11 మంది వైద్య విద్యార్థులపై కరోనా పంజా

ABN , First Publish Date - 2020-06-03T08:37:32+05:30 IST

కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిపైనా పంజా విసురుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిన్నమొన్నటి వరకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులకు వైరస్‌ సోకగా.. ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు,

11 మంది వైద్య విద్యార్థులపై కరోనా పంజా

  • ఉస్మానియాలో ఏడుగురు.. నిమ్స్‌లో నలుగురికి
  • గాంధీలో మరొకరికి కూడా..?
  • మొత్తం 17 మందికి వైరస్‌
  • కొత్తగా 99 పాజిటివ్‌లు
  • హైదరాబాద్‌లోనే 70 కేసులు
  • 12 మంది వలస కార్మికులకూ..
  • నలుగురి కన్నుమూత 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిపైనా పంజా విసురుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిన్నమొన్నటి వరకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులకు వైరస్‌ సోకగా.. ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. మంగళవారం ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో శనివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మొత్తం బాధితుల సంఖ్య 12కు చేరింది. ఇక నిమ్స్‌లోనూ నలుగురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని పేట్లబురుజు ఆస్పత్రి, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న విద్యార్థుల్లో కొందరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. గాంధీ ఆస్పత్రిలో కూడా ఒక పీజీ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఉస్మానియాలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌కు, నర్సుకు కరోనా సోకింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 99 కేసులు నమోదవగా అందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 70 కేసులు ఉండడం గమనార్హం.


దీంతో తొలి కేసు నమోదైన మార్చి 2 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 1997కి చేరింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మంగళవారం నమోదైన కేసుల్లో 12 మంది వలస కార్మికులు ఉన్నారు. దీంతో వలస కేసుల సంఖ్య 212కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్‌లో 3, నల్లగొండలో 2, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. వైరస్‌ కారణంగా మంగళవారం మరో నలుగురు కన్నుమూశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. ఓ వ్యక్తి(42) గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ వైరస్‌ వల్ల చనిపోగా, మరో వ్యక్తి(41)కి థైరాయిడ్‌ ఉండి కరోనా కూడా సోకడంతో మరణించారు. 70, 60 ఏళ్ల మహిళలు హైబీపీతో బాధపడుతూ వైరస్‌ సోకి మరణించారని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వైరస్‌ బారిన పడిన వారిలో మంగళవారం మరో 35 మంది కోలుకున్నారు. దీంతో డిశ్చార్జ్‌ల సంఖ్య 1526కు చేరుకోగా, 1273 మంది చికిత్స పొందుతున్నారు. 


  1. ఉస్మానియాలో భోజనం తయారు చేసే ఓ యువకుడికి కూడా వైరస్‌ సోకడంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 
  2. ఎర్రగడ్డ ఆయుర్వే ఆస్పత్రిలో మంగళవారం 24 మందికి, కింగ్‌కోఠిలో 15 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 
  3. భోలక్‌పూర్‌లోని బడీ మసీదు సమీపంలో క్లినిక్‌ నిర్వహించే ఆర్‌ఎంపీ (40)కి పాజిటివ్‌ వచ్చింది. 
  4. మలక్‌పేటలో నాలుగేళ్ల బాలుడికి వైరస్‌ సోకింది. 
  5. తుకారాం గేట్‌లో ఇటీవల ఓ వైద్యుడికి పాజిటివ్‌ రాగా.. ఆయన ఇంట్లో పనిచేసే మహిళకు కూడా తాజాగా వైరస్‌ నిర్ధారణ అయింది. 


నల్లగొండ జిల్లాలో బాలింత మృతి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైర్‌సతో ఓ బాలింత మృతి చెందింది. నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన యువకుడి (36)కి, చౌటుప్పల్‌లో ఓ కూరగాయల వ్యాపారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌కు చెందిన బాలింత కరోనా పాజిటివ్‌తో మృతి చెందింది. మహిళ (23) రెండో కాన్పు కోసం రాజాపేట, జనగామ, హన్మకొండ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంది. గత నెల 27న బచ్చన్నపేటలోని పుట్టింటికి వెళ్లింది. కాన్పు కోసం జనగామలో పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉందని, 30న ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. సోమవారం సాయంత్రం తల్లి కూడా మృతి చెందింది. వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు.


చింతల కుటుంబ సభ్యులకూ.. 

బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. చింతలకు పాజిటివ్‌ వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. ఆయన తల్లి, సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. అయితే వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. వీరిని కూడా ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన సమీప బంధువుల నమూనాలు కూడా సేకరించారు.

Updated Date - 2020-06-03T08:37:32+05:30 IST