Jul 1 2021 @ 15:50PM

‘డాక్టర్‌’కు ఎగ్జిబిటర్ల సెగ

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌, ప్రియాంకా మోహన్‌ నటించిన కొత్త చిత్రం ‘డాక్టర్‌’. కరోనా రెండో దశ వ్యాప్తి, లాక్‌ డౌన్‌కు ముందే నిర్మాణాంతర పనులన్నీ పూర్తి చేసుకోగా, ఏప్రిల్‌ నెలాఖరులో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా రెండో వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేశారు. దీంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ కేజేఆర్‌ స్టూడియో నిర్ణయించింది. ‘డాక్టర్‌’ మూవీకి హాట్‌స్టార్‌ భారీ రేటు ఆఫర్‌ చేయడంతో నిర్మాణ సంస్థ కూడా ఓకే చెప్పింది. వాస్తవానికి థియేటర్‌ యజమానులు ‘డాక్టర్‌’, ‘వలిమై’, ‘మానాడు’ వంటి చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

కరోనా కష్టకాలంలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల చిత్రాలు విడుదలైతే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని భావించారు. కానీ ‘డాక్టర్‌’ చిత్ర నిర్మాత తీసుకున్న నిర్ణయం థియేటర్ల యజమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో తమ వ్యతిరేకతను వెల్లడిస్తున్నారు. పైగా, ‘డాక్టర్‌’ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయించేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం లాబీయింగ్‌కు థియేటర్‌ యజ మానుల సంఘం నడుంబిగించింది. మరి థియేటర్‌ యజమానుల కృషి ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. కాగా, ఈ నెల రెండో వారం నుంచి రాష్ట్రంలో థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వొని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.