వైద్యులు కావలెను

ABN , First Publish Date - 2022-04-22T05:00:14+05:30 IST

జిల్లాలో గ్రామీణ స్థాయి పేద ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల పరిస్థితి గందరగోళంగా మారింది.

వైద్యులు కావలెను
సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి పల్లె దవాఖానా ఇదే

జిల్లాలో పల్లె దవాఖానాలకు స్పందన కరువు 

విధుల్లో చేరేందుకు ముందుకు రాని యంబీబీఎస్‌ వైద్యులు 

డిగ్రీ జీఓతో నియామకాలకు ఆటంకాలు 

గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని వైద్యసేవలు 

నిర్మల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామీణ స్థాయి పేద ప్రజలకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కొనసాగిస్తూనే సబ్‌సెంటర్‌లను పల్లె దవాఖానాలుగా మార్పు చేశారు. అయితే జిల్లాలో మొత్తం 52 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీని కోసం వైద్యుల నియామకంతో పాటు సిబ్బంది నియామకాల కోసం కూడా అధికారులు కసరత్తు చేపట్టారు. మొదట పల్లె దవాఖానాల్లో డాక్టర్‌లు పోస్టు కోసం యంబీబీఎస్‌ చదివిన వారితో పాటు ఆయూష్‌ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్‌హోం కోర్సు పూర్తి చేసిన వారిని అర్హులుగా ప్రకటించా రు. దీంతో 18 పల్లె దవాఖానాల్లో నియామకాలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ప్రభుత్వం పల్లె దవాఖానాల్లో డాక్టర్‌ పోస్టులకు ఆయూష్‌, బీఎస్సీ నర్సింగ్‌ అర్హతలను తప్పించింది. కేవలం యంబీబీఎస్‌ చదివిన వారే డాక్టర్‌ పోస్టులకు అర్హులని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పల్లె దవాఖానాల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. అసలే డాక్టర్‌లు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం యంబీబీఎస్‌ను మాత్రమే అర్హతగా ఖరారు చేయడంతో జిల్లాలోని 32 పల్లె దవాఖానాల్లో ఇప్పటి వరకు డాక్టర్‌ పోస్టులు భర్తీ కాలేదు. ప్రస్తుతం యంబీబీఎస్‌ పూర్తి చేసిన వారంతా రాబోయే రెండు, మూడునెలల్లో జరగబోతున్న పీజీ పరీక్షల కోసం సన్నద్దులవుతున్న కారణంగానే పల్లె దవాఖానాల పోస్టుల వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. దీంతో పాటు పల్లె దవాఖానాల్లో వైద్యులకు తక్కువ వేతనం ఉండడం కూడా ఆనాసక్తికి కారణమవుతోందని చెబుతున్నారు. పీజీ పరీక్షలు పూర్తయిన తరువాత అందులో సీటు రాని యంబీబీఎస్‌ డాక్టర్‌లు పల్లె దవాఖానాల్లో చేరేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మాత్రమే అందనున్న కారణంగా ఆయూష్‌ , బీఎస్సీ నర్సింగ్‌ అర్హలున్న వారిని నియమించాలని కోరుతున్నారు. లేనట్లయితే పల్లె దవాఖానాల ఏర్పాటు లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలకు సాధారణ వైద్య సేవలైన ప్రభుత్వ పరంగా అందిస్తే కొంత వరకైనా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రాథమిక వైద్యసేవల కోసం ప్రజలు స్థానికంగా ఉన్న ఆర్‌యంపీ డాక్టర్‌లను అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి పెద్దమొత్తంలో డబ్బులు ఫీజులు, పరీక్షల రూపంలో నష్టపోతున్నారంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం పల్లె దవాఖానాల డాక్టర్‌ల పోస్టులకు అవసరమైన విద్యార్హతలను సవరించాలని కోరుతున్నారు. 

