టాయిలెట్ల ద్వారా కరోనా? షాకింగ్ విషయాలు వెలుగులోకి...

ABN , First Publish Date - 2021-05-05T21:32:13+05:30 IST

కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళన నెలకొంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా..

టాయిలెట్ల ద్వారా కరోనా? షాకింగ్ విషయాలు వెలుగులోకి...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళన నెలకొంది. రోజుకు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నవేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వాదన తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్లషింగ్ టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తోందన్నది దాని సారాంశం. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇందులో నిజమెంతో తెలుసుకుందాం. 


కరోనా వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే ఓ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టాయిలెట్ వినియోగ సమయంలో జరిగే మల-నోటి సంక్రమణ మార్గాన్ని నిరోధించడం ద్వారా నోవల్ కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టవచ్చునని ఈ పరిశోధన పేర్కొంది. 


ఈ పరిశోధనలో ఏం తేలింది?

ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు ఆ బౌల్‌లోపల బలమైన ప్రవాహం వల్ల పెద్ద ఎత్తున తుంపరలు చెలరేగుతాయి. కంటికి కనిపించనంత పరిమాణంలో టాయిలెట్ బౌల్ నుంచి వచ్చే  ఈ తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందా అన్న కోణంలో ఈ పరిశోధన సాగింది. ఫ్లషింగ్ చేస్తున్నప్పుడు టాయిలెట్ బౌల్ నుంచి సెకనుకు 5 మీటర్ల వేగంతో నీటి తుంపరలు పైకి లేస్తాయి. విడుదలైన మొత్తం తుంపర్లలో 40-60 శాతం టాయిలెట్ సీట్ కంటే పైకి వెళ్లి విస్తృతంగా వ్యాపిస్తాయి. అంటే నేల నుంచి 106 సెంటీమీటర్లకు మించి పైకి వెళతాయి. ఇలా విస్తరించిన కణాలు ఫ్లషింగ్ తర్వాత 30-70 సెకన్ల తర్వాత కూడా తేలియాడుతూనే ఉంటాయని తేలింది. ఇదే ఇప్పుడు అందోళన కలిగిస్తోంది. 


దీనికి తోడు మల-నోటి సంక్రమణ స్వభావాన్ని బట్టి.. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు టాయిలెట్ వినియోగించినప్పుడు పెద్ద సంఖ్యలో వైరస్‌లు టాయిలెట్ బౌల్‌లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్లను ఇన్ఫెక్షన్ కేంద్రాలుగా భావిస్తున్నారు. సరైన విధంగా టాయిలెట్స్ ఉపయోగించకపోతే వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున దయచేసి జాగ్రత్త వహించండి. ‘‘కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు సాధారణంగా హోం ఐసొలేషన్‌లో ఉంటారు. వాళ్లు షేరింగ్ బాత్రూం ఉపయోగించడం అనివార్యం. ఇక పబ్లిక్ టాయిలెట్లలో అయితే చాలామంది వచ్చివెళ్తుంటారు. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి ద్వారా అనేక మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఈ కారణాల దృష్ట్యా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మరుగుదొడ్లను జాగ్రత్తగా పరిశీలించడం అత్యవసరం..’’ అని సదరు పరిశోధన పేర్కొంది. 


మల-నోటి సంక్రమణం అంటే..?

ఇన్ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తిని నుంచి మరొకరికి  వ్యాధి సోకే మార్గాల్లో ఇది కూడా ఒకటి. అంటే మల, మూత్రాదుల ద్వారా కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల వ్యాధి విస్తరించడాన్ని మల- నోటి సంక్రమణం అంటారు. 


కాగా సార్స్-కోవ్-2 విషయానికి వస్తే.. మలంలో ఈ వైరస్ ఉంటుందని గుర్తించినప్పటికీ, మలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. యూకేలోని స్టెర్లింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ క్విల్లియమ్ గత నెలలో ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19 సోకిన వ్యక్తికి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా 33 రోజుల వరకు మలంలో వైరస్‌ ఉన్నట్టు తేలిందని ఆయన వెల్లడించారు. శ్వాస నాళం కంటే జీర్ణ వ్యవస్థ నుంచే వైరస్ ఎక్కువ రోజులు వెలువడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.


వైద్యులేమంటున్నారో చూడండి..


టాయిలెట్ ఫ్లషింగ్ వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందా?

కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో చాలామంది పేషెంట్లు పేగుల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు మలం ద్వారా వైరస్‌ను విసర్జిస్తున్నారు. కాబట్టి సిద్ధాంతపరంగా చూస్తే, కొవిడ్ రోగి టాయిలెట్ ఫ్లష్ చేయడం వల్ల అందులోని వైరస్ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 


కొవిడ్ సోకిన వ్యక్తి, కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్‌ ఉపయోగించడం వల్ల ప్రమాదం ఉందా?

కొవిడ్ రోగితో కలిసి కుటుంబ సభ్యులు టాయిలెట్ షేర్ చేసుకోవడం కచ్చితంగా ప్రమాదమే. ముంబైలో అయితే ప్రత్యేక టాయిలెట్ ఉంటేనే అధికారులు కొవిడ్ రోగులను హోం ఐసొలేషన్‌కు అనుమతిస్తున్నారు. ఒకే టాయిలెట్ వినియోగించడం వల్ల కుటుంబంలోని మిగతా వారికి వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ఇలాంటి నిబంధన పెట్టారు. 


మరి వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..

కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకే టాయిలెట్ వినియోగించడం మంచిది కాదు. ఒక వేళ తప్పదు అనుకుంటే.. ఆ టాయిలెట్‌కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరి. దీంతో పాటు ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్‌ను మూసివేయాలి. టాయిలెట్ సీట్‌పై వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించే ముందు తప్పకుండా శుభ్రంచేయాలి. అంతేకాదు.. కొవిడ్ రోగి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని క్లీన్ చేసేందుకు డిసిన్ఫెక్టెంట్‌లను ఉపయోగించాలి. 


టాయిలెట్లను ఇన్ఫెక్షన్ కేంద్రాలుగా పరిగణించాలని ఓ అధ్యనం చెబుతోంది.. ఇది నిజమేనా?

అవును, ఈ అధ్యయనం నిజమే. వైరస్ వ్యాప్తిచెందే విధానాన్ని అర్థం చేసుకునేందుకు  ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 


టాయిలెట్ల ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించడం ఎలా?

ఫ్లష్ చేసేముందు టాయిలెట్ సీట్లు మూసివేయాలని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. టాయిలెట్‌ను వినియోగించే ముందు సీట్లను శుభ్రం చేయాలి. ఫ్లషింగ్‌కు ముందు ఆటోమేటిగ్గా మూత మూసుకునే విధంగా టాయిలెట్లను రూపొందించాలనీ.. ఫ్లషింగ్‌కు ముందు, తర్వాత శుభ్రమయ్యే విధంగా చూడాలని తయారీదారులను పరిశోధకులు కోరారు. ఫ్లషింగ్ టాయిలెట్లకు ప్రత్యామ్నాయంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం నీటి వాడకం అవసరం లేని టాయిలెట్లను రూపొందించాలని కూడా వారు అభ్యర్థించారు. 

Updated Date - 2021-05-05T21:32:13+05:30 IST