బెంగాల్ దిశా నిర్దేశం చేస్తుందా?

ABN , First Publish Date - 2021-03-03T06:17:38+05:30 IST

‘పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని గుజరాత్ మాదిరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం’ అని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు...

బెంగాల్ దిశా నిర్దేశం చేస్తుందా?

‘పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని గుజరాత్ మాదిరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం’ అని కొందరు భారతీయ జనతా పార్టీ నేతలు అలవోకగా అంటున్నారు కానీ తాము చిత్తశుద్ధితో ఆ మాట అనడం లేదని వారికే బాగా తెలుసు. మోదీ సర్కార్ నియమించిన 15వ ఆర్థిక సంఘం నివేదిక ఇలా ప్రచారం చేసే వారి వాదనలను పటాపంచలు చేసింది. దేశమంతా ఆత్మనిర్భర్ గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో తన స్వంత వనరులపై ఆధారపడే విషయంలో గుజరాత్, హర్యానా కంటే వెనుకబడి ఉన్నది! ‘ఆయుష్మాన్ భవ’ గొప్ప కార్యక్రమమే కావచ్చు కాని అనేక కీలక ఆరోగ్య సూచికల విషయంలో గుజరాత్, జాతీయ సగటు కంటే తక్కువ పనితీరు ప్రదర్శిస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో గుజరాత్ ఆరోగ్య రంగంపై ఖర్చుపెడుతున్న 0.7 శాతం దేశ సగటు కంటే తక్కువ. కొవిడ్ వాక్సిన్ తమ మూలంగానే లభించిందని గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో వివిధ జబ్బులకు లభించే టీకా కార్యక్రమం కూడా గుజరాత్‌లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో పేలవంగా జరుగుతోంది. ఈ విషయంలో 28 రాష్ట్రాల్లో అది 26వ స్థానంలో ఉన్నది. ప్రభుత్వం వ్యాపారం చేయడానికి వీలులేదని, నష్టాల బారిన పడ్డ ప్రభుత్వ రంగసంస్థల్ని ప్రైవేటీకరిస్తామని నేతలు చెబుతున్న నేపథ్యంలో గుజరాత్ లో రాష్ట్ర రవాణా సంస్థ 2011 నుంచి తీవ్ర నష్ట్రాల్లో ఉన్నది. 2014–-15 నాటికే దీని నష్టం 2,722 కోట్లు. అంతేకాదు, గుజరాత్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థల్లో 15 సంస్థలు వేల కోట్ల నష్టాల్ని చూపాయి. 10 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం 2019 నాటికి లక్షకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ప్రభుత్వం వ్యాపారం చేయనక్కర్లేదు అన్నది సిద్ధాంతమైతే వీటన్నిటినీ ఎందుకు అమ్మడం లేదు?


అనేక విద్యాసూచికల్లో కూడా గుజరాత్ వెనుకబడి ఉన్నదని కూడా ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ‘బేటీపడావో, బేటీ బచావో’ అద్భుతంగా విజయవంతం అవుతున్నదని ఊదరగొడుతున్న రీత్యా గుజరాత్ వైపు చూస్తే అన్ని స్థాయిల్లో బాలుర నమోదుతో పోలిస్తే బాలిక నమోదు శాతం జాతీయ సగటు కంటే ఎంతో తక్కువ. ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి, హైస్కూలు స్థాయిలో స్కూలు మానేసే పిల్లల సగటు గుజరాత్‌లోనే ఎక్కువ. హైస్కూలు స్థాయిలోనే 24.1 శాతం పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. దేశానికి నూతన విద్యావిధానాన్ని ప్రసాదించామని చెప్పుకునే మహా నేత స్వంత రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఇక్కడ స్థూల దేశీయోత్పత్తిలో విద్యారంగంపై కేవలం 1.7 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు.


