డాక్టర్స్‌.. నో రౌండ్స్‌

ABN , First Publish Date - 2022-08-01T05:20:36+05:30 IST

డాక్టర్స్‌.. నో రౌండ్స్‌

డాక్టర్స్‌.. నో రౌండ్స్‌

ప్రసవ వార్డులకు వెళ్లని వైద్యులు

రాత్రి వేళల్లో అందని సేవలు

పసికందులతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు..

సీకేఎం ఆస్పత్రిలో దయనీయ స్థితి

పట్టించుకోని ఉన్నతాధికారులు


గిర్మాజిపేట, జూలై 31 : పేదల ఆస్పత్రిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యులు ప్రసవ వార్డులకు వెళ్లకపోవడంతో నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి ప్రాణాంతకంగా మారుతోంది. కొందరు వైద్యులు శిశు వార్డుల వైపు కన్నెత్తి చూడడం లేదని బాలింతలు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రసవాలకు పెద్దాస్పత్రిగా గుర్తింపు పొందిన వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో బాలింతలు, పసికందులు పడరానిపాట్లు పడుతున్నారు. ఇక్కడ నిత్యం సాధారణ, ఆపరేషన్ల ద్వారా 25వరకు ప్రసవాలు చేస్తుండడం గమనార్హం. ఆస్పత్రిలో పసికందుల చికిత్సల కోసం 20పడకల నవజాత శిశువుల వార్డు కూడా ఉంది. ఇన్‌ఫెక్షన్‌, జాండీస్‌ తదితర అనారోగ్య సమస్యలకు ఈ వార్డులో చికిత్స అందిస్తుంటారు. ఇందుకోసం వార్మర్‌లు, ఫొటోథెరపీ, సిఫాస్‌ తదితర వైద్య పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయి. పిడియాట్రిక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పర్యవేక్షణలో ఇద్దరు పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు కాంట్రాక్ట్‌ వైద్యులు, 14 మంది కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు వైద్య సేవలందిస్తున్నారు. 


అడుగడుగునా నిర్లక్ష్యం..

ఆస్పత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌తోపాటు ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాలి. అలాగే మరో ముగ్గురు కాంట్రాక్ట్‌ వైద్యులు షిఫ్ట్‌కు ఒకరు చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో ముగ్గురు విధులు నిర్వర్తించాలి. నాలుగు ప్రసవ వార్డుల్లో వీరు నిత్యం ప్రతీ షిఫ్ట్‌లో సుమారు రెండు గంటలు రౌండ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ప్రసవాల సందర్భంగా లేబర్‌రూం, ఆపరేషన్‌ థియేటర్లలో అందుబాటులో ఉండాలి. యాంటీనేటల్‌, పోస్టునేటల్‌, పోస్టు ఆపరేటివ్‌, ఐసీయూ నాలుగు ప్రసవాల వార్డులుండగా, నిత్యం 150 మంది శిశువులు తల్లులతో ఉంటారు. 20 మంది శిశువుల చికిత్స కోసం నవజాత శిశు ప్రత్యేక వార్డు కూడా ఉంది. వైద్యులు వార్డుల్లో రౌండ్స్‌(పరిశీలన) చేసి శిశువుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తగిన వైద్య అందించడం.. సిబ్బంది వైద్య సూచనలు చేయాల్సి ఉంటుంది. కానీ, వైద్యులెవరూ రౌండ్స్‌కు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం తూతూమంత్రంగా ఏదో ఒక వార్డుకు వెళ్లి ముగ్గురు, నలుగురు శిశువులను చూసి రౌండ్స్‌ డ్యూటీ అయిందనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత పసికందులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారని, రాత్రి వేళయితే  పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది బాలింతలు, వారి బంధువులు వాపోతున్నారు.  ప్రసవ వార్డు పై అంతస్థులో ఉంటే.. నవజాత శిశు చికిత్స కేంద్రం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంది. దీంతో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పసికందుతోపాటు ఇందికి తీసుకురావాల్సి వస్తోంది. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో వైద్యం సకాలంలో అందక ఒక్కోసారి పసికందుల ప్రాణం మీదకు వస్తోంది.  ఒక్కోసారి స్టాఫ్‌నర్సులే చికిత్స చేస్తున్నారు. దీంతో  ఏ సమస్య వచ్చినా బంధువులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.


