Abn logo
May 14 2021 @ 23:43PM

కరోనా రోగుల వద్దకు వైద్యులు వెళ్లాల్సిందే

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని, పక్కన మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ఇతర అధికారులు

ఆక్సిజన్‌ వృథా అరికట్టే బాధ్యత నర్సులది

104, హెల్ప్‌ డెస్క్‌ల పనితీరు మెరుగుపడాలి

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

విశాఖపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): కేజీహెచ్‌లో కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందాలని, వైద్యులు, నర్సులు బాధ్యతాయుతంగా పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. ముఖ్యమత్రి ఆదేశం మేరకు విశాఖపట్నంలో వైద్యసేవల పనితీరును పరిశీలించడానికి వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం కేజీహెచ్‌ వైద్య వర్గాలు, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో పడకలు, వైద్య సిబ్బంది వివరాలు, మందులు, ఇంజెక్షన్‌లు, ఆక్సిజన్‌ సరఫరా వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మాట్లాడుతూ, అనేక అంశాలు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వాటిని సరిచేసుకోవాలని సూచించారు. కరోనా వార్డుల్లో రోగులను వైద్యులు చూడటం లేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయని, ఇకపై తప్పకుండా డాక్టర్లు రోగులతో మాట్లాడాలని, సూపరింటెండెంట్‌  సీసీ కెమెరాలతో ఆ వ్యవహారాలను పరిశీలించాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ సరిపడినంత ఉన్నప్పటికీ వృథా జరుగుతోందని, దానిపై రోగులకు నర్సులు అవగాహన కల్పించాలన్నారు. బాత్రూమ్‌కు వెళ్లినపుడు రెగ్యులేటర్‌ కట్టడం, మాస్క్‌ను పక్కన తీసి పెట్టినపుడు ఆక్సిజన్‌ ఆపడం వంటి అంశాలు రోగులకు చెపాల్సిన బాధ్యత నర్సులదేనని మంత్రి స్పష్టం చేశారు.  చికిత్స పొందుతున్న వారి బాగోగుల గురించి, చనిపోయిన తరువాత వారి వస్తువుల అప్పగింత వంటి విషయాల్లో హెల్ప్‌డెస్క్‌ సరిగ్గా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, మరింత సమర్థంగా పనిచేసేలా జాయింట్‌ కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రోగులతో బంధువులను మాట్లాడించే ప్రయత్నం చేయాలన్నారు. 104, హెల్ప్‌ డెస్క్‌లు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. 

వచ్చిన వెంటనే అడ్మిట్‌ చేసుకోవాలి

కేజీహెచ్‌లో 840 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని,  కరోనా లక్షణాలతో వచ్చిన వారికి తక్షణమే అడ్మిషన్‌ ఇవ్వాలన్నారు. కేజీహెచ్‌కు రోజూ 80 టన్నుల ఆక్సిజన్‌ అవసరమని, ఇది రెండు విడతలుగా వస్తుందని, వృథా కాకుండా చూడాలన్నారు.  రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు అవసరమైన వారికి తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.

తాత్కాలిక షెడ్లు: మంత్రి కన్నబాబు

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మృతుల సంఖ్య పెరగడంతో శ్మశానంలో దహనాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందన్నారు.  జ్ఞానాపురం వాటికలో మరిన్ని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయించాలని జాయింట్‌ కలెక్టర్‌ను  ఆదేశించారు.

మరో అధికారి అవసరం: మంత్రి ముత్తంశెట్టి

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలికి సహాయంగా మరో అధికారిని నియమించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ సూచించారు. ఈ బాధ్యత నోడల్‌ అధికారి సాయిప్రసాద్‌ తీసుకోవాలన్నారు. 

ఆక్సిజన్‌ నిర్వహణ బాధ్యత ఈపీడీసీఎల్‌ సీఎండీకి

నగరంలో ఆక్సిజన్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి చూసుకుంటారని, కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ వృథాను అరికట్టే బాధ్యత  మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఇంకో అధికారి నాయుడు చూస్తారని నోడల్‌ అధికారి సాయిప్రసాద్‌ పేర్కొన్నారు. ఆస్పత్రి పడకల మేనేజ్‌మెంట్‌, అడ్మిషన్లకు వచ్చే రోగులకు సమాధానం చెప్పేందుకు ఒక ప్రొఫెసర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు వేణుగోపాల రెడ్డి కరోనా రోగులకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు, చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడుతూ, నాలుగు జిల్లాల ప్రజలు కేజీహెచ్‌పై ఆధార పడుతున్నారని, అందుకని ఒత్తిడి ఉందన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


Advertisement