంద్ జైన్ అనే ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ సమాధానమిచ్చారు. ట్యాక్స్ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించిన ఆయన.. నీరజ్ కట్టాల్సిన ట్యాక్సుల గురించి ఏమన్నారంటే..?


ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలు, ఏసియన్ గేమ్స్‌ వంటి టోర్నీల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు ప్రభుత్వాలు భారీ నజరానాలివ్వడం మామూలే. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నజరానాలపై ఎటువంటి పన్నులూ ఉండవు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 2014లోనే ఆదేశాలు జారీచేసింది. వీటి ప్రకారం, కేవలం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నజనారాలపై మాత్రమే ఎటువంటి ట్యాక్సులూ ఉండవు.


కానీ, ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే బహుమతులపై క్రీడాకారులు కచ్చితంగా పన్నులు చెల్లించాల్సిందే. అంటే నీరజ్‌కు ఆనంద్ మహీంద్రా ఇస్తున్న ఎక్స్‌యూవీపై 30 శాతం పన్ను కట్టాల్సిందే. అంతేకాదండోయ్.. ప్రభుత్వాలు ఇచ్చే బహుమతుల్లో కూడా పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే వాటిపైనే పన్ను రాయితీ ఉంటుంది. అంటే మహిళల హాకీ జట్టుకు హరియాణా ప్రభుత్వం ప్రకటించిన నజరానాపై ట్యాక్స్ చెల్లించక తప్పదు. 


ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే.. సామాన్యులకు కూడా కొన్ని సార్లు ఇతరులు బహుమతులుగా డబ్బులు అందజేస్తారు. ఇలా ఏడాది మొత్తంలో అప్పుడప్పుడూ అందుకున్న బహుమతుల విలువ రూ.50 వేలు దాటితే దానికి పన్ను కట్టాల్సిందే. దీన్ని ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లో చూపించాలట. ఈ వివరాలను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లో చూపించకపోతే ఆ తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని సీఏ ఆనంద్ జైన్ వివరించారు.


టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ కల నెరవేర్చిన బల్లెం వీరుడు నీరజ్‌కు ఎవరెవరు ఎంతెంత నజరానాలు ప్రకటించారో ఒకసారి చూద్దామా?


  • * హరియాణా ప్రభుత్వం రూ. 6 కోట్ల భారీ నజరానా
  • * పంజాబ్ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు
  • * మణిపూర్ ప్రభుత్వం నుంచి రూ. కోటి
  • * రైల్వే శాఖ రూ.3 కోట్ల నజరానా
  • * ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి సంవత్సరం పాటు ఫ్రీ టికెట్లు
  • * బీసీసీఐ నుంచి రూ.కోటి
  • * ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం నుంచి రూ.కోటి
  • * మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 700 కారు (దీని మార్కెట్ విలువ రూ.20 లక్షల వరకూ ఉంటుందని అంచనా)
  • * భారత ఒలింపిక్ సంఘం నుంచి రూ.75 లక్షల నగదు బహుమతి

Updated Date - 2021-08-12T01:19:34+05:30 IST