రోస్టర్‌లో పేరు ఒకరిది.. డ్యూటీలో మరొకరు.. 

నవజాత శిశువార్డులో కాంట్రాక్ట్‌ వైద్యులు, నర్సులకు డ్యూటీ రోస్టర్‌ ఉంటుంది. ప్రతీరోజు మూడు షిఫ్ట్‌లకు గాను ప్రతీ షిఫ్ట్‌లో డాక్టర్‌ (డీఎంవో), నలుగురు స్టాఫ్‌నర్సులు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రతీ ఎనిమిది గంటలకు షిఫ్ట్‌ మారాల్సిన వైద్యులు డ్యూటీ రోస్టర్‌కు భిన్నంగా ఒక రోజు డ్యూటీ చేసి రెండు రోజులు డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. దీంతో రోస్టర్‌లో ఒక డాక్టర్‌ ఉంటే, డ్యూటీలో మరొకరు ఉంటున్నారు. అంతేకాదు, ఓ రెండు గంటలు వార్డుల్లో పిల్లలను చూసి పని ఉందంటూ, బయటకు వెళ్లి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సేవలందించి, డ్యూటీ ముగిసే సమయానికి వస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువగా పిల్లల వార్డును స్టాఫ్‌నర్సులే చూసుకుంటున్నారని శిశువుల బంధువుల చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌చార్జి, సూపరింటెండెంట్‌ల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. 


వైద్యులు నిర్లక్ష్యంతోనే మా శిశువు మృతి : మల్లోజుల సత్యనారాయణచారి (మృత శిశువు బంధువు), ఫోర్టురోడ్డు, వరంగల్‌.

మా మేనకోడలు షీలోజు సరిత(22) మే 9న 2020లో సీకేఎంలో పాపకు జన్మనిచ్చింది. మూడు రోజుల తర్వాత టీకా వేయడంతో  పాప జ్వరంతో పాలు తాగలేదు. డ్యూటీ స్టాఫ్‌నర్సు సూచనతో సాయంత్ర ఆరుగంటలకు నవజాత శిశు వార్డుకు తీసుకొచ్చాం. డాక్టర్‌ చూడకపోవడంతో తిరిగి తల్లి వార్డుకు తీసుకుపోయాం. బాగా ఏడ్వడంతో మరుసటి రోజు (మే12) ఉదయం మళ్లీ నవజాత శిశు వార్డుకు తీసుకురాగా పరిక్షించిన పిల్లల వైద్యుడు చనిపోయిన శిశువును తెచ్చారని చెప్పాడు. మే11న వైద్యులు రౌండ్స్‌కు వచ్చినా.. నవజాత శిశు వార్డులో వైద్యులు సూచినా ఈ పాప బతికేది. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడమేకాక, వైద్యులపై కేసు కూడా పెట్టాం.


వైద్యులు రౌండ్స్‌కు  వెళ్లేలా చూడాలి : వీరమనేని సాగర్‌రావు, ఖానాపురం

ప్రసవ వార్డుల్లోని పిల్లల వైద్యులు రౌండ్స్‌కు వచ్చి చూడటం లేదు. పసికందులకు జ్వ రం వచ్చినా, పాలు తాగకపోయినా, బాగా ఏడ్చినా, అసలు ఏడవకపోయినా ఏమి చేయా లో అర్థం కావడం లేదు. సమస్య వచ్చి నర్సుకు చెబితే, పిల్లల వార్డుకు పొమ్మంటారు.. తీసుకెళితే అక్కడ డాక్టర్‌ ఉండడు. ఒక వేళ ఉన్నా బాక్స్‌ల్లోని శిశువులను చూస్తున్నామంటూ అలస్యంగా చూస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల పేద మహిళలే ఎక్కువ వస్తుంటారు. వైద్యులే రౌండ్స్‌కు వెళ్లి చూస్తే బాగుంటుంది.



Updated Date - 2022-08-01T05:20:36+05:30 IST