స్థానిక సంస్థల వికేంద్రీకరణ విషయంలో ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందా? లేదు. రాజ్యాంగం నిర్దేశించిన 29 విధుల్లో 10 విధుల్ని గుజరాత్‌లో ఇంకా స్థానిక సంస్థలకు అప్పజెప్పలేదు. 2015లో గుజరాత్ ప్రభుత్వం నియమించిన ఆఖరి రాష్ట్ర ఆర్థిక సంఘం తన నియామకం తర్వాత నాలుగేళ్లకు నివేదిక సమర్పించింది. దాని కార్యాచరణ నివేదికను ఇంతవరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి, ఎలెక్ట్రిక్ వాహనాల గురించి జాతీయ స్థాయిలో మాట్లాడతారు కాని గుజరాత్‌లో అహ్మదాబాద్‌తో సహా నాలుగు ప్రధాన నగరాలు అత్యంత కాలుష్య భరితంగా ఉన్నాయని కూడా ఫైనాన్స్ కమిషన్ తేల్చింది.


మరి పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వస్తే బెంగాల్ ను గుజరాత్ చేస్తామన్న బీజేపీ వాదనలో ఏమైనా పస ఉన్నదా? ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం కట్టుకుని ప్రధాని పేరు పెట్టుకున్నామని మాత్రమే చెబితే సరిపోతుందా? పశ్చిమ బెంగాల్‌లో కూడా గుజరాత్‌లో లోగా పలు అంశాల్లో వెనుకబడి ఉండవచ్చు కాని ఏ అభివృద్ధి చెందిన రాష్ట్రానికీ తీసి పోకుండా అక్కడ 76.3 శాతం అక్షరాస్యతా రేటు ఉన్నది. 94.6 శాతం మందికి సురక్షితమైన త్రాగు నీరు లభిస్తోంది. 74.9 శాతమందికి శౌచాలయాలు ఉన్నాయి. గుజరాత్ కంటే మెరుగ్గా ఆరోగ్యంపై 5.4 శాతం ఖర్చుపెడుతోంది. రాజ్యాంగం నిర్దేశించిన 29 విధుల్లో 28 విధులను అక్కడ పంచాయతీ రాజ్ సంస్థలకు పంపిణీ చేసిన రీత్యా గుజరాత్ కంటే బాగా వికేంద్రీకరణ జరిగిందని అర్థమవుతుంది. జాతీయ ప్రజా విత్త విధాన సంస్థ (ఎన్‌ఐపిఎఫ్‌పి) విశ్లేషణ ప్రకారం 2016–-17లో రాష్ట్ర స్వంత పన్ను వనరులనుంచి రూ, 900 కోట్లు పంపిణీ అయ్యాయి. వ్యాపారం సులభతరం చేసిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 9వ స్థానంలో ఉన్నది. పన్ను రిటర్నులను సరళం చేసేందుకు ఈ రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ ఎంతో మెరుగ్గా అమలు చేస్తున్నారు. మొత్తం దేశంలోనే జీఎస్టీ క్రింద అత్యధిక రిజిస్ట్రేష్టన్లు జరిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఆరోగ్యం, ప్రజాసంక్షేమం, స్వచ్ఛ మైన నీరు, పారిశుద్ధ్యం, చక్కటి పనితీరు, ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కారం, మౌలిక సదుపాయాలు, అసమానతల తగ్గింపు, శాంతి, న్యాయం, బలమైన సంస్థలు మొదలైన ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సహస్రాబ్ది లక్ష్యాల విషయంలో పశ్చిమ బెంగాల్ ఏ విధంగానూ వెనుకబడి పోలేదు. ఈ వివరాలన్నీ 15వ ఆర్థికసంఘం గత నెల క్రితం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఉన్నవే.


ఎవరూ పెద్దగా లెక్కలోకి పోరని అప్పుడప్పుడూ గుజరాత్ గొప్పతనం గురించి చెబుతుంటారు కాని ఎన్నికల్లో ప్రధానంగా నిజంగా పూర్తిగా అభివృద్ధి గురించి మాట్లాడడానికి బిజెపి నేతలు పెద్దగా ఇష్టపడరు. వాజపేయి హయాంలో ఇలాగే అభివృద్ధి గురించి మాట్లాడాలని ‘ఇండియా షైనింగ్ (భారతదేశం వెలిగిపోతోంది)’ అని లేజర్ షోలతో ప్రచారం నిర్వహించారు. కాని వాజనేయి స్వంత నియోజకవర్గంలోనే రూ. 45 విలువైన నాసిరకం చీరలకోసం మహిళలు తొక్కిసలాటకు గురై మరణించినప్పుడు ఆ ప్రచారం లోని బూటకత్వం జనానికి అర్థమైపోయింది. బహుశా ఈ విషయం పైకి తెలిసినందువల్లే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ స్థాయిలో తాను అభివృద్ది కాముకుడిని చెప్పుకున్నప్పటికీ రాష్ట్రాల స్థాయిలో ఓట్లను చీల్చేందుకు తమనేతలు విచ్చల విడిగా, విశృంఖలంగా మాట్లాడతున్నా పెద్దగా పట్టించుకోరు. ఓట్లను విభజించే రాజకీయాలు ఆయన కంటే దేశంలో ఎక్కువగా తెలిసిన వారు లేరు కనుక రాష్ట్రాల్లో తన శిష్యగణం వాడే అరాచక పదజాలం గురించి తెలుసుకుని ఆయన లోలోపల సంతోషిస్తూనే ఉండవచ్చు.


