Abn logo
Nov 29 2020 @ 00:46AM

డాక్టర్‌ దారుణ హత్య

అవనిగడ్డ టౌన్‌, నవంబరు 28 : అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన డాక్టర్‌ కోట శ్రీహరిరావు(65) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ శ్రీహరిరావు భార్య, కుమార్తె శుక్రవారం మధ్యాహ్నం ఊరుకు వెళ్లారు. డాక్టర్‌ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. తెల్లవారుజామున ఆయన బయటకు వెళ్లాల్సి ఉంది. ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో వైద్యశాలలో ఉన్న నర్సు ఫోన్‌ చేశారు. స్పందన రాకపోవడంతో పై అంతస్తులోకి వెళ్లి చూసింది. తలుపు తెరిచి ఉంది. పిలిచినా పలకక పోవటంతో లోపలకు వెళ్లి చూడగా, పడకగదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న డాక్టర్‌ శ్రీహరిరావు కనిపించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్‌ మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానా స్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సీసీ కెమెరాల్లో పడకుండా..
ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పైకి తిప్పి ఉండటం, కనెక్షన్లను సైతం కత్తిరించి ఉండటంతో మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్‌ భాష, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ రవికుమార్‌, ఎస్సై సందీప్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలు సేకరిస్తున్నాయన్నారు. 


Advertisement
Advertisement
Advertisement