కరోనా నివారణకు ఆవు పేడ వాడొద్దు...వైద్యుల హెచ్చరిక

ABN , First Publish Date - 2021-05-11T16:29:40+05:30 IST

ఆవుపేడ థెరపీ చేసే వారికి వైద్యులు తాజాగా హెచ్చరిక చేశారు....

కరోనా నివారణకు ఆవు పేడ వాడొద్దు...వైద్యుల హెచ్చరిక

అహ్మదాబాద్ (గుజరాత్): ఆవుపేడ థెరపీ చేసే వారికి వైద్యులు తాజాగా హెచ్చరిక చేశారు. ఆవుపేడతో కరోనాను నివారించవచ్చని కొందరు నమ్ముతూ దాంతో థెరపీ చేస్తున్నారని, ఆవుపేడ ప్రభావానికి శాస్త్రీయ ఆధారాలు లేవని,  దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో కొంతమంది ఆవుపేడ, మూత్రంతో థెరపీ చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కరోనా రాదని, వచ్చినా త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతున్నారు. ప్రజలు తమ శరీరంపై ఆవు పేడ పూసుకుంటారు. ఈ ఆవుపేడ  చికిత్స వల్ల కరోనా రాకుండా వారి రోగనిరోధకశక్తి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. 


దీంతో ఈ ఆవుపేడ చికిత్స కోసం జనం వస్తున్నారని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అసోసియెట్ మేనేజరు గౌతమ్ మనీలాల్ బోరిసా చెప్పారు.తాను కరోనా నుంచి కోలుకునేందుకు ఆవుపేడ చికిత్స సహాయపడిందని గౌతమ్ పేర్కొన్నారు. ఆవుపేడను మూత్రమిశ్రమంతో కలిపి ఒంటికి పూసుకొని అది ఎండిపోయే వరకు ఆశ్రమంలో వేచి ఉంటారు. అనంతరం ఆశ్రమంలో ఆవును కౌగిలించుకుంటారు. అనంతరం పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని కడుగుకుంటారు. కాగా ఆవుపేడ చికిత్సల వల్ల ఆరోగ్య సమస్యలు క్లిష్టతరం అవుతాయని వైద్యులు హెచ్చరించారు.


‘‘కొవిడ్ -19 కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆవు పేడ లేదా మూత్రం పనిచేస్తుందనే దానిపై ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, ఇది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంది’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ అన్నారు.ఆవుపేడ చికిత్స వల్ల జంతువుల నుంచి మనుషులకు ఇతర వ్యాధులు వ్యాపిస్తాయని వైద్యులు హెచ్చరించారు. కరోనా వైరస్ దేశంలో 22.66 మిలియన్ల మందికి సోకిందని, 2,46,116 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతుండగా, వాస్తవ సంఖ్య ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

Updated Date - 2021-05-11T16:29:40+05:30 IST