రోగమొస్తే అంతే!

ABN , First Publish Date - 2020-04-09T10:17:00+05:30 IST

కరోనా కారణంగా తాండూరులోని ప్రైవేటు నర్సింగ్‌ హోంలు, క్లీనిక్‌లు గత 18 రోజులుగా మూతబడ్డాయి. ప్రభుత్వ

రోగమొస్తే అంతే!

ప్రైవేటు ఆస్పత్రులు, క్లీనిక్‌ల్లో నిలిచిన సేవలు

సామాజిక బాధ్యతనూ గుర్తించని వైద్యులు

శస్త్రచికిత్సల వారికీ తప్పని అవస్థలు


తాండూరు : కరోనా కారణంగా తాండూరులోని ప్రైవేటు నర్సింగ్‌ హోంలు, క్లీనిక్‌లు గత 18 రోజులుగా మూతబడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో మొన్నటి వరకు ఓపీ సేవలనూ నిలిపివేశారు. పట్టణంలో నాడిపట్టే వైద్యుడు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలనూ పట్టించుకోవడం లేదు. వైద్యులు సామాజిక బాధ్యతను కూడా గుర్తించడం లేదు. మెడికల్‌ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నా రోజు విడిచి రోజు అరకొరగా మందులు సరఫరా అవుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బందికి, పట్టణంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికీ మాస్కులు ఇచ్చే పరిస్థితీ లేదు. మెడికల్‌ షాపులే రోగుల పాలిట ఆస్పత్రులుగా మారాయి. తాత్కాలిక ఉపశమనానికి రోగులు మెడికల్‌ నుంచి మందులు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఈ విషయమై కలెక్టర్‌, వైద్యాధికారులు స్పందించి వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


ఎమర్జెన్సీ కేసులను చూడొచ్చు : కలెక్టర్‌

సామాన్య రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి మీడియా తీసుకెళ్లగా ఈ విషయమై కలెక్టర్‌ పౌసుమి బసుతో చర్చించారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడు తూ ఎమర్జెన్సీ కేసులను ప్రైవేటు వైద్యులు చూడొచ్చని చెప్పారు. అత్యవసరమైతే ఆర్డీవో దృష్టికి తీసుకురావాలని అన్నారు. జనరల్‌ వైద్యం వల్ల ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లీనిక్‌ల వద్ద ప్రజలు గుమిగూడతారనే ఉద్దేశంతో వైద్య సేవలు నిరాకరించామని పేర్కొన్నారు. 


మద్యం అమ్మితే వాట్సాప్‌ చేయండి 

తాండూరు : అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వలు ఉన్నా నేరుగా వాట్సాప్‌ ద్వా రా సమాచారం అందించాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. ఈ విషయమై పలువురు మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-04-09T10:17:00+05:30 IST