Congress Crisis : కాంగ్రెస్‌కు త్వరలో మరో కీలక నేత గుడ్‌బై?

ABN , First Publish Date - 2022-05-20T00:05:42+05:30 IST

కాంగ్రెస్‌‌‌కు మరో ముఖ్యమైన నేత ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది

Congress Crisis : కాంగ్రెస్‌కు త్వరలో మరో కీలక నేత గుడ్‌బై?

చండీగఢ్ : కాంగ్రెస్‌‌‌కు మరో ముఖ్యమైన నేత ఝలక్ ఇవ్వబోతున్నారా? ఆ పార్టీ సీనియర్ నేత కుల్‌దీప్ బిష్ణోయ్ (Kuldeep Bishnoi) హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్‌‌ (Manohar Lal Khattar)తో సమావేశమవడంతో ఊహాగానాలకు తెర లేచింది. హర్యానా (Haryana) కాంగ్రెస్‌ కమిటీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడంతో పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు. 


బిష్ణోయ్, ఖత్తార్ బుధవారం సాయంత్రం గురుగ్రామ్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం బిష్ణోయ్ ఇచ్చిన ట్వీట్‌లో, రాజకీయ సమస్యలపై తాను ఖత్తార్‌తో చర్చించినట్లు తెలిపారు. తాను ప్రాతినిధ్యంవహిస్తున్న అదంపూర్ (Adampur) నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను చర్చించానని చెప్పారు. తన సమక్షంలోనే ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అదంపూర్ గ్రామ పంచాయతీ పునరుద్ధరణకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. 


కాంగ్రెస్ (Congress) గత నెలలో హర్యానా పీసీసీ అధ్యక్షునిగా ఉదయ భాన్‌ను నియమించింది. దీంతో బిష్ణోయ్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తనకు కూడా ఆగ్రహంగానే ఉందని, అయితే సహనం పాటించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. 


బిష్ణోయ్ జాట్‌యేతర కీలక నేత. ప్రజల మద్దతుగల యువ నేతలకు అవకాశం ఇచ్చి, పార్టీని పటిష్టం చేయాలని ఆయన గతంలో కాంగ్రెస్ పెద్దలను కోరారు. అయితే 2007లో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, సొంతంగా హర్యానా జనహిత్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీతో కొంత కాలం పొత్తు పెట్టుకున్నారు. కానీ 2014 శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో మళ్ళీ చేరారు.


ఇదిలావుండగా, కాంగ్రెస్‌కు ముఖ్యమైన నేతలు దూరమవుతుండటం కొనసాగుతోంది. తాజాగా గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ (Hardik Patel), పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ (Sunil Jakhar) ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సునీల్ జక్కర్ గురువారం బీజేపీలో చేరారు. 


Updated Date - 2022-05-20T00:05:42+05:30 IST