ఐపీఓకు కిమ్స్‌, దొడ్ల డెయిరీ

ABN , First Publish Date - 2021-06-12T06:11:20+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు సందడి చేయనున్నాయి. హైదరాబాద్‌

ఐపీఓకు కిమ్స్‌, దొడ్ల డెయిరీ

వచ్చే వారం ప్రైమరీ మార్కెట్లో తెలుగు కంపెనీల సందడి

మొత్తం రూ.2,664 కోట్ల సమీకరణ లక్ష్యం 

దొడ్ల డెయిరీ ఇష్యూ ధర రూ.421-428


తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలు సందడి చేయనున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కిమ్స్‌ హాస్పిటల్స్‌, దొడ్ల డెయిరీ.. ఒకే రోజున ఐపీఓకు వస్తున్నాయి. రెండు పబ్లిక్‌ ఇష్యూలు ఈ నెల 16న ప్రారంభమై 18న ముగియనున్నాయి. కిమ్స్‌ హాస్పిటల్స్‌ రూ.2,144 కోట్లు సమీకరించనుండగా దొడ్ల డెయిరీ రూ.520 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 


దొడ్ల డెయిరీ రూ.520 కోట్ల సమీకరణకు పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమై 18న ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.421-428గా నిర్ణయించారు. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత 35 గుణిజాల్లో బిడ్లు దాఖలు చేయాలి. ఇష్యూలో తాజా షేర్లను జారీ చేయ డం ద్వారా రూ.50 కోట్ల వరకూ సమీకరిస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 1,09,85,444 షేర్లను ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇందులో 92 లక్షల షేర్లను టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌ పీటీఈ విక్రయిస్తుంది. మిగిలిన షేర్లను దొడ్ల సునీల్‌ రెడ్డి, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్‌, దొడ్ల దీపా రెడ్డి విక్రయిస్తారు. ఇష్యూలో 35 శాతం షేర్లను రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 50 శాతం వరకూ షేర్లను అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు, మిగిలిన 15 శాతం షేర్లను నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ప్రైవేటు రంగంలో దక్షిణాదిలోనే పాల సేకరణపరంగా దొడ్ల డెయిరీ మూడో అతిపెద్ద కంపెనీ అని సంస్థ ఎండీ సునీల్‌ రెడ్డి తెలిపారు.




రోజుకు 10.3 లక్షల లీటర్ల పాలను కంపెనీ సేకరిస్తోంది. 17 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేస్తోంది. 11 రాష్ట్రాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సునీల్‌ రెడ్డి అన్నారు. కంపెనీకి 13 ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. 2020-21లో కంపెనీ ఆదాయం రూ.2,138 కోట్లు ఉన్నట్లు చెప్పారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, రిటైల్‌ పార్లర్ల విస్తరణ ద్వారా కార్యకలాపాలను దొడ్ల డెయిరీ విస్తరించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాలు తీర్చడానికి, మూలధన వ్యయాల కోసం వినియోగించనుంది.  




కిమ్స్‌ ఇష్యూ ధర రూ.815-825


హైదరాబాద్‌కు చెందిన కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమై 18న ముగుస్తుంది.  రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.815-825గా నిర్ణయించినట్లు కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బొల్లినేని భాస్కర్‌ రావు తెలిపారు. కనీసం 18 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత 18 గుణాకాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్‌ ఇష్యూలో తాజా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా కంపెనీ ప్రమోటర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయిస్తారు.


తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.200 కోట్ల వరకూ సమీకరించనున్నారు. ఓఎ్‌ఫఎ్‌సలో 2,35,60,538 షేర్ల వరకూ విక్రయిస్తారు. ధర శ్రేణిలో గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ షేర్ల విక్రయం ద్వారా రూ.1,943.7 కోట్లు లభిస్తాయి. అంటే పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.2,144 కోట్లు సమీకరించినట్లవుతుంది. ఓఎ్‌ఫఎస్‌లో భాగంగా జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ కేహెచ్‌ పీటీఈ, ప్రమోటర్లు భాస్కర్‌ రావు, రాజ్యశ్రీ బొల్లినేని, బొల్లినేని రామయ్య మెమోరియల్‌ హాస్పిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇతరులు వాటాలను విక్రయిస్తారు. కంపెనీ ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తామని భాస్కర్‌ రావు తెలిపారు. ఉ


ద్యోగులకు కేటాయించిన వాటాలో దరఖాస్తు చేసుకునే అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.40 తగ్గింపు ఇస్తారు. ఉద్యోగులకు కేటాయించగా మిగిలిన షేర్లను నెట్‌ ఆఫర్‌గా పరిగణిస్తారు. నెట్‌ ఆఫర్‌లో 75 శాతం తక్కువ కాకుండా షేర్లను అర్హులైన సంస్థాగత మదుపర్లకు కేటాయిస్తారు. ఇష్యూలో 10 శాతాన్ని రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇస్తారు. గత ఆర్థిక సంవత్సరానికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ లాభం రూ.205 కోట్లు. అంతక్రితం ఏడాది రూ.115 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 




మరో 1500 పడకలు..

పబ్లిక్‌ ఇష్యూలో తాజా షేర్లను జారీ చేయడం ద్వారా లభించిన నిధులను కంపెనీ, అనుబంధ కంపెనీల రుణాలు తీర్చడానికి, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో మొత్తం 9 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కంపెనీ నిర్వహిస్తోంది. వీటి  సామర్థ్యం 3,064 పడకలు.


తెలుగు రాష్ట్రాల్లో పడకలను పెంచుకోవడంతో పాటు  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆసుపత్రి కోసం చెన్నైలో స్థలాన్ని సొంతం చేసుకున్నామని, బెంగళూరులో స్థలాన్ని గుర్తించామని భాస్కర్‌ రావు చెప్పారు. ఆసుపత్రులను కొనుగోలు చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 1,000  పడకలను సమకూర్చుకోవాలని కిమ్స్‌ భావిస్తోంది. దాదాపు నాలుగేళ్లలో పొరుగు రాష్ట్రాల్లో 500 పడకల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది. 


Updated Date - 2021-06-12T06:11:20+05:30 IST