పరిశుభ్రతే ఆమె ప్రచారాంశం!

ABN , First Publish Date - 2020-08-10T05:30:00+05:30 IST

‘ఇప్పుడంటే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అని ప్రపంచం మొత్తం నెత్తీనోరూ మొత్తుకుంటోంది గానీ పరిశుభ్రత అన్నది మన ఆచార సంప్రదాయాల్లోనే ఉంది’ అంటున్నారు డాక్టర్‌ ముప్పవరపు నిశ్చిత...

పరిశుభ్రతే ఆమె ప్రచారాంశం!

‘ఇప్పుడంటే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత అని ప్రపంచం మొత్తం నెత్తీనోరూ మొత్తుకుంటోంది గానీ పరిశుభ్రత అన్నది మన ఆచార సంప్రదాయాల్లోనే ఉంది’ అంటున్నారు డాక్టర్‌ ముప్పవరపు నిశ్చిత. పరిశుభ్రతనే ప్రచారాంశంగా ఎంచుకుని తమిళనాడులో ఆరేళ్ళుగా 500కు పైగా శిబిరాలు నిర్వహించిన నిశ్చిత తెలుగమ్మాయి. నెల్లూరులో పుట్టి, గుంటూరులో చదువుకుని, కాంచీపురంలో ఎంబీబీఎస్‌ చేశారు. డెర్మటాలజీలో స్పెషలైజేషన్‌ యూకేలో, ఈస్తటిక్స్‌ మెడిసిన్‌లో డిప్లమో యూఎస్‌లో చదివారు. 21 మంది డాక్టర్లున్న కుటుంబంలో కోడలిగా చెన్నైలో స్థిరపడి వైద్య సేవలందిస్తున్న నిశ్చిత ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలు కూడా. కరోన వేళ పరిశుభ్రత గురించి ఆమె  ఏం చెబుతున్నారంటే...


‘‘మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మమే. దానిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా రోగాలకు దూరంగా ఉన్నట్టే.  ఆలయానికో, మసీదుకో, చర్చికో వెళ్లేటప్పుడు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని వెళ్లాలని పెద్దలు చెబుతారు. ఇదంతా పరిశుభ్రత కోసం పెద్దలు పెట్టిన ఆచారమే.




పోపులపెట్టె మన ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌...

వంటింట్లో పోపులపెట్టెలో ఉండే దినుసులన్నీ ఇప్పుడు కరోనాని ఎదుర్కోవడానికి కావాల్సినంత శక్తినిస్తాయని చెబుతున్నారు. కషాయాలు తాగమంటున్నారు. మనం రోజు వండుకునే ఆహారంలో వీటిని విరివిగా వాడుతుంటాం. మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగం, సోంపు, వాము, ధనియాలు, జీలకర్ర... అన్నీ ఔషధగుణాలున్నవే. పోపు పెట్టకుండా ఏ కూరా వండుకోం. మనకు గాయం అయినా, తలనొప్పి, పంటి నొప్పి వచ్చినా వెంటనే అమ్మ పోపుల పెట్టెలో చేయి పెడుతుంది. పోపుల పెట్టె ప్రథమచికిత్స కిట్‌ లాంటిది.




దిష్టి కూడా మంచిదే!

పేడతో ఇళ్లముందు కళ్లాపి చల్లడం, గుమ్మాలకి పసుపు రాయడం అనేది అనాదిగా వస్తోంది. పేడ యాంటీమైక్రోబియల్‌ (సూక్ష్మక్రిములను చంపేది)గా పని చేస్తుంది. పసుపు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుందని నిర్థారణ అయింది. నల్లేరు, కలబంద వంటివి గుమ్మాలకు వేలాడదీయడం చూస్తుంటాం. దిష్టికోసం అంటారు. నిజానికి ఇవి చాలా రకాల క్రిములనుఇంట్లోకి రాకుండా చూస్తాయి.  




పెరట్లోనే ఇమ్యూనిటీ బూస్టర్స్‌...

పెరట్లో రకరకాల మొక్కలుండడం చూస్తుంటాం. జామ, నిమ్మ, అరటి, ఉసిరి వంటి చెట్లు లేని ఇల్లుండదు. పిల్లలు ఆడుతూ పాడుతూ వాటి పండ్లను కోసుకుని తింటూ ఉంటారు. అలాగే పెరట్లో పెరిగే అనేక కలుపు మొక్కలనే కూరలుగా వండుకుంటాం. ఇప్పుడు వీటినే ‘ఇమ్యూనిటీ బూస్టర్‌లు’గా ప్రచారం చేస్తున్నారు. ‘పెరట్లో ఒక ఆవు, ఒక నిమ్మ చెట్టు ఉంటే చాలు ఆ కుటుంబం బతికిపోతుంది’ అంటుంటారు. వైరస్‌ని ఎదుర్కోవడానికి సి విటమిన్‌ ఎంత అవసరమో ఇప్పుడు చెబుతున్నారు. 




మన శ్రమే మనకు రక్ష!

