పల్లెలపై ఆసక్తి చూపని డాక్టర్లు

ABN , First Publish Date - 2021-10-28T05:49:36+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో నూతనంగా అందుబాటులోకి తేనున్న పల్లె దవాకానాలో పనిచేయడానికి ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన అభ్యర్థుల భర్తీ కోసం వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పల్లెలపై ఆసక్తి చూపని డాక్టర్లు
కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు

నల్లగొండ అర్బన్‌, అక్టోబరు 27 : వైద్య ఆరోగ్య శాఖలో నూతనంగా అందుబాటులోకి తేనున్న పల్లె దవాకానాలో పనిచేయడానికి ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన అభ్యర్థుల భర్తీ కోసం వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 106 పోస్టులకు గానూ 33 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, డీసీహెచ్‌ఎ్‌స మాతృనాయక్‌ ఇతర అధికారుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 21 మంది కౌన్సిలింగ్‌కు హాజరుకాగా 16 మంది మాత్రమే విధుల్లో జాయిన్‌ కావడానికి ఆసక్తి చూపారు. మిగతా వారు జాయిన్‌ కాకుండానే వెళ్లిపోయారు. నేషనల్‌ హెల్త్‌ స్కీమ్‌ కింద కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ డాక్టర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. పల్లె దవాకానాల పేరుతో జిల్లాలో సబ్‌ సెంటర్లను ఆధునికీకరణ చేపట్టింది ప్రభుత్వం. జిల్లాలో మొదటి విడతగా 106 సబ్‌ సెంటర్లను పల్లె దవకానాలుగా తీర్చిదిద్దుతుంది. ఇందులో పనిచేయడానికి డాక్టర్ల నియామకం చేపట్టారు. ఈ పోస్టులో పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు జీతం రూ.40వేలు మాత్రమే ఉండటం, మారుమూల ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉండటం లాంటి కారణాల వల్లే డాక్టర్లు ఆసక్తి చూపడం లేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

వైద్య ఆరోగ్యశాఖ మెరిట్‌ లిస్ట్‌ విడుదల 

  వైద్య ఆరోగ్య శాఖలో ఎంపీహెచ్‌ఏ ఫీమెయిల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ బుధవారం విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ ఎ. కొండల్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్‌ జాబితాను వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డుపై, వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. మెరిట్‌ లిస్ట్‌పై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈనెల 28వ తేదీ నుంచి నవంబరు 7వ తేదీలోగా లిఖిత పూర్వకంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. 

Updated Date - 2021-10-28T05:49:36+05:30 IST