భర్తీ కాని 32 పోస్టులు

జిల్లాలోని 32 పల్లె దవాఖానాల్లో గత ఐదారు నెలల నుంచి డాక్టర్‌ పోస్టులు భర్తీ కావడం లేదు. కేవలం 18 పల్లె దవాఖానాల్లో మాత్రమే డాక్టర్‌ పోస్టులు కొనసాగుతున్నాయి. యంబీబీఎస్‌ విద్యార్హతల కారణంగా ఆ కోర్సు చదివిన వారు ఎవరూ కూడా పల్లెదవాఖానాల్లో పని చేసేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. వైద్య,ఆరోగ్యశాఖ ఉన్న తాధికారులు యంబీబీఎస్‌ పూర్తి చేసిన అభ్యర్థులతో మాట్లాడి వారికి కౌన్సెలింగ్‌లు కూడా చేస్తున్నారు. స్థానికంగా వైద్యసేవలు అందిస్తే పేరు ప్రతిష్టలతో పాటు అనుభవం కూడా వస్తుందని అలాగే ఉన్నత చదువుల కోసం ఇన్‌సర్వీస్‌ కూడా వర్తిస్తుందంటూ అధికారులు నచ్చజెపుతున్నారు. అయినప్పటికీ యంబీబీఎస్‌ చదివిన అభ్యర్థులు పల్లె దవాఖానాల వైపు కన్నెత్తి చూడకపోతుండడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. 

పీజీ పరీక్షల పైనే ఆశలు

యంబీబీఎస్‌ పూర్తి చేసిన వారంతా వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరంతా పీజీ సీట్ల కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు. పీజీ పరీక్షలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న కారణంగా అప్పటి వరకు యంబీబీఎస్‌ అభ్యర్థులు పల్లె దవాఖానాల నియమకాల వైపు కన్నెత్తి చూసే అవకాశం లేదంటున్నా రు. అయితే పీజీ పరీక్షల తరువాత గత్యంతరం లేకనైనా పల్లె దవాఖానాల్లో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

పేదలకు అందని ప్రాథమిక వైద్యం

కాగా పల్లె దవాఖానాల పరిధిలోని గ్రామాల్లో అక్కడి ప్రజలకు ప్రా థమిక వైద్యం అందడం కష్టతరంగా మారిందంటున్నారు. కేవలం 18 పల్లె దవాఖానాల ద్వారా మాత్రమే అక్కడి డాక్టర్‌ల ద్వారా వైద్య సేవ లు అందుతుండగా డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న 32 పల్లె దవాఖానాలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించలేని స్థితిలో ఉన్నాయంటున్నారు. అయితే గ్రామీణ ప్రజలు వైద్యం కోసం మళ్లీ పట్టణాలకే వచ్చి ప్రైవేటు డాక్టర్‌ల వద్ద వైద్య సేవలు పొందుతున్నారంటున్నారు. ఇకనైనా వైద్య,ఆరోగ్యశాఖ డాక్టర్‌ పోస్టు కోసం యంబీబీఎస్‌ అర్హతను పక్కన పెట్టి ఆయూష్‌, బీఎస్సీ నర్సింగ్‌ అర్హతలున్న వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని, తదననుగుణంగా జీఓను సవరించాలని కోరుతున్నారు. 

యంబీబీఎస్‌ చదివిన వారు ఆసక్తి చూపడం లేదు

పీజీ పరీక్షల కారణంగా యంబీబీఎస్‌ చదివిన అభ్యర్థులు పల్లె దవాఖానాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం వారు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు. వైద్య,ఆరోగ్యశాఖ తరపున యంబీబీఎస్‌ అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్ర యోజనం లేకుండా పోతోంది. దీనికంతటికి పీజీ ప్రవేశ పరీక్షలే కారణమని భావిస్తున్నాం. పీజీ పరీక్షల తరువాత సీట్లు దక్కని యంబీబీఎస్‌ అభ్యర్థులు పల్లె దవాఖానాల్లో చేరేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ప్రాథమిక స్థాయి వైద్య సేవలను పీహెచ్‌సీ వైద్యులతోనూ అక్కడి సిబ్బందితో అందిస్తున్నాం. 

- డాక్టర్‌ ధన్‌రాజ్‌ , జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి 


పల్లె ఆసుపత్రికి వైద్యున్ని నియమించాలి

 బీరవెల్లి సబ్‌సెంబర్‌ను పల్లె ఆసుపత్రిగా గుర్తించి పల్లె దవాఖానాల్లో వైద్యున్ని నియమించాలి. సబ్‌సెంబర్‌లో వైద్యులు లేకపోవడంతో వ్యాధిగ్రస్థులు వైద్యపరీక్షలు చేయించుకోవడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్‌ గ్రామానికి వెళ్ళి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. పల్లె ఆసుపత్రిలో డాక్టర్‌ని నియమిస్తే వ్యాధిగ్రస్థులకు వైద్యపరీక్షలు చేయించుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇకనైనా పల్లె ఆసుపత్రికి వైద్యున్ని నియమిస్తే బాగుంటుంది.  

Updated Date - 2022-04-22T05:00:14+05:30 IST