America వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్న ఆ డాక్టర్ అదృశ్యం.. వాకింగ్‌కు అని వెళ్లి..

ABN , First Publish Date - 2021-09-07T18:12:59+05:30 IST

నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ జయశీల్‌రెడ్డి గల్లంతయ్యారు.

America వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్న ఆ డాక్టర్ అదృశ్యం.. వాకింగ్‌కు అని వెళ్లి..

నల్లగొండ/నల్లగొండ రూరల్‌: నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ జయశీల్‌రెడ్డి గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జగదీ‌ష్‌రెడ్డి కుమారుడు డి.జయశీల్‌రెడ్డి(42) జమైకాలో డాక్టర్‌ కోర్సు పూర్తి చేసి, రెండేళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. జయశీల్‌రెడ్డి సోదరి యూఎస్‌లో స్థిరపడడంతో అక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి మూడు రోజుల క్రితం నల్లగొండకు వచ్చారు. జయశీల్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన యూఎస్‌ వెళ్లాల్సి ఉంది. నల్లగొండలోని తన బంధువుల ఇంటి నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో అమ్మమ్మ గ్రామమైన మేళ్లదుప్పలపల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నాడు. సమీపంలోని దర్వేశిపురం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చాడు.


రోడ్డుపైనే కారు నిలిపి, డ్రైవర్‌ను అక్కడే ఉండమని చెప్పి వాకింగ్‌ చేసి వస్తానని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లాడు. అక్కడ చెరువు, కుంటలు అలుగు పోస్తున్న ఫొటోలను తీసి వాట్సప్‌ ద్వారా మేనమామ కోమటిరెడ్డి వినోద్‌రెడ్డికి పంపించారు. అదే సమయంలో ఫోన్‌లో మాట్లాడారు. అదే సమయంలో వ్యవసాయ క్షేత్రంలో కూలీలు ఎదురు పడడంతో వారి వద్ద కట్టెను తీసుకుని వాకింగ్‌ చేసి వస్తానని వెళ్లాడు. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వాకింగ్‌కు వెళ్లిన జయశీల్‌రెడ్డి ఎంతకూ రాకపోవడంతో డ్రైవర్‌ అంతా వెదికాడు. ఎక్కడా జయశీల్‌రెడ్డి కనిపించకపోవడంతో బంధువులకు సమాచారం అందించాడు.


విషయం తెలుసుకున్న జయశీల్‌రెడ్డి సమీప బంధువు, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ బృందంతో వ్యవసాయ క్షేత్రంతో పాటు సమీప ప్రాంతాల్లో వెదికారు. సోమవారం రాత్రి వరకు ఆచూకీ దొరకలేదు. జయశీల్‌రెడ్డి తండ్రి జగదీ్‌షరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-09-07T18:12:59+05:30 IST