డాక్టర్ ఫొటోగ్రాఫర్!

ABN , First Publish Date - 2020-03-09T06:34:17+05:30 IST

బాల్యం నుంచీ డాక్టరు కావాలన్నది ఆమె కోరిక. దాన్ని నిజం చేసుకుని దంత వైద్యురాలైంది. కానీ....

డాక్టర్ ఫొటోగ్రాఫర్!

బాల్యం నుంచీ డాక్టరు కావాలన్నది ఆమె కోరిక. దాన్ని నిజం చేసుకుని దంత వైద్యురాలైంది. కానీ.... జీవిత ప్రయాణంలో ‘నేనేంటీ?’ అనే ప్రశ్న ఒక దశలో ఆమెలో తలెత్తింది. తనను తాను ప్రత్యేకంగా నిరూపించుకోవాలన్న ఆ అభిలాషే ఆమెను ఫోటోగ్రాఫర్‌ని చేసింది! పలు రకాల టాలెంట్స్‌తో తనేమిటో నిరూపించుకుంది. ఆమే నమ్రతా రూపాని. ‘నవ్య’తో ఆమె పంచుకున్న విశేషాలివి...


నాకు ఢిల్లీ కన్నా హైదరాబాద్‌ ఎంతో నచ్చుతుంది. ఇక్కడ కమర్షియల్‌ ఫోటోగ్రాఫర్‌గా ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఎల్‌ అండ్‌ టీ వాళ్లు హైదరాబాద్‌ మెట్రో కన్‌స్ట్రక్షన్‌ వర్కును డాక్యుమెంట్‌ చేసే పని నాకు అప్పగించారు. ఇది నాకొక ఛాలెంజింగ్‌  జాబ్‌. వర్క్‌. లైట్‌, వ్యూలను ఈ ప్రాజెక్ట్‌లో ‘క్యాప్చర్‌’ చేయడం చాలా కష్టం. దాన్ని ఎంతో సంతృప్తికరంగా చేయగలిగా.


‘‘చిన్నతనం నుంచీ నాకు డాక్టర్‌ని కావాలనే కోరిక బాగా ఉండేది. ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌ చేయాలనుకున్నా. ఈస్థటిక్‌ డెంటిస్ట్రీ చేశా. మా అమ్మ, నా సోదరుడు మంచి పెయింటర్స్‌. డాక్టర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఒకానొక క్షణాన నలుగురికీ ఉపయోగపడే పని ఏదీ చేయలేకపోతున్నాననే భావన నాలో ఏర్పడింది. సరిగ్గా అప్పుడే నా దృష్టి ఫొటోగ్రఫీపై పడింది. తర్వాత అదే నా ప్రపంచమైంది. ఇప్పుడు ఏ కాస్త సమయం దొరికినా కెమెరా పట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు తీస్తుంటా. నాకు ఇద్దరు పిల్లలు. నేను ఎక్కడికి వెళ్లినా వాళ్లు నాకూడా ఉంటారు. నాతో పాటు ట్రెక్కింగ్‌ చేస్తారు. 


ఫోటోలు తీస్తూ...

నేను పుట్టింది ఢిల్లీలో. లూధియానాలోని క్రిస్టియన్‌ కాలేజీలో ఈస్థటిక్‌ డెంటిస్ట్రీలో స్పెషలైజేషన్‌ చేశా.  పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డా. 16 ఏళ్లుగా దంతవైద్యురాలిగా సేవలు అందిస్తున్నా. మరోవైపు ఫోటోగ్రఫీపై ఆసక్తితో ‘క్యాప్చర్‌ లైఫ్‌’ అనే కంపెనీ పెట్టా. ఇందులో ఫోటోగ్రఫీ, ఫైన్‌ఆర్ట్‌ ప్రింట్‌ సర్వీస్‌ నడుపుతున్నా. ‘టెడ్‌ టాక్స్‌’ కూడా ఇస్తుంటా. నిజానికి నేను ఫోటోగ్రఫీకి సంబంధించి కమర్షియల్‌ సేవలు చేపట్టాలనుకోలేదు. మా బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగిన వేడుకలకు తీసిన ఫోటోల ద్వారా నలుగురికీ నాగురించి తెలిసింది. అలా కమర్షియల్‌ ఫోటోగ్రఫీ సేవలు అందించడం మొదలెట్టా. సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు చాలా తీశా. సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్య్‌పల పెళ్లి ఫోటోలు నేనే తీశా. నాకొక టీమ్‌ ఉంది. అందులో అందరూ ఆడపిల్లలే పనిచేస్తారు.   


పాత కట్టడాలంటే ప్రాణం...

నాకు ఢిల్లీ కన్నా హైదరాబాద్‌ ఎంతో నచ్చుతుంది. ఇక్కడ కమర్షియల్‌ ఫోటోగ్రాఫర్‌గా ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నా. పాత కట్టడాలు, పాత భవనాల  ఫొటోలు తీయడం చాలా ఇష్టం. ఆ ఫొటోలతోనే నా మొదటి ప్రదర్శన నిర్వహించా. తర్వాత హైదరాబాద్‌లోని ‘గోథె జంత్రమ్‌’లో ‘స్టోరీస్‌ ఇన్‌ స్టోన్‌’ ఫోటో  ప్రదర్శన నిర్వహించా. నేను ఎక్కువగా పోట్రెయిట్స్‌ చేస్తుంటా. ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ, రకకాల జోనర్‌ ఫోటోగ్రఫీలు, పలు ఫోర్టుఫోలియోలు,    నాన్‌ కమర్షియల్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు, బేబీ పోర్ట్‌ఫోలియోలు... ఇలా ఎన్నో తీశా. రకరకాల  జోనర్లతో ప్రయోగాలు చేస్తుంటా. ప్రతీ మహిళా పురుషాధిపత్య సమాజాన్ని దాటి తమలో అంతర్లీనంగా దాగున్న విలక్షణ కోణాన్ని స్వేచ్ఛగా ఆవిష్కరించాలని నా కోరిక. నచ్చిన దాంట్లో విజేతగా నిలవాలంటే క్రమశిక్షణ, కష్టపడటం, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నేర్చుకునే గుణాలు ఉండాలి. 


అవగాహన తరగతులు...

డెంటిస్ట్రీ, ఫోటోగ్రఫీ నాకు రెండు కళ్లు. మానవశరీరం అద్భుతమైంది. ఎంతో ఆసక్తికరమైంది. డాక్టర్‌గా సామాజిక బాధ్యతతో ఓరల్‌ హెల్త్‌ గురించి ప్రజలలో అవగాహన పెంపొందిస్తుంటా. అలాగే ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారికి క్లాసులు చెప్తా. 


టైమ్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యం...

నా తల్లిదండ్రులు సుభాష్‌ మొతీహార్‌, కనికా మోతీహార్‌లు నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. అలాగే నా భర్త కూడా నా అభిరుచులను ప్రోత్సహించారు. చాలామంది మహిళలు వృత్తి, జీవితాన్ని సమతూకం చేసుకోవాలని అంటుంటారు. అయితే పని అనేది జీవితంలో అంతర్భాగమని నేను భావిస్తా. ఇన్ని పనులు చేస్తున్నానంటే నా విజయంలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా కీలకం. అది ఉంటే ఎలాంటి పనైనా గందరగోళం లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం.


నాగసుందరి

ఫొటోలు: రాజేష్‌ జంపాల

Updated Date - 2020-03-09T06:34:17+05:30 IST