బ్రిటన్‌లో వైద్యులకు గండం

ABN , First Publish Date - 2020-04-08T09:16:44+05:30 IST

రోనా మరణాలు తీవ్రత ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 75,538 మందిని బలిగొంది.

బ్రిటన్‌లో వైద్యులకు గండం

భారత సంతతి సర్జన్‌ మృతి.. స్పెయిన్‌లో మళ్లీ విజృంభణ


లండన్‌, ఏప్రిల్‌ 7: కరోనా మరణాలు తీవ్రత ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 75,538 మందిని బలిగొంది. ఇన్నాళ్లకు తొలిసారి మంగళవారం చైనాలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఇక బ్రిటన్‌లో హృద్రోగ నిపుణుడైన భారత సంతతి వైద్యుడు జితేందర్‌ కుమార్‌(58) కరోనా చికిత్స పొందుతూ మరణించారు. ఫ్లూ లక్షణాలు కనిపించడంతో కార్డీఫ్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స అందిస్తుండగానే మంగళవారం మరణించారు. ఇదే ఆస్పత్రిలో పక్షం రోజుల్లో పలువురు వైద్య సిబ్బంది మృత్యువాతపడ్డారు.


తొలి విడత కరోనా వ్యాప్తి పూర్తయ్యేనాటికి బ్రిటన్‌లో యూర్‌పలోనే అత్యధికంగా మరణాలు సంభవిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ వెల్లడించింది. కాస్త కుదుటపడినట్టు కనిపించిన స్పెయిన్‌లో మళ్లీ మహమ్మారి విజృంభించింది. సోమవారం 637 మంది, మంగళవారం 743మంది మృతిచెందారు. ఇక, వరుసగా వారంపాటు కొత్తకేసులు నమోదు కాకపోవడంతో ఇరాన్‌ పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ సహా సభలో అత్యధికులకు కరోనా పాజిటివ్‌ తేలడంతో పార్లమెంటును ఉన్నపళంగా మూసివేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. డెన్మార్క్‌ ఈ నెల 15 నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ఇప్పుడికప్పుడే కరోనా తీవ్రతను చవిచూస్తున్న శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. కరోనా పరీక్షలు, నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలు, రక్షణ సామగ్రి, మాస్కులను అందించింది. దాదాపు పది టన్నుల పరికరాలను ప్రత్యేక విమానంలో లంకకు పంపించింది.

Updated Date - 2020-04-08T09:16:44+05:30 IST