డాక్టర్‌ రెడ్డీస్‌కు అమెరికా జోష్

ABN , First Publish Date - 2020-05-21T06:49:07+05:30 IST

ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లాభం ఆకర్షణీయంగా పెరిగింది. ఉత్తర అమెరికా, యూరప్‌, వర్థమాన దేశాల మార్కెట్లలో అమ్మకాల్లో...

డాక్టర్‌ రెడ్డీస్‌కు అమెరికా జోష్

  • నాలుగో త్రైమాసిక లాభం రూ.764 కోట్లు
  • ఆదాయం రూ.4,432 కోట్లు.. ఇదే అత్యధిక త్రైమాసిక ఆదాయం
  • 2019-20కి 500శాతం తుది డివిడెండ్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లాభం ఆకర్షణీయంగా పెరిగింది. ఉత్తర అమెరికా, యూరప్‌, వర్థమాన దేశాల మార్కెట్లలో అమ్మకాల్లో వృద్ధి బాగా ఉండడం లాభం పెరిగేందుకు దోహదం చేసింది. ఏకీకృత ప్రాతిపదికన 2020, మార్చి త్రైమాసికంలో కంపెనీ  రూ.764.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.434.4 కోట్లతో పోలిస్తే 76 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో రూ.569 కోట్ల నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 10 శాతం పెరిగి రూ.4,016.6 కోట్ల నుంచి రూ.4,431.8 కోట్లకు చేరింది. ఇప్పటి వరకూ ఒక త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదే. 2019-20 ఏడాదికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.25 తుది డివిడెండ్‌ (500 శాతం) చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందిన 5 రోజుల్లో ఈ డివిడెండ్‌ను చెల్లిస్తారు. 


అనుకూల సంవత్సరం..

అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2019-20కి కంపెనీ లాభం 4 శాతం పెరిగి రూ.1,879.5 కోట్ల నుంచి రూ.1,949.8 కోట్లకు చేరింది. ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.15,385 కోట్ల నుంచి రూ.17,460 కోట్లకు పెరిగింది.  ‘గత ఆర్థిక సంవత్సరం (2019-20) కంపెనీకి చాలా అనుకూలమైన సంవత్సరం. అన్ని తయారీ ప్లాంట్లు నో యాక్షన్‌ ఇండికేషన్‌ హోదాలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న సీటీఓ-6 యూనిట్‌కు వాలెంటరీ యాక్షన్‌ ఇనీషియేటివ్‌ (వీఏఐ) హోదా లభించింది. 2019-20లో అనేక కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించాం. ఉత్పాదకత పెరిగింది. అన్ని వ్యాపారాల పనితీరు  బాగుంద’ని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ ప్రసాద్‌ తెలిపారు. అధిక నిల్వలు, వ్యాపారాల సమ్మేళనంలో మార్పులు 2019-20 నాలుగో త్రైమాసికం స్థూల మార్జిన్లను ప్రభావితం చేశాయని వివరించారు. 


ఉత్తర అమెరికా అమ్మకాల్లో 21శాతం వృద్ధి

మార్చితో ముగిసిన మూడు నెలలకు కంపెనీ గ్లోబల్‌ జనరిక్స్‌ ఆదాయం 20 శాతం పెరిగి రూ.3,640 కోట్లకు చేరింది. కంపెనీకి ప్రధాన మార్కెట్‌ అయిన ఉత్తర అమెరికాలో జనరిక్‌ ఔషధాల విక్రయాలు 21 శాతం వృద్ధితో రూ.1,807.20 కోట్లకు చేరాయి. కొత్త ఔషధాల విడుదల, కోవిడ్‌-19 కారణంగా ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఔషధాల విక్రయాలు పెరగడం ఉత్తర అమెరికా అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయి. యూరోపియన్‌ మార్కెట్‌కు ఇది టర్న్‌ ఎరౌండ్‌ సంవత్సరంగా కంపెనీ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో యూరోప్‌ మార్కెట్‌లో విక్రయాలు 80 శాతం పెరిగి రూ.344.6 కోట్లకు చేరాయి. మొత్తం ఏడాదికి 49 శాతం పెరిగి రూ.1,170.7 కోట్లుగా నమోదయ్యాయి. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ వంటి కొత్త మార్కెట్లలోకి అడుగు పెట్టడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేశాయి. సమీక్ష త్రైమాసికానికి భారత్‌లో విక్రయాలు 5 శాతం మాత్రమే పెరిగి రూ.683.9 కోట్లకు చేరాయి. 


పెట్టుబడులు..

గత ఆర్థిక సంవత్సరంలో  పెట్టుబడులు రూ.485 కోట్లకు పరిమితమైనప్పటికీ.. 2020-21లో రూ.1,000 కోట్లు ఖర్చు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇంజెక్టబుల్‌ యూనిట్‌లో పెట్టుబడులు వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించనుంది. అన్ని వ్యాపార విభాగాల్లో మార్కెట్‌ కంటే అధిక వృద్ధిరేటును సాధించాలని భావిస్తున్నట్లు ప్రసాద్‌ తెలిపారు. కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడే ఔషధాల తయారీపై కంపెనీ దృష్టి పెట్టనుందన్నారు. ఏపీఐలు కోసం చైనాపై ఆధారపడడాన్ని కూడా కంపెనీ తగ్గించుకోవాలని భావిస్తోంది. 2021, జనవరి 30 నుంచి మరో అయిదేళ్ల పాటు జీవీ ప్రసాద్‌ కంపెనీ సహ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగే విధంగా కంపెనీ బోర్డుకు చెందిన నామినేషన్ల కమిటీ నిర్ణయం తీసుకుంది.


Updated Date - 2020-05-21T06:49:07+05:30 IST