అసలు ఒక రాష్ట్రంలోకి విస్తరించడానికి బిజెపి అనుసరిస్తున్న విధానాలేమిటి? అవతలి పార్టీ నుంచి కీలకమైన నేతలెవరో తెలుసుకుని వారిని నయానా, భయానా తమ పార్టీలో చేర్చుకోవడం. ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని రాజీనామా చేయించి ప్రభుత్వాలను పడగొట్టడం. ప్రత్యర్థులను ఆర్థికంగా బలహీనం చేయడానికి కేంద్రసంస్థలను ఉపయోగించుకోవడం.ఆయా రాష్ట్రాల్లో స్థానికపరిస్థితులకు అనుగుణంగా ఏవిధమైన మత పరమైన భాష వాడాలో నిర్ణయించడం. మత పరంగా ఓట్లను చీల్చేందుకు వ్యూహాల్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడం ఇవన్నీ బిజెపి అమ్ముల పొదిలో పైకి కనపడే అస్త్రాలు మాత్రమే.


పశ్చిమ బెంగాల్‌లో గత ఆరు సంవత్సరాలుగా బిజెపి ఇవే అస్త్రాలను ప్రయోగిస్తూ తమఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ పెరిగిన ఓట్ల శాతం పూర్తిగా కేంద్రంలో నరేంద్రమోదీ పట్ల ఆకర్షణతో వచ్చినవి అనుకుంటే, లేదా మోదీ అభివృద్ధి నమూనా చూసి లభించాయని అనుకుంటే పొరపాటు మాత్రమే. ఓటర్లను ప్రలోభపెట్ట గల కళ కు లభించిన మార్కులవి. అందుకే సీనియర్ బిజెపి నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంతాకుమార్ బిజెపిలో ఈ పరిణామాల్ని చూసి తన ఆత్మకథలో ఏవగించుకున్నారు. ‘నీతీ నిజాయితీలేని మోసపూరిత రాజకీయాలతో ప్రభుత్వాలను మార్చవచ్చు కాని సమాజాన్ని కాదు. స్వామి వివేకానందను పూజిస్తే చాలదు, ఆయన మార్గాన్ని అనుసరించాలి’ అని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసుకోవడం, అల్లర్లు సృష్టించడం మొదలైన అకృత్యాలను బిజెపి అవలంబించడం చూసి సిగ్గుపడుతున్నానని ఆయన చెప్పారు.


పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి ఆధారంగా కన్నా, మత పరంగా ఓట్లను విభజించేందుకే బిజెపి శాయశక్తులా ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. బెంగాల్‌ను పాకిస్థాన్‌తో తరచు పోల్చడం, లవ్ జిహాద్, ఆవు మాంసం గురించి మాట్లాడటం మొదలైనవి అందులో భాగమే. మార్క్సిస్టులు మూడు దశాబ్దాలు ఏలిన ఈ నేలలో హిందూ ఓట్లు సంఘటితం అయితేనే బిజెపి విజయం సాధించగలదు. అయితే భారతీయులకు సాంస్కృతిక పునరుజ్జీవనం నేర్పి,సామాజిక దురాచారాలపై పోరాడడం తెలిపిన పశ్చిమ బెంగాల్ ఈ సాంస్కృతిక దాడి నుంచి తట్టుకుంటేనే దేశానికి ఒక దిశా నిర్దేశం ఏర్పడుతుంది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-03-03T06:17:38+05:30 IST