పెరంబూర్(చెన్నై): రైల్వే సబ్వేలో నిలిచిన నీటిలో హఠాత్తుగా కారు మునిగిన ఘటన లో అందు లో ప్రయాణిస్తున్న వైద్యురాలు మృతిచెందింది. పుదుకోట జిల్లా దురైయూర్ ప్రాంతానికి చెందిన శివకుమార్ భార్య సత్య (35) కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమె శుక్రవారం సాయంత్రం అత్తతో కలసి కారులో దురైయూర్కు వెళుతోంది. సత్య కారు నడుపుతుండగా, దురైయూర్ సమీపంలో వచ్చే సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఆ ప్రాంతంలోని రైల్వే సబ్వేలో భారీగా నీరు చేరింది.
నీటిని గమనించకుండా సత్య కారు నడుపగా నీళ్లలో చిక్కుకుంది. ఇంతలో అత్త డోరు తీసుకొని బయటకు దిగగా, సీట్ బెల్ట్ పెట్టుకున్న సత్య బయటకు దిగలేకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందింది. సమాచారం అందుకున్న కీరనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారు నుంచి సత్య మృతదేహాన్ని విముక్తి చేసి పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.