Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోరా?

కలెక్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల సూటి ప్రశ్న

మా పని మాత్రమే చేస్తామని ప్రవీణ్‌కుమార్‌ సమాధానం 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం ఇస్తారా? లేదా?  అని టీడీపీ నేతలు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సూటిగా ప్రశ్నించారు. స్పందించిన కలెక్టర్‌ మాపని మేం చేస్తామంటూ సమాధానాన్ని దాట వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావంలో జిల్లాలో ఇటీవల వారం రోజులు భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ ఇప్పుడు ముసురుపట్టింది.  దీంతో ఆయా ప్రాంతాల్లో సాగులో ఉన్న పంటలన్నీ దెబ్బతిన్నాయి. ప్రధానంగా మిర్చి, మినుము, పత్తి, పొగాకుకు అపార నష్టం వాటిల్లింది. టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు పంట నష్టాలను స్వయంగా పరిశీలించారు. అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, గిద్దలూరు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎం.అశోక్‌రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిశారు. రైతుల వ్యథను ఆయనకు వివరిస్తూ ఈ పంట నష్టాలను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమన్నారు. తొలుత కలెక్టర్‌తోనూ, ఆతర్వాత మీడియాతోనూ మాట్లాడుతూ మిర్చి లాంటి ప్రధాన పంటలను కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.లక్ష, మిగిలిన పైర్లకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో జరిగిన నష్టాన్నే పరిగణనలోకి తీసుకుంటూ మన జిల్లా రైతులను విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంలో యంత్రాంగం పాత్ర ఏమిటి, మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. పంట నష్టాన్ని అధికారిక బృందాల ద్వారా గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారా.. ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకుని సరిపడా పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. సరైన నష్టపరిహారం ద్వారా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ జిల్లా యంత్రాంగం తరఫున తమ వంతుగా జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదక పంపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా అన్న విషయంపై మాత్రం సమాధానం చెప్పకుండా దాట వేశారు. అదే విషయాన్ని మీడియా సమావేశంలో టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.


Advertisement
Advertisement