అరచేతిలో ప్రాణాలు!

ABN , First Publish Date - 2020-04-04T08:21:56+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం ఇతర వ్యాధిగ్రస్థులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తలసేమియా, కిడ్నీ, కేన్సర్‌ రోగుల అవస్థలు...

అరచేతిలో ప్రాణాలు!

ఇతర వ్యాధులతో ఎందరు ఎంత ఇబ్బంది పడినా సరే! కరోనాను మాత్రం కట్టడి చేయాల్సిందే! ఇదీ... ప్రస్తుత పరిస్థితి. లాక్‌డౌన్‌ నుంచి నిత్యావసరాలు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంది. కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి చికిత్సలకు మాత్రం మినహాయింపు లేదు. మరి... వారి ఆరోగ్యం సంగతేమిటి?


  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఇక్కట్లు
  • వైద్యం కోసం వేల మంది ఎదురుచూపు
  • హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
  • ఎన్‌వోసీలు ఇవ్వాలని రోగుల డిమాండ్లు
  • పైనుంచి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు
  • ఎన్‌వోసీ ఇచ్చినా సరిహద్దుల్లో ఆపేస్తారు
  • పోలీసు, ఆరోగ్య శాఖల స్పష్టీకరణ
  • ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టని అధికారులు

అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావం ఇతర వ్యాధిగ్రస్థులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తలసేమియా, కిడ్నీ, కేన్సర్‌ రోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే బయటకు అనుమతిస్తున్నారు. అది కూడా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో తిరిగేందుకు మాత్రమే అనుమతి ఉంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా ఇంటిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అనారోగ్య సమస్యలున్న వారికి అనుమతి మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తలసేమియా రోగులకు రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రక్తశుద్ధి (డయాలసిస్‌), కేన్సర్‌ రోగులకు కీమోథెరపీలు చేయాలి. ఇవన్నీ అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి.  రాష్ట్రంలో ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఎక్కువగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో, తెలంగాణలోని హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సరిహద్దులు కూడా మూసివేయడంతో ఇతర జిల్లాలవారు ఈ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. తాము థెరపీలు చేయించుకుంటున్న ఆస్పత్రుల నుంచి ఫోన్లు వస్తున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి.


మేమేం చేయలేం..

రాష్ట్రంలో చాలా మంది తలసేమియా, కిడ్నీ, కేన్సర్‌ రోగులు హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి ప్రధాన ఆస్పత్రులకు వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరిహద్దులు మూసివేయడంతో హైదరాబాద్‌ వెళ్లడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత మంది జిల్లాల్లో పోలీసులను, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించి.. నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) ఇస్తే హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటామని కోరుతున్నారు. తమకు అలాంటి ఆదేశాలు లేవని జిల్లా అధికారులు చేతులెతేస్తున్నారు. ఇటుంటి అత్యవసర కేసులకు సంబంధించి రెండు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు.. కేన్సర్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంబంధించిన కీలకమైన మందులను రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌ నుంచే కొనుగోలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో అవీ వచ్చే పరిస్థితి లేదు. 


ట్రస్టుతో సమన్వయ లోపం

రాష్టంలోని డయాలసిస్‌ రోగులు కొత్త రకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా బోధనాస్పత్రులను కరోనా ఐసొలేషన్‌ ఆస్పత్రులుగా మార్చారు. ఇప్పటి వరకూ అక్కడ చికిత్స పొందుతున్న వారిని ఇళ్లకు పంపించారు. అత్యవసర కేసులను దగ్గరల్లో ఉన్న మరో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది కిడ్నీ రోగులకు ఇబ్బందిగా పరిణమించింది. వారికి డయాలసిస్‌ అత్యవసరం. బోధనాస్పత్రులను ఖాళీ చేయించేటప్పుడు వారి సమస్యను అధికారులు దృష్టిలో పెట్టుకోలేదు. వారికి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా మీకు దగ్గరల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకోవచ్చని చెప్పి పంపించేశారు. అధికారుల మాటలు నమ్మి, వారంతా ప్రైవేటు ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికిప్పుడు తాము డయాలసిస్‌ చేయలేమని ప్రైవేటు ఆస్పత్రులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు డయాలసిస్‌ చేసేందుకు ముందుకొచ్చినా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతులు రావడం లేదు. ఆరోగ్యశాఖ అధికారులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు మధ్య సమన్వయం లేకపోవడంతో డయాలసిస్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని శాఖల అధికారులంతా కరోనా నివారణ, నియంత్రణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. 


సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి 

లాక్‌డౌన్‌తో సకాలంలో వైద్యం అందక ప్రకాశం జిల్లా కనిగిరిలోని శంఖవరానికి చెందిన పాలూరి అక్షిత (2) అనే చిన్నారి మృతి చెందింది. అక్షిత పుట్టినప్పటి నుంచి శ్వాసకోశ సంబంధమైన సమస్యతో బాధపడుతోంది. శ్వాస అందని సమయంలో తల్లిదండ్రులు ఆమెను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి నెబులైజర్‌ పెట్టిస్తుంటారు. గురువారం సాయంత్రం అక్షిత శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో తల్లిదండ్రులు కనిగిరి తీసుకువచ్చారు. లాక్‌డౌన్‌తో ప్రైవేటు వైద్యశాలలు మూసి వేయడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఒంగోలు తీసుకువెళ్లాలని సిబ్బంది సూచించారు. అందుకు అనుమతులు తీసుకొని ఒంగోలు తరలించే సరికి ఆమె పరిస్థితి విషమించింది. ఒంగోలు జీజీహెచ్‌ వైద్యుల సూచన మేరకు శుక్రవారం గుంటూరు తరలిస్తుండగానే మృతి చెందింది. 

Updated Date - 2020-04-04T08:21:56+05:30 IST