ఈసారైనా సాగేనా..!?

ABN , First Publish Date - 2020-02-20T09:30:45+05:30 IST

వైద్యశాఖలోని అధికారులు, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరయ్యేలా తద్వారా సకాలంలో రోగులకు వైద్యసేవలు అందించేలా

ఈసారైనా సాగేనా..!?

ఆసుపత్రులకు సక్రమంగారాని వైద్యులు, సిబ్బంది

వైద్యశాఖలో బయోమెట్రిక్‌పై ప్రభుత్వం సీరియస్‌

నేటి నుంచి పటిష్టంగా అమలుకు ఆదేశాలు 

ఐదు రోజులకు ఒకసారి హాజరు పరిశీలన

సంతృప్తికరంగా లేకపోతే జీతాల్లో కోత

గతంలో అమలు చేసినా అనేక అవాంతరాలు


నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 19 :

వైద్యశాఖలోని అధికారులు, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరయ్యేలా తద్వారా సకాలంలో రోగులకు వైద్యసేవలు అందించేలా చేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది.  ఉద్యోగులందరూ ఆధార్‌ లింక్‌తో బయోమెట్రిక్‌ హాజరులో నమోదు చేయించుకో వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ద్వారానే హాజరు వేయాలని, ప్రతి ఐదు రోజులకు ఒకసారి హాజరును పరిశీలిస్తారని, సమయానికి విధులకు రాని వారి జీతాల్లో కోత తప్పదని హెచ్చరించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, జీజీహెచ్‌లో గురువా రం (20వ తేదీ)నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. అయితే ఈ విధానంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్న నేపఽథ్యంలో ఎంత వరకు సత్ఫలితాలు వస్తాయో చూడాలి.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని, దీనివల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారని, గత్యంతరంలేక  ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది. గతేడాది నవంబరు 1 నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశించినా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడంతో గురువారం నుంచి పక్కా అమలుకు పూనుకుంది.


గతంలో ఉన్నా ఫలితాలు శూన్యం ..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా వైద్య శాఖలో సంస్కరణలు తీసుకువచ్చేలా బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేశారు. 2017 జూలైౖ 1న ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఏడాదిపాటు సాగిన తర్వాత అమలుపై అధికారులు దృష్టి పెట్టకపోవటం, ప్రభుత్వం కూడా చూసీచూడనట్లు వ్యవహరించటంతో పూర్వ స్థితికి వచ్చేసింది. వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరవుతూ ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.


పరికరాలు చెడగొట్టిన ప్రభుద్దులెందరో?

ప్రభుత్వ ఆసుపత్రులలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరాలను ఆదిలోనే చెడగొట్టిన ప్రభుద్దులెందరో ఉన్నారు. విధులకు సక్రమంగా హాజరుకాని వైద్యులు, ఉద్యోగులు బయోమెట్రిక్‌ పరికరాల్లో ఇంకు, నీరు వంటివి పోయటం, సాంకేతికంగా వాటిని నిర్వీర్యం చేయటం వంటి ఘటనలు జరిగాయి. నెల్లూరులోని జీజీహెచ్‌తోపాటు పలు పీహెచ్‌సీల్లోనూ ఇలాంటివి వెలుగు చూశాయి. అప్పటి కలెక్టర్‌ జానకి వీటిని పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే కారకులెవరో తేలకపోవటంతో నిందితులు తప్పించుకున్నారు. తర్వాత కొంతకాలానికి బయోమెట్రిక్‌ హాజరుకు స్వస్తి పలకటంతో పరిస్థితి మొదటికి వచ్చింది.


లక్షల ఖర్చు చేసినా.. ఏం ప్రయోజనం

గత ప్రభుత్వంలో జిల్లాలో బయోమెట్రిక్‌ విధానానికి రూ.లక్షలు ఖర్చు చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు కోసం తొలుత ఐరిష్‌ పరికరాలను కొనుగోలు చేసారు. ఒక్కొక్క దానికి రూ.30వేలు వెచ్చించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 120కిపైగా ఆసుపత్రుల్లో అమర్చారు. కొంతకాలం వినియోగించిన తర్వాత వేలిముద్రల వల్ల మరింత మెరుగైన ఫలితాలు  ఉంటాయంటూ మరలా బయోమెట్రిక్‌ పరికరాలను కొనుగోలు చేశారు. ఇందుకోసం  రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ఈ విధానం సజావుగా సాగుతుండగా పరికరాలను కొందరు చెడగొట్టటం, మరికొన్నింటిని వాడకుండా పోవటంతో నిరుపయోగంగా మారాయి.  మొదట్లో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయానికి అన్ని పీహెచ్‌సీల నుంచి బయోమెట్రిక్‌ అనుసంధానం చేశారు. ఖైజా యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేపట్టారు. అయితే సీతారామపురం, గండిపాళెం, ఉదయగిరి తదితర ప్రాంతాల్లోని కొన్ని పీహెచ్‌సీలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం లేకపోవటంతో ఈ బయోమెట్రిక్‌ హాజరు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 


అమలు చేస్తే సత్ఫలితాలు ...

ప్రస్తుతం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాంతాల్లో కూడా బయోమెట్రిక్‌ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.  బయోమెట్రిక్‌ పరికరాల నిర్వాహణ, రక్షణపై దృష్టిపెట్టాలి. యంత్రాలను నిర్వీర్యం చేసే ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలి. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో 119 మంది వైద్యులు, రెండు వేల మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్య విధానపరిషత్‌ ఆసుపత్రులలో 120 మంది వైద్యులు, 375 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 75 మంది వైద్యులు, 500 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా సమయపాలన పాటిస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి రూ. వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.


బయోమెట్రిక్‌ తప్పని సరి..డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

బయోమెట్రిక్‌ హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం ప్రతి వైద్యుడు, సిబ్బంది హాజరు నమోదు చేసుకోవాల్సిందే. ప్రభుత్వ ఆదేశాలను సక్రమంగా పాటించేలా కృషి చేస్తాం. చాలా పీహెచ్‌సీలలో బయోమెట్రిక్‌ పరికరాలు మరమ్మత్తు చేసి అందుబాటులోకి తెచ్చాం. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 


అమలుపై ప్రత్యేక దృష్టి...డాక్టర్‌ సుబ్బారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త

వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో బయామెట్రిక్‌ హాజరుపై ప్రత్యేక దృషి పెడుతున్నాం. ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తాం. విధులకు సరిగా హాజరుకాని  వైద్యులు, సిబ్బంది జీతాలలో కోత తప్పదు. బయోమెట్రిక్‌తో సత్ఫలితాలు వస్తాయి.

Updated Date - 2020-02-20T09:30:45+05:30 IST