అమెరికా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో మాత్రమే స్వేచ్ఛగా తిరగగలరు. ఇతర కాలాల్లో అంతగా బయట తిరగలేరు. దాంతో వారికి ఫిజికల్‌ యాక్టివిటీ తక్కువ. కానీ మనం అలా కాదు. ఏ కాలంలోనైనా బయట తిరగగలం. ఆహారమూ అంతే. వారి వాతావరణ పరిస్థితులను బట్టి వారి శరీరానికి కొవ్వు అవసరం. అందుకు అనుగుణంగా వారు ఆహారాన్ని తీసుకుంటారు. మనం ఇడ్లీ, పప్పు, మాంసాహారం... ఇలా అన్ని రకాల ఆహారం తీసుకుంటాం. మన శరీరం ఉష్ణోగ్రతనీ, శీతలాన్నీ తట్టుకునేలా ఉంటుంది. మన దేశంలో అత్యధికశాతం ప్రజలు శ్రమ మీదే ఆధారపడి జీవిస్తున్నారు వీరు ఎండాచలీ అని తేడా లేకుండా పని చేస్తారు. డి3 మాత్రల అవసరం ఎండలో కష్టపడేవాళ్ళకి అవసరమే లేదు. ఇవి మనలో వ్యాధినిరోధకశక్తిని బాగా పెంచుతాయి. అందుకే ఇప్పటికీ పట్టణాల్లో ఉన్నంత తీవ్రంగా కరోనా వైరస్‌ పల్లెలను తాకలేదు. అమెరికా, ఇటలీ, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో వైరస్‌ సోకినవారిలో ఎక్కువమందికి వెంటిలేటర్లు అవసరం అయ్యాయి. మనం క్వారెంటైన్‌తోనే బయటపడుతున్నాం. ఇదంతా మన శ్రమ సంప్రదాయం మహిమే. 




పిల్లలకు పాత అలవాట్లు నేర్పిద్దాం!

వ్యాక్సీన్‌ వచ్చేదాకా కరోనా నుంచి మనల్ని కాపాడేది మన శరీరమే. వైరస్‌ వ్యాప్తి తీవ్రతను చూస్తే అది దాదాపుగా అందరినీ తాకుతుంది. భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం వంటి జాగ్రత్తలతో పాటూ... ఒకవేళ కరోనా బారిన పడినా దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేయాలి. రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తొందరగా తినడం, కంటినిండా నిద్రపోవడం, వ్యాయామం వంటివి తప్పనిసరి చేసుకోవాలి. వీటిల్లో చాలా మన ఆచార సంప్రదాయాల్లోనే ఉన్నాయి. కాకపోతే వీటికి దూరమైన కొత్తతరానికి పెద్దలు పాత అలవాట్లు నేర్పించాలి. కరోనా కాలం ముగిసినతర్వాత కూడా నేటితరం ఈ పద్ధతులను పాటించేలా చూడాలి’’. 


పేదల కాలనీలే నా కార్యక్షేత్రం!

చెన్నై శివారు ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్లి, అక్కడి కార్మికులకు పరిశుభ్రతపై అవగాహనా శిబిరాలు నిర్వహిస్తుంటాను. ఒక్కసారి వెళ్లి ఏదో స్పీచ్‌ ఇచ్చేసి వస్తే సాధ్యం కాదు. ఒకే దగ్గర వరుసగా మూడు నెలల పాటు శిబిరాలు నిర్వహిస్తాను. తొలినాటికి, మలినాటికి వారు ఎలా ఉన్నారనే దానిపైనా అంచనా వేసుకుంటాను. అంతిమంగా వారికి అవగాహన కలిగిందనిపించాకే వదిలేస్తాను. ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది వారి చేతే చెప్పిస్తాను. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తాను. నాతోపాటు మా వారు డాక్టర్‌ బాలాజీని కూడా తీసుకెళతా. మనం చెప్పేదానిపట్ల పిల్లలకు ఎందుకు శ్రద్ధ ఉంటుంది? అందుకే వారికి రకరకాల బహుమతులు తీసుకెళ్తాం. చిన్నపిల్లలు కదా! అలాగైనా ఇంట్రస్ట్‌గా వింటారన్నదే నా ఉద్దేశం. ఆ గిఫ్ట్‌ సైకిల్‌ లేదా ఆట వస్తువు అయి ఉంటుంది. అది కూడా వారి చేత ఎక్సర్‌సైజ్‌ చేయించేలా ఉంటుంది. అలాగే డెట్టాల్‌, ఆయిల్‌, యాంటీ డ్యాండ్రఫ్‌ షాంపూలు వంటివి తీసుకెళ్లి పంపిణీ చేస్తుంటాం. సొంత ఖర్చులతోనే ఆరేళ్ళుగా పరిశుభ్రతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.


- ఎస్‌కెఎండి గౌస్‌బాష, చెన్నై

ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌


Updated Date - 2020-08-10T05:30:00+05:30 IST