ఉచిత బోరుబావి మేలు చేసేనా?

ABN , First Publish Date - 2020-09-09T06:48:47+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ఇటీవల చిన్న, సన్నకారు రైతులకు ఉచిత బోర్‌వెల్స్‌ పథకాన్ని ప్రకటించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి డ్రిల్లింగ్ కాంట్రాక్టర్లను...

ఉచిత బోరుబావి మేలు చేసేనా?

ఉచిత రుణాల మాదిరిగా, ఉచిత బోర్ వెల్స్ పథకం గ్రామీణ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించదు. లక్షల సంఖ్యలో బోరుబావులు మొదలైతే వాటికయ్యే విద్యుత్తు ఖర్చు రాష్ట్ర ఖజానాపై భారీ భారమవుతుంది. అంతేకాక భూగర్భజల మట్టాలపై ఒత్తిడి పెరుగుతుంది. తరువాతి ప్రభుత్వం మీద, తరువాతి తరం మీద ఈ సమస్యను తోసేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు.


రాష్ట్రప్రభుత్వం ఇటీవల చిన్న, సన్నకారు రైతులకు ఉచిత బోర్‌వెల్స్‌ పథకాన్ని ప్రకటించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి డ్రిల్లింగ్ కాంట్రాక్టర్లను నియమిస్తారు. భూగర్భ పరిస్థితులను అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాల బేరీజు తరువాత కలెక్టర్ నిధుల మంజూరు ద్వారా బోర్‌వెల్స్‌ను నిర్మిస్తారు. వీటి వల్ల ఎంత మంది రైతులు ప్రయోజనం పొందుతారు? 2015–16 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.98 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో 1.15 కోట్ల ఎకరాల భూములు సన్నకారు, చిన్నకారు రైతులకు చెందినవి. 88 శాతానికి పైగా రాష్ట్ర రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అతి వినియోగం వలన 1094 గ్రామాల్లో భూగర్భజలాల డ్రిల్లింగ్‌ను ప్రభుత్వం నిషేధించడంతో ఆ గ్రామాలకు ఉచిత బోర్ వెల్స్ పథకం వర్తించదు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతవరకు అమలు చేయగలదో 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ నీటిపారుదల పనులపై చేసిన ఖర్చు ద్వారా తెలుస్తుంది. 2019–20 బడ్జెట్ లో ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల పనులు, వ్యవసాయం కోసం రూ.30,300 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.10,350 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు!

ఉచిత బోర్ వెల్స్ పథకాన్ని పాలక పార్టీ తన నవరత్నాల వాగ్దానాల అమలులో భాగంగా ఆవిష్కరించింది. అయితే దశాబ్దాలుగా ఇలా బోర్‌వెల్్స్ ఉచితంగా లేదా సబ్సిడీల ద్వారా ఇవ్వడం జరుగుతోంది. పంటలపై భూగర్భజల మట్టాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయమూ విదితమే. ఇందిరా జల ప్రభ, ఎన్‌టిఆర్ జల సిరి వంటి బోర్‌వెల్ సబ్సిడీ పథకాల వల్ల భూగర్భజలాలు క్షీణించాయి. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా క్షీణిస్తూ వచ్చాయి. 2016 జూలై –- 2020 జూలై మధ్య కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టం 18% క్షీణతను చూపిస్తుంది. కరువు పీడిత రాయలసీమలో అత్యధికంగా 30% క్షీణత నమోదవగా అధిక పేదరికం ఉన్న ఉత్తరాంధ్రలో 17% క్షీణత కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం బోరుబావులలో 20% కన్నా తక్కువ చిన్న, సన్నకారు రైతులు తవ్వారు. ఈ కొత్త పథకంతో కొన్ని లక్షల బోరు బావులు వారికి సమకూరనున్నాయి. ఇప్పటి వరకు బోర్‌వెల్స్‌ను పెద్ద, మధ్యస్థ రైతులు మాత్రమే తవ్వి, అవి పనిచేయక ఎంతో సంక్షోభంలో పడ్డారు. ఇప్పుడు ఈ ఉచిత బోర్ వెల్స్ పథకంతో భూగర్భజల సంక్షోభం తీవ్రమవనున్నది.  

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా వందల అడుగుల కొద్దీ బోరుబావులు తవ్వడం, నీరు దొరకక వేలాది కుటుంబాలు దివాళా తీసి అప్పుల్లో కూరుకుపోవడం విదితమే. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2017 నాటికి రాష్ట్రంలో 42% పంటలు భూగర్భజల వనరులపై ఆధారపడి ఉన్నాయి. భూగర్భ జలాల వినియోగం అతిగా చేసి డ్రిల్లింగ్ పై నిషేధం విధించబడిన గ్రామాల జాబితా చూస్తే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలు భూగర్భజల వనరులపై భారీగా ఆధారపడ్డాయని తెలుస్తుంది. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ తో పాటు ప్రస్తుత ఉచిత బోర్‌వెల్ వంటి వనరులను అందించడం రైతుల నిర్ణయాలను ఊహిం చని విధంగా మారుస్తుంది. స్థానిక స్థితిగతులు, పర్యావరణానికి అనుగుణంగా పండే మెట్ట పంటలు మాని అధిక నీరు కావాల్సిన పంటలు పండిస్తారు.

ఉచిత బోర్‌వెల్ విఫలమైనా, లేక ఓ మోస్తరుగా పని చేసినా మన రైతన్న మరొక బోర్‌వెల్ వేద్దామని ప్రయత్నించొచ్చు. అసలు బోరుబావులు వద్దనుకునే రైతులు ఇప్పుడు ఉచిత బోరుబావులు రావడంతో నీళ్ల కోసం ఇంకా ఇంకా తవ్వడానికి వెనుకాడరు. ఇలా తన పొలంలో 1-2 బోరుబావులు కొత్తగా నిర్మించబడితే వీటి ఆధారంగా అక్కడ భూమికి అనుగుణమైన పంటలను కాదని, మద్దతు ధర ఎక్కువ వచ్చే, నీటిని ఎక్కువగా వినియోగించుకునే పంటలను వేసే అవకాశం ఎంతైనా ఉంది. 
భూగర్భ జలాలు అధికంగా లభ్యమై పంటల దిగుబడులు అధికంగా ఉన్నా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అధిక సరఫరాతో మార్కెట్ లో ధరలు కుప్పకూలుతాయి. మద్దతు ధరల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం ఇంకా ఎక్కువ కొనవలసి ఉంటుంది. ఈ కనీస ధరలను కూడా పొందని వేలాది రైతులు తమ ఉత్పత్తిని చౌక ధరలకు అమ్మే పరిస్థితి వస్తుంది. మొత్తంమీద, ప్రభుత్వం సమాజంలో ఏ వనరునైనా ఎవరికైనా ఉచితంగా ఇస్తే అది కొత్త అసమానతలకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితులే బోరుబావులు, పురుగుమందుల కోసం రైతులు అధిక వ్యయం చేసేందుకు కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో 77% ఇప్పటికే అప్పుల్లో ఉన్నాయి. జాతీయంగా, ఈ అప్పుల పట్టికలో తెలంగాణ (79%) తర్వాత మనం రెండవ స్థానంలో ఉన్నాం.

రైతులలో స్థానిక పరిస్థితుల సంకెళ్ళ నుండి తమను తాము విడిపించుకోవాలనే ఆకాంక్ష బోరు బావులను తవ్వేలా చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో వర్షాధార జిల్లాల్లో సాగు పంటలను పండించే ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఒక రైతన్న పంట కలలను సాకారం చేసే స్వేచ్ఛను ఇవ్వడానికి నిజంగా ప్రభుత్వం ఏం చెయ్యగలదు? రైతులు వర్షాలు లేదా భూగర్భజలాల మీద ఆధారపడనవసరం లేకుండా ఆనకట్టలు, కాలువలు, నీటిపారుదల వ్యవస్థలపై అధికారులు దృష్టి పెట్టాలి. క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కరువుతో బాధపడుతున్న జిల్లాల్లో నీటి సమస్యను పరిష్కరించడానికి రెండు విధానాలు చేపట్టారు. ఒకటి- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, డ్వామా కలయిక ద్వారా చెరువులు తవ్వడం, వర్షపు నీటి నిల్వ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భూగర్భజల మట్టం పెంచడానికి 2016 నుంచి 2019 వరకు లక్షకు పైగా చెరువులు తవ్వి అనంతపురం జిల్లా భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన వ్యవసాయ చెరువులు, చెక్ డ్యాములు, పెర్కోలేషన్ ట్యాంకులలో 70% పైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి. రెండవ విధానం- 2017లో అంతర్జాతీయ సంస్థలు, జాతీయ బ్యాంకుల నుంచి 1103 కోట్ల రూపాయలతో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న ఏపీ కరువు నివారణ ప్రాజెక్ట్ (APDMP). జిల్లాలో కరువు పరిస్థితులు తగ్గించడం, భూగర్భ జలాలను నిర్వహించే విధానాలను పెంపొందించడం, జీవనోపాధిని వైవిధ్యపరచడం వంటి లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అమలు అవుతోంది. తక్కువ నీటితో వైవిధ్యభరితమైన, లాభదాయకమైన పంట వ్యవస్థలను పెంపొందించి రైతులకు సహాయం చేయడం దీని లక్ష్యం. 2019లో ఈ కార్యక్రమం మీద సమీక్ష జరిగింది. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ఒక మోస్తరుగా పని చేసిందని వివరించింది. ప్రధాన లక్ష్యాలను అమలు చేయడంలో సంతృప్తికరంగా లేదని కూడా పేర్కొంది.

ఇలాంటి విధానాల ద్వారా ఏ లాభాలు వచ్చినా, రాష్ట్రంలోని మరో ఉచిత బోరుబావి పథకం ద్వారా ఇవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. బోర్‌వెల్స్‌ను తవ్వడంలో పెద్ద రైతులు ఎదుర్కొన్న విషాదాలను ఇప్పుడు మళ్ళీ చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వ్యవసాయరంగంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం మాని ఇలాంటి పథకాలు చేపట్టడం ప్రభుత్వ వైఫల్యంగా గుర్తించాలి. ఉచిత విద్యుత్తు సరఫరాకి రాష్ట్ర ప్రభుత్వం, డిస్కోమ్‌లు ఇప్పటికే ప్రతి సంవత్సరం 7000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో బోరుబావులకు నాంది పలికి, వాటికయ్యే విద్యుత్తు ఖర్చు రాష్ట్ర ఖజానాపై భారీ భారమవుతుంది. అంతేకాక భూగర్భజల మట్టాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఉచిత రుణాల మాదిరిగా, ఉచిత బోర్ వెల్స్ పథకం గ్రామీణ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించదు. తరువాతి ప్రభుత్వం మీద, తరువాతి తరం మీద ఈ సమస్యను తోసేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు.

వల్లూరి వంశీ విరాజ్

Updated Date - 2020-09-09T06:48:47+05:30 IST